బతికుండగా మళ్లీ కనిపించను : చావు పార్టీ ఇచ్చిన వ్యాపారవేత్త

sator

చావు.. మరణ ఘడియలు దగ్గర పడుతున్నాయంటే ఎవరైనా సరే డీలా పడిపోతారు. అయ్యో చనిపోతున్నానా అని దిగులు పడతారు. ఈ జీవితం అయిపోతుంది.. అందర్నీ విడిచి వెళ్లిపోతున్నాను అనే బాధతో కుంగిపోతారు. వీళ్లందరికీ భిన్నంగా.. ఎంతో గుండె నిబ్బరంగా చావు పార్టీ ఇచ్చాడు అందరికీ. అతను ఎవరో కాదు. జపాన్ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సతోరు అంజకి. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్ మిషన్లు తయారు చేసే కొమత్సుకి అనే కంపెనీకి మాజీ అధ్యక్షుడు. అతని వయస్సు ఇప్పుడు 80 సంవత్సరాలు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వ్యాపారవేత్త సతోరు అంజకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది. అక్టోబర్ నెలలో వ్యాధిని గుర్తించారు. చికిత్స చేసినా.. ఆరు నెలల కంటే ఎక్కువ బతకరు అని డాక్టర్లు కూడా తేల్చిచెప్పారు. అంటే 2018 ఏప్రిల్, మే నెలలో తన చావు గ్యారంటీ అని తేలిపోయింది. ఈ వయస్సు బాధపడి లాభం లేదు అనుకున్నాడు అంజకి. ఈ 80 సంవత్సరాల్లో తన జ్ణాపకాలను అందరితో పంచుకోవాలని నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగానే అతిపెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. చిన్ననాటి మిత్రులు, వ్యాపార స్నేహితులు, తన కంపెనీలో పని చేసే వెయ్యి మంది ఉద్యోగులు, తన ఎదుగుదలలో సహాయసహకారాలు అందించిన అందరి లిస్ట్ రాసుకున్నాడు. అందరికీ ఇన్విటేషన్లు పంపించాడు. ఎండ్ ఆఫ్ లైఫ్ పార్టీ పేరుతో ఆహ్వానాలు పంపించాడు. బతికుండగా మళ్లీ నేను మిమ్మల్ని కలుస్తానో లేదో. ఇది నేను ఇచ్చే చివరి పార్టీ. మిమ్మల్ని మళ్లీ చూడలేను. అందరూ తప్పకుండా రండి అని ఆహ్వానించాడు. ఈ ఆహ్వానం అందుకున్న అందరూ షాక్ అయ్యారు.

అంతేకాదండీ.. నవంబర్ 20వ తేదీన జపాన్ న్యూస్ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చాడు. వ్యక్తిగతంగా ఎవరినైనా మిస్ అయితే క్షమించాలి.. ఈ ప్రకటనే ఆహ్వానంగా మన్నించి రండి అని పిలుపునిచ్చాడు. జపాన్ రాజధాని టోక్యోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గా పార్టీ అరేంజ్ చేశాడు. అందరూ హాజరుకావాలని కోరాడు. దీంతో పార్టీకి 2వేల మందిపైనే హాజరయ్యారు. అందరితో ఫొటోలు దిగాడు. అందర్నీ పేరుపేరున పలకరించాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నా జీవితం సంపూర్ణం కావటానికి మీ సహాయసహకారాలు మరువలేనివి అని ధన్యవాదాలు చెప్పాడు. ఎప్పుడూ నిరాశతో బతకలేదని.. పరిపూర్ణమైన జీవితం అనుభవించానని చెప్పాడు. అందరితో అనుభవాలను పంచుకున్నాడు. ఇదే చివరి చూపు, మాట కావొచ్చు అని ప్రకటించాడు. చివరి రోజులను ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకుంటున్నానని.. అందుకే అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నట్లు తెలిపాడు. అంజకి.. జపాన్ దేశం పబ్లిక్ సేఫ్టీ కమిషన్ లో సభ్యుడిగా కూడా పని చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy