బ్రాహ్మణులకు కుల ధ్రువీకరణ పత్రాలు

logoబ్రాహ్మణులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసి, రూ.200 కోట్ల నిధులు కేటాయించింది. ప్రభుత్వ పథకాలకు ఈ పరిషత్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. అయితే ఎవరు బ్రాహ్మణులో, ఎవరు కాదో చట్టబద్ధంగా, అధికారికంగా నిర్ధారణ జరిగేందుకు బ్రాహ్మణులకు తొలిసారిగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులే ఈ పత్రాలు అందజేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం వీటిని తహసీల్దార్ల ద్వారా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించి, ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 లక్షల మంది దాకా బ్రాహ్మణులున్నారు. వీరిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. బ్రాహ్మణుల్లో ప్రధానంగా శ్రీవైష్ణవులు, చాత్తాద వైష్ణవులు, శైవులు, స్మార్తులు, వైదికులు, కరణాలు (నియోగులు), ఆరాధ్యులు, తెంగలు, వడగలు ఉన్నారు. శ్రీవెంకటేశ్వర, విష్ణుమూర్తి ఆలయాల్లో పనిచేసేవారంతా వైష్ణవులు కాగా.. శైవులు, స్మార్తులు శివ, కేశవ ఆలయాల్లో పూజారులుగా ఉన్నారు. ఇక ముందు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ తరపున ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ‘బ్రాహ్మణ్‌’ అనే పేరుతో కులధ్రువీకరణ పత్రం పొందాలి. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా జీవో నెం.105ను జారీ చేశారు. దీనిప్రకారం చర్యలు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను కోరారు. సీసీఎల్‌ఏ అమలు మార్గదర్శకాల సర్క్యులర్‌ విడుదల చేయగానే సర్టిఫికెట్లు జారీ కానున్నాయి.

ఉత్తర్వుల ప్రకారం…

..ఫామ్‌-1లో కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

..పేరు వివరాలు, పుట్టిన తేదీ వివరాలు, ఆధార్‌ నెంబరును దరఖాస్తులో పొందుపరచాలి. బ్రాహ్మణుల్లోని ఏ గోత్రానికి చెందినవారో తెలపాలి. ఆ తర్వాత 1993 యాక్ట్‌ ఆఫ్‌ 16లోని సెక్షన్‌ 10 ప్రకారం వివరాలు సరైనవేనని సంతకం చేయాల్సి ఉంటుంది.

..దరఖాస్తుదారులు మైనర్‌ అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాలి. వీటికి తగిన ఆధారాలను కూడా పొందుపరచాలి.

..ఫామ్‌-2 ప్రొఫార్మా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy