ప్లేఆఫ్‌కు స‌న్‌రైజ‌ర్స్‌: ఇర‌గ‌దీసిన వార్న‌ర్‌, విజ‌య్‌

warnerతప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో వార్నర్ సేన మెరిసింది. కాన్పూర్ గ్రీన్‌పార్క్ వేదిక‌గా గుజ‌రాత్ ల‌య‌న్స్ స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో వార్న‌ర్ సేన విజ‌యం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ క‌న్ఫామ్ చేసుకుంది. 154 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ జ‌ట్టు శిఖ‌ర్ ధ‌వ‌న్ మెరుపుల‌తో మంచి స్టార్ట్ అందుకుంది. మంచి ఊపుమీద క‌నిపించిన ధ‌వ‌న్‌ను ప్ర‌వీణ్ కుమార్ స్లో డెలివ‌రితో బోల్తా కొట్టించాడు. దీంతో 11 బంతుల్లో 18 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ పెవీలియ‌న్ చేరాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన హెన్రిక్స్  4 ప‌రుగులు మాత్ర‌మే చేసి ప్ర‌వీణ్ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 25 ప‌రుగుల‌కే 2 కీల‌క వికెట్ల‌ను స‌న్‌రైజ‌ర్స్ కోల్పోయింది. ఈ స‌మ‌యంలోనే కెప్టెన్ వార్న‌ర్‌తో జ‌త క‌ట్టిన విజ‌య్ శంక‌ర్ అద్భుతంగా ఆడాడు. ఓ వైపు వార్న‌ర్ వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తుంటే.. విజ‌య్ వార్న‌ర్‌కు చ‌క్క‌టి స‌హ‌కారం అందించాడు. ఈ క్ర‌మంలోనే వార్న‌ర్ త‌న అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మ‌రో వైపు విజ‌య్ శంక‌ర్ కూడా బంతిని బౌండ‌రీ దాటిస్తూ చ‌క్క‌టి బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుని ఐపీఎల్ లో తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 18వ ఓవ‌ర్లో విజ‌య్ బంతిని బౌండ‌రీకి త‌ర‌లించి స్కోరు స‌మం చేశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లతో 63 ప‌రుగులు చేసి శెహ‌భాష్ అనిపించుకున్నాడు విజ‌య్ శంక‌ర్‌. ఇన్నింగ్స్ 19 వ ఓవ‌ర్లో  అంకిత్ సోనీ వేసిన తొలి బంతిని వార్న‌ర్ బౌండ‌రీకి త‌ర‌లించి జ‌ట్టు విజ‌యాన్ని ఖాయం చేశాడు.  52 బంతుల్లో వార్నర్ 9 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ఒక్క సిక్సు కూడా లేకపోవడం విశేషం.ఈ విజ‌యంతో ఎలాంటి లెక్క‌లు లేకుండానే 17 పాయింట్ల‌తో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది.

అంతకుముందు హైద‌రాబాద్ టాస్ గెలిచి గుజ‌రాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఓపెన‌ర్లు కిష‌న్‌, డ్వేన్ స్మిత్ తొలిబంతి నుంచే చెల‌రేగిపోయారు. ఫ‌లితంగా ప‌వ‌ర్‌ప్లే ముగిసే స‌మ‌యానికి జ‌ట్టు స్కోరును 60 ప‌రుగులకు చేర్చారు. 11వ ఓవ‌ర్లో ర‌షీద్ ఖాన్ హైద‌రాబాద్‌కు తొలివికెట్‌ను అందించాడు. అప్ప‌టికే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసిన స్మిత్‌ను ఎల్బీడ‌బ్ల్యూ చేసి పెవీలియ‌న్‌కు పంపాడు. 33 బంతుల్లో 54 ప‌రుగులు చేశాడు స్మిత్ . ఇందులో 2భారీ సిక్సులు, 7 ఫోర్లున్నాయి. 9 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే మ‌రో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. 40 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు ఇషాన్. వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రైనా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు , కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి సిరాజ్ బౌలింగ్‌లో బౌండ‌రీ వ‌ద్ద శిఖ‌ర్ ధావ‌న్‌కు చిక్కాడు. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో హూడా అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డం ద్వారా దినేష్ కార్తీక్ ప‌రుగులేమీ చేయ‌కుండాన్ డ‌క్కౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవ‌ర్లో ఆరోన్ ఫించ్ వికెట్‌ను ర‌షీద్ తీయ‌డంతో జ‌ట్టు స్కోరు మంద‌గించింది. అంత‌కు ముందు ఓవ‌ర్ 10 ర‌న్‌రేట్‌తో గుజ‌రాత్ స్కోరు ఉర‌క‌లు తీసింది. జేమ్స్ ఫాల్క్‌న‌ర్, ప్ర‌దీప్ సంగ్వాన్‌ల వికెట్ల‌ను సిరాజ్ తీసి గుజ‌రాత్‌ను దెబ్బ‌కొట్టాడు. ఆ త‌ర్వాత చివ‌ర్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప్ర‌వీణ్ కుమార్, మునాఫ్ ప‌టేల్‌ల‌ను ఔట్ చేయ‌డంతో గుజ‌రాత్ ల‌యన్స్ 154 ప‌రుగులు చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy