బుద్ధం శరణం గచ్చామి

BUDDAPURNIMAనేడు బుద్ధపూర్ణిమ. ఐహిక అంశాల పట్ల విముఖుడై జ్ఞానోదయంతో మానవాళికి ఒక మార్గనిర్దేశం చేసిన మహోన్నతుడు బుద్ధుడు. అహింసయే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు ఆయన. బుద్ధునికి మహాబోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినది క్రీస్తు పూర్వం 588లో.. ఆయనకు జ్ఞానోదయమైన రోజు, బుద్ధ గయలో ఆయన నిర్వాణం, కుషి నగరంలో ఆయన పరినిర్వాణ (అంతిమ భవ బంధ విముక్తి) జరిగిన సందర్భాలను పురస్కరించుకుని బుద్ధ పూర్ణిమను పాటిస్తారు. వైశాఖ శుద్ధ పూర్ణిమను బుద్ధ పూర్ణిమగా పాటిస్తారు. దీనిని బుద్ధ జయంతిగా కూడా పిలుస్తారు. ఈ తిథి రోజున ఆయన నేపాల్‌ లోని లుంబినిలో జన్మించారని చెబుతారు. చారిత్రకంగా చూస్తే చైనా యాత్రికులు ఫాహియాన్‌ వంటివారిరచనల్లో ఈ వేడుకల ప్రస్తావన కనిపిస్తుంది. బుద్ధ పూర్ణిమను వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. నేపాల్‌ లో దీనిని స్వన్య పున్హి అని, సింగపూర్‌ లో వెసాక్‌ అని, ఇండొనీషియాలో హరి వైసాక్‌ గాను పిలుస్తారు. థాయిలాండ్‌ లో విశాక్‌ బుచ్చగా పిలుస్తారు. బౌద్ధులు గుర్తించదగిన సంఖ్యలో ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. అటువంటి దేశాలలో శ్రీలంక, వియత్నాం, టిబెట్‌, మయన్మార్‌, నేపాల్‌, భూటాన్‌, థాయిలాండ్‌, కొరియా, చైనా, కంబో డియా, జపాన్‌ ఉన్నాయి.

బౌద్ధులు ఈ పవిత్ర దినాన్ని ప్రశాంత చిత్తంతో, ఆత్మావలోకనం చేసుకుని బుద్ధుని బోధనలు మననం చేసుకుంటూ, ఆయన జీవితంలోని సంఘ టనలను తలచుకుంటూ, బౌద్ధారామాలను సందర్శించడం వంటి కార్యక్రమాలతో గడుపుతారు. అలాగే బౌద్ధ భిక్షువులకు ఆహారం అందజేయడం, బుద్ధుని విగ్రహాల ముందు అగరువత్తులు వెలి గించి, పూలు, పళ్లు సమర్పించడం వంటివి చేస్తారు. బౌద్ధులు ఈ రోజును పంచశీల సిద్ధాంతాలపై తమ విశ్వాసాన్ని మరోమారు గుర్తు చేసుకుని పునరంకిత మయ్యే రోజుగా పరిగణిస్తారు. (పంచశీల అంటే ఇతరుల ప్రాణాలు తీయ కపోవడం, దొంగతనాలకు పాల్పడకపోవడం, అబద్ధాలాడకపోవడం, మత్తు పదార్థాలు సేవించకపో వడం, వివాహేతర సంబంధాలకు పాల్పడకపోవడం). అలాగే ధర్మ చక్రం ప్రవచించే అష్టాంగ మార్గాన్ని గర్తు చేసుకుం టారు. ఆ రోజున పలు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో సామూహిక ప్రార్థనలు, బౌద్ధ మత గ్రంధాల పఠనం, అందరూ కలిసి ధ్యానం చేయడం, పెద్దఎత్తున వస్తువులు పంచి పెట్ట్టడం, ఊరేగింపులు, బుద్ధ విగ్రహానికి పూజలు ఉంటాయి. వీటిలో భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు బోధి వృక్షం మీద పాలు, సుగంధ జలం పోయడం, దీపాలు వెలిగించడం చేస్తారు.

మనదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన బుద్ధ గయలోని మహా బోధి వృక్షాన్ని దర్శించుకునేందుకు బుద్ధ పూర్ణిమ రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. బుద్ధ గయలో 80 అడుగుల ఎత్తు బుద్ధుని విగ్రహం వద్ద్ద నుంచి ఊరేగింపు ప్రారంభ మవుతుంది. మహా బోధి కాంప్లెక్స్‌ ను రంగు రంగుల పతాకాలతో అలంకరిస్తారు. అలాగే బుద్ధుడు తన మొదటి బోధ వినిపించిన వారణాసి సమీపంలోని సార్నాథ్‌ మరో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. థాయిలాండ్‌, టిబెట్‌, భూటాన్‌, పలు ఇతర ప్రాంతాల నుంచి భిక్షకులు ఈ రోజున బుద్ధుని ఆశీస్సులకై ఇక్కడికి వస్తారు. ఒడిశాలోని ధవళగిరి కూడా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా జరిగే ప్రదేశాల్లో ఒకటి. ఈ రోజు ముఖ్యంగా పాలు, బియ్యం కలిపి చేసిన పరమాన్నం వంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ రోజు మాంసాహారాన్ని ముట్ట్టరు. సాధారణంగా తెల్లని దుస్తులు ధరించేందుకే ప్రాధాన్యతనిస్తారు. భారత్‌, ఇతర దేశాలలోని బౌద్ధులు ఈ రోజులు తమ ఇళ్లను, వీధులను రంగు రంగుల దీపాలతో అలంకరించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy