బెంగళూరు మళ్లీ.. మళ్లీ అదే తీరు

rcbబెంగళూరు మళ్లీ చిత్తైపోయింది. పంజాబ్‌ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక… 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ సీజన్ లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో ఎక్కువసార్లు ఆలౌట్ అయిన జట్టుగా డెక్కన్ చార్జర్స్(5) తర్వాతి స్థానంలో నిలిచింది బెంగళూరు(4).

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు తొలి ఓవర్లోనే గేల్‌ వికెట్ ను కోల్పోయింది.  ఆ తర్వాత కోహ్లిని.. డివిలియర్స్‌ను అవుట్ చేసి రాయల్ ఛాలెంజర్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు శర్మ. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్ (6), షేన్ వాట్సన్ (3) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. ఓ ఎండ్‌లో వరుసబెట్టి వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. 40 బంతుల్లో 46 పరుగులు చేసిన మన్‌దీప్ క్రీజులో ఉన్నంత వరకూ ఆశలు కల్పించాడు. కానీ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆఖరి మూడు ఓవర్లలో 28 పరుగులు చేస్తే బెంగళూరు గెలిచే పరిస్థితుల్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లో నేగి, బద్రీలను పెవిలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ విజయం లాంఛనమైంది.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 138 పరుగులు చేసింది. ఆదిలోనే తడబడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ విజయంతో పంజాబ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్‌, సందీప్ శర్మ తలో మూడు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy