బుసలు కొడుతున్న జాత్యాహంకారం

maxresdefaultబానిసత్వాన్ని సమర్ధించిన రాబర్ట్

చార్లెట్స్‌విల్లే నగరంలో రాబర్ట్‌  విగ్రహం తొలిగింపుపై నిరసన జ్వాలలు

అమెరికాలో నివురు గప్పిన నిప్పులా ఉన్న జాత్యాహంకారం పడగ విప్పి బుసలు కొడుతుంది. వర్జీనియాలో ఒక్కచోట చిన్న నిప్పురవ్వలా మొదలైన జాత్యాహంకార నిరసన క్రమంగా ఇతర రాష్ట్రాలకూ పాకింది. వర్జీనియాలోని చార్లెట్స్‌విల్లే నగరం లీ పార్క్‌ నట్టనడిబొడ్డున ఠీవీగా కొలువైన ‘రాబర్ట్‌ ఈ లీ’ అనే కమాండర్‌ విగ్రహం వివాదాలకు కారణమవుతోంది. బానిసత్వం ఉండాలా వద్దా అనే విషయంలో రెండుగా చీలిపోయిన అమెరికా రాష్ట్రాల మధ్య 1861 నుంచి 1865 మధ్య అంతర్యుద్ధం జరిగింది. బానిసత్వాన్ని సమర్థించిన 11 రాష్ట్రాల కాన్ఫెడరేట్‌ ఆర్మీకి 1862 నుంచి కమాండర్‌గా వ్యవహరించిన వ్యక్తే ఈ రాబర్ట్‌ ఈ లీ. అందుకే ఆయన్ను అమెరికన్లు జాత్యాహంకారానికి, బానిస యుగానికి చిహ్నంగా భావిస్తారు. నిజానికి చార్లెట్స్‌విల్లేకి.. రాబర్ట్‌ లీకి ఏ సంబంధం లేదు. చార్లెట్స్‌విల్లే పార్కులో ఉన్న లీ విగ్రహాన్ని ఒక వ్యాపారవేత్త ఇవ్వగా 1924లో ఏర్పాటు చేశారు. లీ మాదిరిగా కాన్ఫెడరేట్‌ ఆర్మీని నడిపిన మరి కొందరి ప్రముఖుల విగ్రహాలూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకు ఈ స్మారకాల జోలికి వెళ్లే అధికారం స్థానిక ప్రభుత్వాలకు లేదు. 2015లో డాన్‌విల్లే సర్క్యూట్‌ కోర్టు తీర్పుతో స్థానిక ప్రభుత్వాలకు నిర్ణయాధికారం లభించింది. నిజానికి అప్పటి నుంచి కొన్ని చోట్ల అలాంటి విగ్రహాలను తొలగించినా మితవాద గ్రూపులు కిక్కురుమనలేదు. అన్నా వినపడేంత గట్టిగా అనలేదు. కానీ, ట్రంప్‌ వచ్చాక పరిస్థితి మారింది. ఈ క్రమంలో.. చార్లెట్స్‌విల్లేలో లీ విగ్రహాన్ని తొలగించాలన్న ప్రతిపాదన ఆ నగర పాలకమండలి ఉపాధ్యక్షుడు వెస్‌ బెల్లమీ నుంచి వచ్చింది. చార్లెట్స్‌విల్లేతో లీకి ఎంటువంటి చారిత్రక సంబంధం లేదు. లీ విగ్రహం ఉంటే చాలా మంది ప్రజలు పార్కుకు రావాలంటేనే అసౌకర్యంగా భావిస్తున్నారని బెల్లమీ పేర్కొన్నారు. ‘‘జాత్యాహంకారానికి, అసహనానికి, శ్వేత జాతి ఆధిపత్యానికి నిదర్శనం కాబట్టి ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందే’’నని చరిత్ర పరిశోధకుడు జాన్‌ మేసన్‌ కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు.

 ఇరు వర్గాల పరస్పర నిరసనలో మహిళ మృతి

‘శ్వేతజాతి విశిష్ఠత’ను మనసావాచా నమ్మి దాన్ని కాపాడేందుకు కర్మణా ‘హత్యలు’ సైతం చేసేంత క్రూరులు కొందరు ఉన్నారు. వీరంతా జూలై నుంచే నిరసనలు నిర్వహిస్తున్నారు. ‘యునైట్‌ ద రైట్‌’ పిలుపుతో ఆగస్టు 11, 12 తేదీల్లో తలపెట్టినది భారీ నిరసన. ఈ క్రమంలోనే వారి నిరసన ప్రదర్శనకు ప్రతిగా వామపక్ష వర్గాలు, పౌరహక్కుల సంఘాలు, బ్లాక్‌ లైవ్స్‌ మేటర్స్‌ (నల్లజాతివారివీ ప్రాణాలే) గ్రూపు నిరసనలకు దిగడంతో హింస చెలరేగింది. ఘర్షణల్లో ఒక మహిళ మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో శ్వేత జాతీయుల వ్యతిరేక వర్గంపైకి ఒక కారు దూసుకెళ్లడంతో మరో 15 మంది గాయపడ్డారు. వర్జీనియా అలజడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. విద్వేష సెగ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ స్మారక భవనాన్నీ తాకింది. దుండగులు వాషింగ్టన్‌లోని లింకన్‌ స్మారక భవనంలోని ఓ స్తంభంపై పెయింట్‌ స్ర్పేతో అసభ్య రాతలు రాశారు. తాజా పరిణామాలతో భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇరు వర్గాలది తప్పే: ట్రంప్‌

వర్జీనియా హింసపై ఇరు పక్షాలనూ తప్పుబట్టారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. ట్రంప్‌ వ్యాఖ్యలు నియో-నాజీ గ్రూపులు, జాత్యాహంకారులకు మద్దతుగా ఉన్నాయని అమెరికాలోని భారతీయులు సైతం తూర్పారబట్టారు. అయితే, ఇరు పక్షాలలోని అతివాదులు హింసకు కారణమని పేర్కొన్న ట్రంప్‌ తన అభిప్రాయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. లెఫ్ట్‌-రైట్‌.. ఇరు పక్షాల్లోనూ చెడ్డవాళ్లు ఉన్నారు, ఎప్పుడూ కథకు రెండువైపులూ ఉంటాయని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy