బంగారు బాబా అరెస్ట్

gold babaఇంట్లో ప్రత్యేక పూజల పేరుతో వచ్చీరాని మంత్రాలను పఠిస్తూ.. మత్తు కలిపిన తీర్థ, ప్రసాదాలిచ్చి… వారు మత్తులోకి జారుకోగానే ఇంట్లో ఉన్న సొత్తునంతా ఊడ్చుకెళతాడు.. ఇలా ఎంతో మందిని అమాయకులను మోసం చేసిన ఓ దొంగ బాబాను శుక్రవారం హదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 1.2 కిలోల బంగారు నగలు, రూ.4.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతని పై తెలుగురాష్ట్రాల్లోని పంజాగుట్ట, ఆసీఫ్ నగర్‌, శ్రీకాళహస్తి, విశాఖపట్టణం, ఖమ్మంజిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 కేసులున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా నీలాద్రిరావుపేటకు చెందిన నేదూరి శ్రీను అలియాస్ సత్యనారాయణ. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. చేసేది లారీ క్లీనర్ పని. భగవద్గీత శ్లోకాలు, మంత్రతంత్రాలు నేర్చుకున్నాడు. అయ్యవారికి విలాసాలు ఎక్కువ. దీంతో భక్తుల అమాయకత్వమే పెట్టుబడిగా చేసుకొని స్వామిజీగా అవతారమెత్తాడు.

నాలుగేళ్ల క్రితం శ్రీనును తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. చేయని నేరానికి జైలుకు పంపారనే కోపం, అవమానంతో స్వగ్రామం నుంచి బయటకు వచ్చాడు. వేషభాషలు మార్చేశాడు. వారణాసి, మధురై, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలు తిరుగుతుండేవాడు. అక్కడకు వచ్చిన భక్తులతో మాటలు కలిపేవాడు. తాను శివభక్తుడినని బంగారం సృష్టించే విద్యవచ్చని మాయమాటలతో వారిని బుట్టలో వేసుకునేవాడు. డబ్బుంటే చిటికెలో సగం ధరకే పసిడి ఇప్పిస్తానంటూ ఆశ కల్పించేవాడు. చెన్నైలో తనకు జువెలరీ షాపు, ఆధ్యాత్మిక ఆశ్రమం ఉన్నాయంటూ నమ్మకం కలిగించేవాడు. భక్తులకు అనుమానం రాకుండా బంగారు ఆభరణాలు ధరించేవాడు. ఈ క్రమంలో విశాఖపట్టణంలో విజయారెడ్డి అనే కార్పొరేటర్‌ ఇంట్లో బంగారం సృష్టించేందుకు పూజలు చేస్తానంటూ చేరాడు.

పూజాకార్యక్రమాలు ముగిశాక తీర్థంలో నిద్రమాత్రలు కలిపి తాగించాడు. వారంతా మత్తులోకి జారుకోగానే ఇంట్లోని విలువైన వస్తువులు చోరీచేసి జారుకున్నాడు. అలాగే గతేడాది డిసెంబరు 17న విశాఖలోని ఎస్‌బీఐ క్యాషియర్‌ నారాయణరెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించి ‘తీర్థం’ తాగించి ఇంట్లో బంగారు నగులు, డబ్బుతో ఉడాయించాడు. ఇక తిరుపతి, వారణాసి, శ్రీశైలం, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పరిచయమైన భక్తులను లాడ్జిలకు పిలిపించుకొని ఇలాగే మోసాలకు పాల్పడ్డాడు. తనకు భక్తులు ఇచ్చే బంగారు నగలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ ఎంతోమందికి బురిడీ కొట్టించాడు. ఈ విధంగా శ్రీశైలంలో హైదరాబాద్‌ వాసి శ్రీనివాసరెడ్డికి తనకు తాను ఓ జువెలరీ షాపు యజమానిగా పరిచయం చేసుకున్నాడు. పంజాగుట్టలోని ఓ లాడ్జ్‌కు పిలిపించుకున్నాడు. వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన తీర్థమని నమ్మించి నిద్రమాత్రాలు కలిపిన నీటిని తాగించాడు. అతడు అపస్మారకస్థితికి చేరగానే 5 తులాల బంగారం, రూ.1.2లక్షల నగదు తీసుకొని పారిపోయాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సత్యనారాయణను అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy