బోలెడు వెరైటీలు : ఆ ఇల్లే ఓ ఆక్వేరియం

fishఇంటి అందం కోసం అక్వేరియాల్లో చేపలను పెంచుతారు చాలామంది. ఇక వ్యాపారం కోసం ఐతే చెరువుల్లో పెంచుతారు. అందుకు భిన్నంగా విశాఖలో ఓ పెద్దాయన ఇంట్లోనే ఓ చేపల ప్రపంచాన్నే సృష్టించాడు. తనకున్న అభిరుచితో కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ రకాల చేపలను పెంచుతున్నాడు.

ఆ ఇల్లు ఓ చేపల ప్రపంచం. రంగు రంగుల చేపలు. మనం ఎప్పుడు.. ఎక్కడ చూడని ఎన్నో జాతుల చేపలు ఇక్కడ కనువిందు చేస్తాయి. విశాఖ నగరానికి చెందిన రాజాబాబు ఈ చేపల ప్రపంచాన్ని సృష్టించారు. రాజాబాబు గతంలో రొయ్యల హేచరీలు నిర్వహించేవారు. అప్పుడు వివిధ రకాలు రొయ్యలు, చేపల జాతులపై అధ్యయనం చేయడం.. పలు మ్యాగ్జిన్లలో అందమైన చేపలను చూడడంతో వాటిని తాను కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ఈ అందమైన చేపల ప్రపంచం.

రాజాబాబు పెంచుతున్న చేపల విలువ వేలు కాదు.. లక్షలు కాదు ఏకంగా కోటిన్నర రూపాయలు. ఒక్కో చేప ఒక్కో రకం. అవి కూడా ఒక్కో దేశం నుంచి తెప్పించారు. ఖరీదైన చేపలు ఎక్కడబడితే అక్కడ పెరగవు. అందుకే ఒక్కో జాతి చేపలకు ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు కల్పించారు. చేపల జాతిని బట్టి వాటి ఆహారం, నీటిలో ఆక్సిజన్ శాతం అవసరం అవుతాయి. వాటిని ఉంచిన తొట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకపోతే వ్యాధులు వచ్చి అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది.

నీటి తొట్ల క్లీనింగ్ కోసం రాజాబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆటోమేటిక్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వైరస్ రాకుండా చేపల విసర్జితాలను ఆహారంగా ఉపయోగించుకుని పెరిగే మొక్కలను పెంచుతున్నారు. దీని కోసం రూ.50 లక్షలు ఖర్చు చేశారు రాజాబాబు. ఇందులో 25 జాతులకు చెందిన 6 వేల చేపలు ఉంటాయి. వీటిలో చైనీస్ లక్కీ ఫిష్ గా చెప్పుకునే ఆరొవనా రకం చేప కూడా ఉంది. ఈ ఆరొవనా చేప విలువ రెండున్నర లక్షలు. ఇలాంటివి 13 చేపలను చైనా నుంచి తెప్పించారు. ఇవి పిల్లలు పెట్టడంతో ప్రస్తుతం వీటి సంఖ్య 21 కి చేరింది. నీటి ఉపరితలం నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఎగరగలగలడం వీటి ప్రత్యేకత.

అంతేకాకుండా రంగురంగుల రూపాల్లో అత్యంత అందంగా కనిపించే కొయికార్ప్ చేపలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. పళ్లు లేకుండా ఉండే ఈ చేపలను జపాన్ నుంచి తెప్పించారు. వీటికి ఆహార గుళికల్ని చేతులతో పట్టుకొని నీళ్లలో పెడితే అవే చక్కగా వచ్చి తింటాయి.

ఇక ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపను దక్షిణమెరికా నుంచి తెప్పించారు. ఒక్కొక్కటి 40 వేల రూపాయలతో కొనుగోలు చేశారు. 600 వాట్స్ విద్యుత్ షాక్ కు సమానమైన షాక్ ను విడుదల చేయడం ఈ చేపల ప్రత్యేకత. ఇక ఊసరవెల్లి తరహాలో రంగుల మార్చుకునే జాతి చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. దక్షిణమెరికాలోని ఆస్కార్ నుంచి వీటిని తెప్పించారు రాజాబాబు. పట్టుకున్న వెంటనే ముళ్ల బాలు తరహాలో మారిపోయి పఫర్ చేప, మొసళ్లను తలపించేలా ఉండే అరాపిమా చేపలు, మొసలి నోటిలా ఉండే అలిగేటర్ గేర్ చేపలు, గుంపులు గుంపులుగా వాయి వేగంతో ప్రయాణించే టీన్ ఫాయిల్ బార్బ్స్ చేపలు, మనుషుల్ని ఇట్టే గుర్తుపట్టే గొరామీ చేపలు, పైనుంచి చూస్తే రాయిలా ఉండే చేపలు…. అత్యధిక వేగంతో నీటిని కీటకాలపై విసిరి వాటిని చంపే ఆర్చర్ చేపలు…. తోక భాగంలో విషం ఉండే స్టింగ్రే చేపలు…. ఇలా ఎన్నో రకాల చేపలను ఇష్టంగా పెంచుతున్నారు రాజాబాబు.

కొన్ని రోజుల వరకు ఇంట్లోనే చేపలను పెంచిన రాజాబాబు.. స్థలం సరిపోకపోవడంతో వాటిని రిసార్ట్ లోకి మార్చారు. రోజూ ఎంతో మంది ఈ చేపలను చూసేందుకు రిసార్ట్స్ కు వస్తుంటారు. ఎన్నో రకాల చేపలను ఒక్క దగ్గరే చూడడం.. రంగు రంగుల చేపలతో ఆడుకోవడం ఆనందంగా ఉందంటున్నారు సందర్శకులు.

తన అభిరుచితో పెద్ద చేపల ప్రపంచాన్నే సృష్టించారు రాజాబాబు. భవిష్యత్తులో ఇలా వింతైన వివిధ జాతులకు, దేశాలకు చెందిన చేపలను మరిన్ని తీసుకొస్తానని చెప్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy