బహుభాషా కోవిదుడు : పీవీ నరసింహారావు

PV-Narasimha-Raoబహుభాషా కోవిదుడు.. ఆర్థిక సంస్కరణల పితామహుడు.. పరిపాలనాదక్షుడు.. రాజకీయ చాణక్యుడు… ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయుడు. ఇలా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడు కన్నుమూసి ఇవాల్టికి (డిసెంబర్- 23) 13 ఏళ్లు. అంటే ప్రధానిగా పనిచేసిన తెలుగువాడు మాత్రమే కాదు. బహుముఖ ప్రజ్ఞ అన్న పదానికి అర్థం చెప్పిన అసలు సిసలు మేధావి. 18 భాషల్లో పట్టు… మహా గ్రంథాల అనువాదం… సొంత రచనలు… కవిత్వం… స్వేచ్ఛకోసం పోరాటం… రాజకీయం… సంప్రదాయాల్ని గౌరవిస్తూనే సంస్కరణలు తీసుకురాగల విశాలమైన ఆలోచనలు. ఇలా మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పల్లెలో పుట్టి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలంగాణ ప్రముఖుల్లో పీవీది ఫస్ట్ ప్లేస్. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్మాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న పీవీ జన్మించారు. కరీంనగర్ జిల్లా వంగర వాసులు రంగారావు, రుక్మిణమ్మ దంపతులకు దత్త పుత్రుడిగా వెళ్లారాయన. 1938లో హైదరాబాద్ కాంగ్రెస్ లో చేరారు. నిజాం కు వ్యతిరేకంగా వందేమాతరం పాడి ఓయూ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తర్వాత.. నాగ్ పూర్ వర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1951 లో ఏఐసీసీ మెంబర్ అయ్యారు.

1952 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన పీవీ.. కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1957 నుంచి 1972 వరకు మంథని ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత.. 1971 సెప్టెంబర్ లో రాష్ట్ర సీఎం అయ్యారు. ఆ సమయంలో ముల్కీ రూల్స్ పై సుప్రీం తీర్పునివ్వడంతో సీమాంధ్ర నేతలు జై ఆంధ్రా ఉద్యమం చేపట్టారు. కొందరు మంత్రులు రాజీనామా చేయడంతో.. 1973 జనవరి 8న పీవీ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించారు. ఆ మర్నాడే అసెంబ్లీని రద్దు చేసిన కేంద్రం.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. పీవీని 1973లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఇందిరాగాంధీ. తర్వాత 1977 లో వరంగల్ జిల్లా హన్మకొండ, 1984 లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. 1991లో రాజీవ్ హత్య తర్వాత.. పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో.. మాజీ ప్రధాని మన్మోహన్ ను ఆర్థిక మంత్రిగా నియమించి దేశంలో సంస్కరణలు తీసుకొచ్చారు.

రాజకీయాలతో తీరిక లేని పీవీ.. మరోవైపు తన సాహిత్యాభిలాషను కూడా కొనసాగించారు. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగల నవలను సహస్రఫణ్ గా హిందీలోకి అనువదించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇన్ సైడర్ పేరుతో ఆయన రాసిన ఆత్మకథ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక.. మాతృభాష తెలుగు సహా 18 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం పీవీకే సాధ్యమైన మరో ఘనత.
ఇంతటి మహోన్నత వ్యక్తి అయిన పీవీ.. 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. మాజీ ప్రధాని వర్థంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy