బీకేర్ ఫుల్ రైడర్స్ : ఆగస్ట్ నుంచి పాయింట్లు విడుదల

traffic-rulesమీరు వాహన చోదకులా… తస్మాత్‌ జాగ్రత్త.. ముందు వెనుకా చూసుకుని బండి నడపండి. లేదంటే మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే పకడ్బందీగా పాయింట్ల లెక్కలు వేసి మరీ రద్దు చేసేస్తారు. దీనికి తోడు జరిమానాలు షరా మామూలే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉల్లంఘనుల్ని కట్టడి చేసేందుకు.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ‘పెనాల్టీ పాయింట్‌ సిస్టం’కు శ్రీకారం చుట్టారు పోలీసులు. 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే… గీత దాటినట్లే. ఆగస్టు 1 నుంచి హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసులు.

ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది.. మహా అయితే.. జరిమానా విధిస్తారు. చెల్లిస్తే సరిపోతుంది.. అంతకు మించి ఏం చేస్తారు.. ఇదే భావన చాలామంది వాహన చోదకుల్లో ఉంది. ఫలితమే పదే పదే ఉల్లంఘనలు.. రోడ్డు ప్రమాదాలు.. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ‘మార్పు’ రావడం లేదు. పైగా… ఉల్లంఘనల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2012లో ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసుల సంఖ్య 12.38 లక్షలు… వసూలు చేసిన జరిమానా 9.7 కోట్లు. అదే 2016కు వచ్చే సరికి కేసులు 21.7 లక్షలకు చేరుకోగా… విధించిన జరిమానాలు 16.36 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ విశ్వ నగరం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలోనే నగరంలో ఆగస్టు 1 నుంచి ‘పెనాల్టీ పాయింట్‌ సిస్టం’ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు పోలీసు అధికారులు. ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు.

ఎలా లెక్కిస్తారంటే…
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు పాయింట్లు లెక్కలు కట్టనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసేందుకు వీలుగా పాయింట్ల వివరాలు ఈ-చలాన్‌లో ఉండేలా ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించారు. స్పాట్‌ చలానాతో పాటు ఈ-చలానా జారీ చేసినప్పుడు ప్రతి ఉల్లంఘనులకు జరిమానాతో పాటు ఇన్ని పాయింట్లు మీరు సంపాదించారంటూ గమనిక రూపంలో వాటిని ఉంచనున్నారు. ఆర్టీఏ సర్వర్‌లో ఎప్పటికప్పుడు వాహన యజమానులు.. వాహన చోదకుల లైసెన్స్‌ల నంబర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. ఇంటికి పంపించే ఈ చలానా.. వాహన యజమాని చరవాణికి సంక్షిప్త సందేశాన్ని పంపించేటప్పుడు పాయింట్ల వివరాలుండేలా ఏర్పాట్లు చేశారు.

ఏడాది పాటు.. కొత్త విధానంలో పాయింట్లకు పాయింట్లే.. జరిమానాలకు జరిమానాలే. అ ఉల్లంఘనను బట్టి పాయింట్లుంటాయి. ఉదాహరణకు.. హెల్మెట్‌ లేదా సీటు బెల్టు పెట్టుకోకుండా బండి నడిపితే ఒక్క పాయింట్‌ మీ ఖాతాలో పడుతుందన్న మాట. తాగి బండి నడుపుతూ పోలీసులకు దొరికితే 5 పాయింట్లు వడ్డిస్తారు. పాయింట్ల వివరాలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌కు పంపిస్తారు. ఇలా 24 నెలల్లో 12.. అంతకంటే ఎక్కువ పాయింట్లు దాటితే మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆటోమేటిక్‌గా ఏడాది పాటు రద్దవుతుంది. అప్పటికప్పుడు పోలీసులు ఆ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో అందిస్తారు. ఏడాది పూర్తయ్యాక మళ్లీ పునరుద్ధరిస్తారు. మళ్లీ ఖాతా మొదటి నుంచి మొదలవుతుంది. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్లు.. మూడోసారి దాటితే మూడేళ్ల పాటు రద్దు చేస్తారు.

లెర్నింగ్‌ లైసెన్స్‌ ఉంటే… ఒకవేళ వాహన చోదకుడి వద్ద లెర్నింగ్‌ లైసెన్స్‌ ఉందనుకోండి. లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు లోపు 5 పాయింట్లు దాటితే.. అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అలాంటి వారు మరోసారి లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే.. అధీకృత సంస్థ నుంచి డ్రైవింగ్‌ నేర్చుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ఒక్క రోజుల్లోనే… 24 నెలలు.. 12 పాయింట్లు అనుకోవద్దు.. ఆ మార్కును ఒక్క రోజులోనే దాటేసే ప్రమాదముంది.. అవును.. ఎలా అంటారా.. ఉదాహరణకు ఓ ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్‌ లేకుండా మద్యం తాగి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ పోలీసులకు దొరికారు. అంటే నిబంధనల ప్రకారం 8 పాయింట్లు తన ఖాతాలో పడతాయన్న మాట. ఇదీ కాకుండా రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేశారనుకో మరో 2 పాయింట్లు.. సిగ్నళ్ల వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే మరో 2 పాయింట్లు.. ఇలా ఒకే రోజు 12 పాయింట్లకు చేరే అవకాశముంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తుంటాయి. అప్రమత్తం కాకపోతే సదరు డ్రైవర్ల లైసెన్స్‌ వారం రోజుల్లోపే రద్దు ఖావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తగ్గించుకోవచ్చు… జరిమానా పాయింట్లను తగ్గించుకునేందుకు అవకాశం కల్పించారు పోలీసులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో వాహనాల నిబంధనలు.. ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైన వారికే ఇది వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే మూడు పాయింట్లు తగ్గిస్తారు. కాకపోతే.. రెండేళ్లలో రెండు సార్లే ఆ అవకాశం ఉంటుంది.

జైలే..! ఒకవేళ 12 పాయింట్లు దాటి లైసెన్స్‌ రద్దైన వారు.. వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కితే ఇక నేరుగా జైలుకే. పోలీసులు ఆ మేరకు చట్టంలో మార్పులు.. చేర్పులు చేశారు. విచారణ సమయంలో న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేయనున్నారు. ఛార్జీషీట్‌లోనూ లైసెన్స్‌ను రద్దు చేసినట్లుగా పేర్కొంటారు.

అప్పీలేట్‌ అథారిటీ… నా తప్పేం లేదు.. అయినా.. జరిమానా పాయింట్లు విధించారు అంటూ వాహనదారులు వాపోవాల్సిన అవసరం లేదు. నేరుగా అప్పిలేట్‌ అథారిటీని సంప్రదించి సమస్యను వివరించుకోవచ్చు. విచారణలో తప్పు లేదని తేలితే ఆ పాయింట్లను ఖాతా నుంచి మినహాయిస్తారు.. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

ఉల్లంఘనలు..పాయింట్లు

..ఆటోలో సీట్ల కంటే అదనంగా ఎక్కిస్తే 1

..గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే 2

..సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే 1

..రాంగ్ రూట్ లో వాహనం నడిపితే 2

..నిర్దేశత వేగాన్ని మించితే  3

..ర్యాష్ డ్రైవింగ్/సెల్ ఫోన్ డ్రైవింగ్/ సిగ్నల్ జంపింగ్ 2

..రేసింగ్ 3

..మద్యం తాగి వాహనం నడిపితే( ద్విచక్ర వాహనం) 3

..మద్యం తాగి వాహనం నడిపితే( నాలుగు చక్రాల వాహనం) 4

..డ్రంకన్ డ్రైవింగ్(బస్సు/ క్యాబ్/ ఆటో) 5

..వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడితే 5

..హైవేలో అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం,రోడ్డు భద్రత ఉల్లంఘన 2

..బీమా పత్రాలు లేకపోతే 2

..అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2

 

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy