
మొత్తం పది మంది నిందితుల్లో ఐదుగురిపై విచారణ పూర్తి కాగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో సందీప్ వి డాంగే, రాంచందర్ కల్సంగర్, అమిత్ చౌహన్ ఉన్నారు. తేజ్‌రామ్ పార్మార్ పై విచారణ కొనసాగుతుంది. సునీల్ జోషీ అనే నిందితుడు హత్యకు గురయ్యాడు.
2007 మే 18వ తేదీన మధ్యాహ్నం 1.18 గంటలకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో వందల మంది ప్రార్థనలు చేస్తున్నారు. పేలుడు తీవ్రతకు 14 మంది మరణించగా, 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తునకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. విధ్వంసకారులు మూడు ఐఈడీ బాంబులను అమర్చినట్టు సిట్ గుర్తించింది. వాటిలో ఒక దాన్ని టైమర్‌తో పేల్చగా, మరో రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు. పేలిన బాంబును బరువైన బండరాయి కింద పెట్టడంతో ప్రాణనష్టం పెద్దగా జరుగలేదని పోలీస్ అధికారులు తెలిపారు. కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో 2010లో సీబీఐకి అప్పగించారు. సీబీఐ లోతైన దర్యాప్తు జరిపి దేవేందర్ గుప్తా, లోకేశ్‌శర్మను సూత్రధారులుగా గుర్తించి, మరికొందరి పేర్లు జత చేస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 మే లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసును విచారణకు స్వీకరించి.. 10 మంది నిందితుల పేర్లతో చార్జిషీట్ దాఖలు చేసింది.