బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా

kaka-bang-end-frameబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా.. మాస్ లీడర్ గా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు కాకా వెంకటస్వామి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చివరి వరకు పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు పరితపించారు కాకా. ఇవాళ్టికి ఆయన చనిపోయి రెండేళ్లు గడిచినా.. ఆ చేదు నిజాన్ని నమ్మలేకున్నారు జనం.అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నేతగా పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి. పేదల పక్షపాతిగా.. కార్మిక నేతగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. అసలు సిసలైన జననేతగా నిలిచారు.సాయుధ తెలంగాణ పోరాటం నుంచి.. తెలంగాణ సాకారం వరకు చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయం. తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేదాకా జీవించే ఉంటానని ధీమాగా చెప్పిన కాకా.. రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూశారు.

1929 అక్టోబర్ 5న హైదరాబాద్ లో జన్మించారు గడ్డం వెంకటస్వామి. తల్లిదండ్రులు మల్లయ్య, పెంటమ్మ. మొదట కుటుంబ పోషణకు బిజినెస్ చేసిన కాకాను.. అప్పటి పరిస్థితులు రాజకీయాల వైపు మళ్లేలా చేశాయి. పేదల కోసం గుడిసెల పోరాటం, కార్మికుల హక్కుల కోసం పోరాటాలతో జనం నాయకుడిగా ఎదిగారు కాకా వెంకటస్వామి. 1957 నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన సుదీర్ఘ రాజకీయ అనుభవం కాకా సొంతం.

పేదల అభ్యున్నతికి.. వారికి కనీసం గూడు ఉండాలన్న లక్ష్యాన్ని.. ఉద్యమంగా చేపట్టిన ఘనత కాకాది. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో.. దేశవ్యాప్తంగా 2 వేల మురికివాడల్లో ఆయన వేయించిన 2 లక్షల గుడిసెలు.. కాలక్రమంలో.. ప్రస్తుతం కాలనీలుగా మారాయి. పేదవాళ్లకు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో.. జాతీయ స్థాయిలో గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు కాకా. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు.

కేంద్ర మంత్రిగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయించి మహిళలకు 50 శాతం కోటా కల్పించారు కాకా. ప్రైవేట్ రంగంలో రిటైర్మెంట్ తర్వాత కార్మికులు రోడ్డునపడడాన్ని చూసి చలించి.. వారి కోసం పెన్షన్ స్కీంను అమల్లోకి తెచ్చారు. కోల్ మైన్స్ కార్మికుల కోసం ఎంతో కృషిచేశారు కాకా. ఆనాడు నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచుకు చేరిన సింగరేణికి  400 కోట్లు కేంద్రం నుంచి  ఆర్థికసాయం ఇప్పించి  సంస్థను నిలబెట్టడంలో కాకా కీలకపాత్ర పోషించారు.

కాకా చేసిన కృషితో.. ఎస్సీ, ఎస్టీ పిల్లలు సామాజికంగా ఎదిగేందుకు అవకాశం కలిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో.. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాయి. కార్పొరేట్ చదువులు పేదల చెంతకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అంతేకాదు హైదరాబాద్ లో సొంతంగా కాకా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాలేజీ అంచలంచెలుగా ఎదిగి.. ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

పదవి ఏదన్నది కాదు.. ఏ స్థాయిలో ఉన్నామన్నదీ కాదు. జనానికి ఎంత సేవ చేశాం.. ఏం సహాయం చేశాం. ఇదీ.. కాంగ్రెస్ కురువృద్ధుడు కాకా చెప్పిన మాటలు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయన చూపించిన శ్రద్ధే.. కాకాను అసలు సిసలైన రాజకీయ నేతగా ఎదిగేలా చేసింది. తుది శ్వాస వరకు పేదల అభ్యున్నతికే పరితపించిన కాకా.. సరిగ్గా ఇదే రోజు ఇంక సెలవంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన ఆశయాలు మాత్రం.. ఎప్పటికీ మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy