ప్రాణం తీసిన ఉన్నతాధికారి వేధింపులు

letterతోటి ఉద్యోగికి సహాయ సహకారాలు అందించాల్సిన ఉన్నతాధికారి..సూటి పోటి మాటలతో వేధింపులకు పాల్పడ్డాడు. కింది స్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన  ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్…కులం పేరుతో దూషించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మృతికి కారణమయ్యాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో జరిగింది.

ఎండపల్లికి చెందిన దేవి శ్రీకాంత్‌(30) ఏడాదిన్నర క్రితం TSPSC నియామకాల ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE)గా ఉద్యోగం సాధించాడు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో విజిలెన్స్‌, నాణ్యత నియంత్రణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా నిర్మల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) రఘువీరారెడ్డి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాలంటూ డిమాండ్ చేసేవాడు. అయితే శ్రీకాంత్‌ దీనికి అంగీకరించకపోవడంతో కులం పేరుతో  సూటిపోటి మాటలు అనడంతో పాటు వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు భార్య శ్రీలక్ష్మితో చెప్పి ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాంత్‌ ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. భార్య, కుటుంబ సభ్యులు ఆచూకీ తెలుసుకొని ఆయన్ను తీసుకురాగా శుక్రవారం (ఆగస్టు 11)న తిరిగి విధుల్లో చేరారు. తర్వాత శ్రీకాంత్‌ను రఘువీరారెడ్డి మంచిర్యాలలోని తన కార్యాలయానికి పిలిపించుకుని ‘మళ్లీ విధుల్లో ఎందుకు చేరావురా..’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి కులం పేరిట దూషించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్‌ ఈ నెల 22న ఈఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి అధికారులకు మెయిల్‌ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని భార్య శ్రీలక్ష్మికి మొబైల్ ద్వారా చెప్పి కనిపించకుండా పోయారు. దీంతో తన భర్తను వేధిస్తున్న EEపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీలక్ష్మి బుధవారం (ఆగస్టు23) వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ కోసం వెతుకుతుండగానే గురువారం (ఆగస్టు 24)ఉదయం గుల్లకోట శివారులోని సొంత వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించారు. శ్రీకాంత్‌ మృతికి కారణమైన EEపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జగిత్యాల-రాజారాంపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. మృతుడి భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy