‘‘ఫిదా’’ అవ్వాల్సిందే

Fidaa Movie Poster Designs (4)రివ్యూ: ఫిదా

రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు

నటీనటులు: వరుణ్ తేజ్,సాయి పల్లవి,

మ్యూజిక్: శక్తి కాంత్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్ బాబు.

సినిమాటోగ్రఫీ: విజయ్.సి.కుమార్

ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్

నిర్మాత: దిల్ రాజు

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్: జులై 21,2017

ఇంట్రో:

ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల గత కొంతకాలంగా తన మార్కు చూపించలేక కాస్త వెనుకపడ్డాడు. లేటెస్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘‘ఫిదా’’ అంటూ ముందుకొచ్చాడు. ప్రేమమ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన సాయి పల్లవి హీరోయిన్ గా చేయటం, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిచటం లాంటివి ‘‘ఫిదా’’ మూవీకి హైప్ తీసుకొచ్చాయి. మరి శేఖర్ కమ్ముల తన మార్కు ఫీల్ గుడ్ మూవీ తీసి, వరుణ్ తేజ్ కు హిట్టిచ్చాడా లేదా అన్నది తెలుసుకుందాం.

కథేంటి.?

అమెరికాలో ఉంటున్న వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్యకి పెళ్లి సంబంధం కోసం తెలంగాణ లో బాన్సువాడకి వస్తారు. అక్కడ వరుణ్ అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి భానుమతి (సాయి పల్లవి) అని ఓ చెల్లి ఉంటుంది. ఆమె చేసే అల్లరితో ఆ పెళ్లిలో వరుణ్, భానుమతి అనుకోకుండా ఒకరికి ఒకరు తెలియకుడా ప్రేమలో పడతారు. అయితే అనుకోని పరిస్థితిలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. దీంతో ఇద్దరు ఒకరిని ఒకరు ద్వేచించుకునే వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ మధ్య మనస్పర్థలకి అసలు కారణం ఏమిటి? మరల వరుణ్, భానుమతి ఇద్దరు ఎలా ఒకటయ్యారు? అనేది సినిమా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఫిదా సినిమాకు సాయి పల్లవి మెయిన్ హైలెట్. ప్రేమమ్ మూవీతో మెస్మరైజ్ చేసిన ఈమె ఇప్పుడు తెలుగు కుర్రకారు మతులు పోగొట్టిందనే చెప్పాలి. ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, డాన్సులు, స్మైల్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. అంతేకాదు తెలంగాణ యాసతో తను సొంతంగా చెప్పిన డైలాగ్స్ కు అందరూ ‘‘ఫిదా’’ అవ్వాల్సిందే. ఇక వరుణ్ తేజ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. తన లవ్ విషయంలో ఎటూ తేల్చుకోకుండా మథనపడే కుర్రాడిగా వరుణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించాడని చెప్పొచ్చు. సత్యం రాజేష్ అక్కడక్కడా నవ్వించాడు. హీరోయిన్ అక్క, బావ లుగా నటించిన శరణ్య ప్రదీప్, రాజాల నటన బాగుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించిన సాయి చంద్ తండ్రిగా ఒదిగిపోయారు.

టెక్నికల్ వర్క్:

విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్ప్ అయింది. ఫస్టాఫ్ లో తెలంగాణ అందాలను, సెకండాఫ్ లో అమెరికా అందాలను బాగా చూపించాడు. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. జీవన్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ ను చక్కగా క్యారీ చేసింది. ఎడిటింగ్ బాగుంది.శేఖర్ కమ్ముల సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

‘‘ఫిదా’’ ఓ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్. ప్రేమికుల మధ్య జరిగే రొమాన్స్, ఎమోషన్స్, ఇగోస్, చిన్న చిన్న మనస్పర్థలను డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అద్భుతం. తెలిసిన కథలాగే అనిపించినా తన మార్కు టేకింగ్ తో సినిమాలో లీనమయిపోయేట్టు చేశాడు కమ్ముల. హీరోహీరోయిన్లిద్దరికి బలమైన క్యారెక్టర్లు రాసుకొని ఈ సినిమాకు ప్రధాన బలం చేకూర్చాడు డైరెక్టర్. అంతేకాదు ప్రతి క్రాఫ్ట్ మీద కమ్ముల కమాండ్ కనిపించిందీ సినిమాలో. ఇప్పటి వరకు సినిమా లొకేషన్స్ అంటే కోనసీమ అందాలే చూసిన మనకు శేఖర్ కమ్ముల తెలంగాణ అందాలను సరికొత్తగా చూపించాడు. అంతే కాదు తెలంగాణ కల్చర్, యాసను చక్కగా చూపించి వహ్వా అనిపించాడు. ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైనింగ్ గా సాగిపోతుంది. సాయిపల్లవి, డైలాగులు, హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్ లో కథ అమెరికా షిఫ్ట్ అయిన తర్వాత ఎమోషనల్ గా సాగుతుంది. వరుణ్, సాయి పల్లవిల మధ్య కాన్ ఫ్లిక్ట్ మరీ సాగినట్టు అనిపించినా కానీ వాళ్లతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. వాళ్లు విడిపోతున్నప్పుడు జరిగే మానసిక సంఘర్షణ చూసి మన గుండె బరువెక్కుతుంది. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత క్లైమాక్స్ లో వాళ్లొక్కటయినప్పుడు సంతోషపడతాం. ఇలాంటి ఎమోషన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఇంత బాగా రాసుకున్నందుకు, తీసినందుకు శేఖర్ కమ్ములను అభినందించాల్సిందే. ఓవరాల్ గా ఈ మధ్య వచ్చిన జెన్యూన్ ప్రేమకథల్లో ‘‘ఫిదా’’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆద్యంతం అలరించేలా ఉన్న ఈ సినిమాకు అందరూ ‘‘ఫిదా’’ అయిపోయడం ఖాయం.

బాటమ్ లైన్: ‘‘ఫిదా’’ అవ్వాల్సిందే

రేటింగ్ : 3.25/5

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy