బ్లాక్ టికెట్స్ టూ మాఫియా కంపెనీ

1ఓ సాధారణ యువకుడు.. పొట్టకూటికోసం బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు.. అంచెలంచెలుగా ఎదిగాడు. దేశ నేర ప్రపంచాన్ని గడగడలాడించాడు. తెగువ, బరితెగింపు మనిషిని ఏ స్థాయికి తీసుకెళతాయో చెప్పటానికి చోటా రాజన్ నేర జీవితమే ఎగ్జాంపుల్. తన జీవితాన్నే సినిమాలుగా మార్చి.. ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు. దావూద్ లాంటివాడినే వణించాడు.. ఎప్పటికైనా లేపేస్తానంటూ వార్నింగ్స్ ఇచ్చాడు.. కంటిపై కునుకు లేకుండా చేశాడు. చిన్నాచితక నేరాల నుంచి.. వాల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన చోటా రాజన్ జీవితం ఇదీ..

బ్లాక్ టికెట్లు అమ్మేవాడు

అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే అలియాస్ నానా. ఓ మిల్లు కార్మికుడి కుమారుడు. చెంబూర్ లోని సహకార్ థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడు. అక్కడి నుంచే అతని నేర జీవితం ప్రారంభం అయ్యింది. బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మటమే కాదు.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఇలా దొంగలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలతోనే నాయర్ గ్యాంగ్ లో చేరాడు. ఆ గ్యాంగ్ లీడర్ రాజన్. కొద్దికాలంలోనే రాజన్ కుడిభుజంగా ఎదిగాడు. రాజన్ చక్కదిద్దే అన్ని వ్యవహారాల్లో కీలక వ్యక్తి నికల్జేనే. అలా అండర్ వాల్డ్ మాఫియాలో కీలక వ్యక్తిగా మారాడు. ఇదే సమయంలో.. రాజన్ హత్య జరిగింది. అతని స్థానాన్ని నికల్జే తీసుకున్నాడు.. దీంతో చోటా రాజన్ గా మారిపోయాడు.

దావూద్ తో పరిచయం

2చోటా రాజన్ కరుడు గట్టిన నేరస్తుడు. 1982లో బడా రాజన్ ను ప్రత్యర్థి కుంజూ గ్యాంగ్ చంపడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రాజన్ అదును కోసం ఎదురు చూశాడు. ఓపిక పట్టాడు. మూడేళ్లు తర్వాత వచ్చిన అవకాశం అతని జీవితాన్నే మార్చేసింది. 1985లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో కూర్చున్న కుంజూను పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపాడు రాజన్. మాఫియా చరిత్రలోనే దీన్ని అత్యంత డేరింగ్ ఎటాక్ గా చెబుతారు. ఈ హత్యలో రాజన్ చూపిన ధైర్యం, తెగువ దావూద్ ను ఆకర్షించాయి. స్వయంగా దావూద్.. గ్యాంగ్ లోకి రావాలని ఆహ్వానించాడు. అప్పుడప్పుడే డాన్ గా ఎదుగుతున్న రాజన్ ఓకే చెప్పాడు. దావూద్ తో చేతులు కలిపిన తర్వాత.. మరో అండర్ వరల్డ్ డాన్ కరీంలాలాను చంపడంతో కొద్ది కాలంలోనే దావూద్ కు కీలక అనుచరుడిగా మారాడు. 1984లో దావూద్ దేశం విడిచి వెళ్లిన తర్వాత దేశంలోని డీ గ్యాంగ్ కు చోటా రాజన్ బాస్ అయ్యాడు. ఇక్కడే ఆధిపత్య పోరు మొదలైంది. డీ గ్యాంగ్ లో దావూద్ తమ్మడు.. చోటా షకీల్ పాత్ర పెరగడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ వివాదాలు కొనసాగుతున్న సమయంలో.. 1993లో ముంబై వరస పేలుళ్లకు స్కెచ్ వేశారు.. అమలు చేశారు. అయితే ఈ దారుణ ఘటన తర్వాత.. దావూద్, రాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. దావూద్ నుంచి బయటకువచ్చిన చోటా రాజన్.. డి.గ్యాంగ్ కు వ్యతిరేకంగా నానా కంపెనీ పేరిట సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఎటాక్స్ చేశాడు. ఓ వైపు పోలీసులు.. మరోవైపు డి.గ్యాంగ్ దాడులతో మకాంను మలేషియా, దుబాయ్ లకు మార్చాడు.

దావూద్ కే చుక్కలు చూపించాడు

3ఇద్దరూ విడిపోయినప్పటి నుంచి రెండు గ్యాంగ్స్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో బ్యాంకాక్ లోని ఓ హోటల్ లో ఉణ్న రాజన్ పై చోటా షకీల్  కాల్పులు జరిపాడు. ఆ దాడిలో మూడు బుల్లెట్ గాయాలతో రాజన్ తప్పించుకున్నాడు. ఈ దాడికి ప్రతీకారంగా 2001లో రాజన్ గ్యాంగ్ దావూద్ అనుచరులైన వినోద్ శెట్టి, సునీల్ సోన్ లను చంపేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా రెండు గ్యాంగ్స్ తుపాకులతో రెచ్చిపోయేవారు. ఈ ఏడాది మొదట్లో దావూద్ ముఠా ఆస్ట్రేలియాలో దాగిఉన్న రాజన్ ను స్కెచ్ వేసింది. సెక్యూరిటీ అలర్ట్ తో ముందే గ్రహించిన రాజన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. 1995 నుంచి 20 ఏళ్లుగా పరారీలో ఉన్న రాజన్ తన మకాంలు మార్చే క్రమంలో పోలీసులకు చిక్కాడు.

పేరు మార్చుకుని

4కుమార్ మోహన్ పేరుతో భారత పాస్ పోర్ట్ ను సంపాదించాడు రాజన్. 2008 నుంచి అదే పాస్ పోర్ట్ ను వాడుతున్నాడు. చోటా షకీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు రాజన్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రాజన్ పై నిరంతర నిఘా పెట్టిన దావూద్ గ్యాంగ్.. బాలీకి వెళుతున్న పక్కా సమాచారాన్ని సేకరించింది. దీన్నే అక్కడి పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొన్న అబూసలేం.. నిన్న చోటా రాజన్.. నెక్ట్స్ దావూద్.. అంటున్నారు ఇండియన్ పోలీసులు. ఇక రెండు దశాబ్దాలుగా తప్పించుకున్న చోటా రాజన్ దొరకడంతో… తమ నెక్స్ట్ టార్గెట్ దావూద్ ఇబ్రహీమేనంటున్నారు భారత అధికారులు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy