బీజేపీకి షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు..

electionపది రాష్ట్రాల్లో జరిగిన  ఉపఎన్నికల్లో నరేంద్ర మోడీ మేజిక్ పనిచేయలేదు. బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.  మోడీ వేవ్ తో ఒక్కసారిగా  పూర్తి మెజారిటీతో  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, జస్ట్ వంద రోజుల్లోనే బోల్తా కొట్టింది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్,  రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీకి అవమానమే మిగిలింది. పది రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలకు, 33 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి  ఎదురుగాలే వీచింది.  బీజేపీ లీడర్లకు రిజల్ట్స్ షాకిచ్చాయి.

మూడు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే,  ఒక్క వడోదర సీటునే బీజేపీ గెలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామాతో  వడోదరకు ఉపఎన్నిక నిర్వహించారు.  వడోదర నుంచి బీజేపీ అభ్యర్థి  రంజన్ భట్ గెలిచినా,  మెజారిటీ భారీగా తగ్గింది. మూడు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో మోడీ అయిదు లక్షల  డెబ్భయి వేల మెజారిటీ తో గెలిస్తే, రంజన్ భట్  కేవలం లక్షా 83 వేల మెజారిటీతో  గెలిచారు.  మెజారిటీ ఏకంగా మూడు లక్షలకు పైగా తగ్గిపోవడం, బీజేపీలో  కలకలం రేపుతోంది.

ములాయం సింగ్ యాదవ్ రాజీనామా తో  ఖాళీ అయిన మొయిన్ పురి లోక్ సభ  సీటును సమాజ్ వాది పార్టీ  నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి  సమాజ్ వాది పార్టీ  అభ్యర్థిగా  పోటీ  చేసిన ములాయం మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్  మూడు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. తెలంగాణలో బీజేపీ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న మెదక్ లోక్ సభ సెగ్మెంట్ ను టీఆర్ఎస్  గెలుచుకుంది. మెదక్ నుంచి టీఆర్ఎస్ కేండిడేట్  కొత్త ప్రభాకర్ రెడ్డి 3లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు కూడా బీజేపీకి షాకిచ్చాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలే వీచింది.  ముందుగా  కమలనాథులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్ లో  మొత్తం  పదకొండు సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాలను సమాజ్ వాది పార్టీ గెలుచుకుంది. యూపీలో మత ఘర్షణలతో  ఓట్లు చీలి లాభపడదామనుకున్న  బీజేపీ అంచనాలు తప్పాయి. ఎస్పీ దెబ్బకు బీజేపీ కుదేలైంది.

మోడీ  సొంత రాష్ట్రమైన  గుజరాత్ లో కూడా  రాజకీయాలు మారిపోయాయి. కమలనాథుల అంచనాలు ఫెయిల్ అయ్యాయి. గుజరాత్ లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ  సెగ్మెంట్లకు బై పోల్ జరగ్గా, ఆరు సీట్లను బీజేపీ గెలిచింది.  గుజరాత్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీని దెబ్బతీసింది..ఈ సారి బైఎలక్షన్ లో సీనియర్  లీడర్లు ఎవరూ ప్రచారం చేయలేదు. రాజస్థాన్ ఫలితాలు బీజేపీ మైండ్ బ్లాంక్ చేశాయి. మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే, మూడు స్థానాలను  కాంగ్రెస్ తన ఖాతాలో  వేసుకుంది. ఒకే ఒక్క సీటు కోటా సౌత్ ను మాత్రమే బీజేపీ  గెలుచుకుంది.  బెంగాల్ లో  ఒక అసెంబ్లీ స్థానం గెలుచుకోవడం బీజేపీ కి పెద్ద  విజయమే. బషీర్ హాత్  దక్షిణ్ అసెంబ్లీ స్థానాన్ని    బీజేపీ కైవశం చేసుకుంది. పదిహేనేళ్ల తర్వాత,  బెంగాల్లో  బీజేపీ ఎకౌంట్  ఓపెన్ చేసింది.  ఉప ఎన్నిక  జరిగిన మరో  సెగ్మెంట్ చౌరంఘీలేన్ ను తృణమూల్  కాంగ్రెస్ గెలుచుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని  నందిగామ సీటును బీజేపీ మిత్రపక్షం  టీడీపీ కైవసం  చేసుకుంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల  ప్రభాకరరావు  చనిపోవడంతో నందిగామలో ఉప ఎన్నిక నిర్వహించారు. తంగిరాల కుమార్తె సౌమ్య ఇక్కడ్నుంచి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆగస్టులో బీహార్ లోని పది అసెంబ్లీ  స్థానాలకు జరిగిన  ఉప ఎన్నికల్లోనూ  బీజేపీ  బొక్క బోర్లా పడింది.  ఆరు సెగ్మెంట్లను ఆర్జేడీ – జేడీయు  కూటమి గెలుచుకుంది.  బీజేపీ కేవలం నాలుగు సీట్లతోనే సరిపెట్టుకుంది. బీహార్ రిజల్ట్స్ తో పాటు లేటెస్ట్ గా  మరికొన్ని రాష్ట్రాల్లో  దెబ్బతినడం బీజేపీకి షాకిచ్చింది. లేటెస్ట్ గా  జరిగిన  బై పోల్  రిజల్ట్స్ బీజేపీ నాయకుల్లో  గుబులు పుట్టిస్తున్నాయి.  వచ్చే నెల్లో , మహారాష్ట్ర, హర్యానా  రాష్ట్రల అసెంబ్లీలకు  జరిగే ఎన్నికలపై  ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని  భయపడుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy