భాగ్యరెడ్డి వర్మ… మరో అంబేడ్కర్!!

Bhagya_Reddy_Vermaదేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు కంకణం కట్టుకున్న గొప్ప వ్యక్తి… దళిత ఉద్యమ శిఖరం. కులం పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేసేందుకు అనునిత్యం తాపత్రయపడిన మహా వ్యక్తి. ఆయన మరెవరో కాదు. భాగ్యరెడ్డి వర్మ. మే 22 ఆయన జయంతి. కుల వ్యవస్థ దేశాన్ని పట్టి పీడుతున్న రోజుల్లో…. ఆ రోగాన్ని నయం చేయడానికి పుట్టిన మహా వ్యక్తే భాగ్యరెడ్డి వర్మ. 1888 సంవత్సరం మే 22 న మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు భాగయ్య. పేర్ల చివర కులం తోకలు తగిలంచుకుని తక్కువ కులస్తులను చిన్న చూపుడంతో చలించిపోయిన భాగయ్య తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు . ఆర్యసమాజ్ ఇచ్చిన వర్మ బిరుదుతో భాగ్యరెడ్డి వర్మ అయ్యాడు.

దళితుల్లో  చదువుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటోందనే విషయాన్ని  గమనించారు  భాగ్యరెడ్డి వర్మ. దీనికి చదువుతోనే పరిష్కారం చూపాలనుకున్నారు. పొరాటాన్ని ఉధృతం చేశారు. కులం పేర్లతో కాకుండా ఆదిహిందువులని పిలవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఉద్యమాలు కూడా చేశారు. అంబేద్కర్ కంటే ముందే దళిత జాతికోసం ఉద్యమాలు చేసిన మహనీయుడిగా పేరుతెచ్చుకున్నారు భాగ్యరెడ్డి వర్మ. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించమే కాదు.. వారిలో ఉన్న తెలివితేటలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు భాగ్యరెడ్డి వర్మ. దళితుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించారు.  హరిదాసులు,మాల జంగాల చేత హరికథలు చెప్పించారు. ఈ కార్యక్రమాల్లో భాగ్యరెడ్డి వర్మ ఉపన్యాసాలు ఎంతో మందిని ఆకర్షించాయి. అలాగే దళిత పిల్లలకు చదువు చెప్పించడానికి 1910 లో ఇసామియాబజారులో ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. కొద్దిరోజుల్లోనే 25 పాఠశాలలను ప్రారంభించారు. ఆదిజన మూలవాసీ ఉద్యమానికి మూలపురుషుడిగానిలిచారు. ఆదిహిందువుల్లోని చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తుప్రదర్శనను నిర్వహించారు..

జాతీయ నిమ్నవర్గాల మహాసభలకు 1927 నుంచి 1931 వరకు భాగ్యరెడ్డే అధ్యక్షత వహించారు. పంచములు,అవర్ణులు,మాల,మాదిగ పేర్లతో కాకుండా తమను ఆదిహిందువులుగానే పిలవాలన్నారు..భాగ్యరెడ్డి డిమాండ్ కు నిజాం ప్రభుత్వం దిగొచ్చింది.. 1931లో జరిగిన జనాభా లెక్కల్లో దళితులను ఆదిహిందువులుగా నమోదుచేసింది. భాగ్యరెడ్డి వర్మ ఉద్యమం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాలేదు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోని దళితుల సమస్యలపై పోరాటం సాగించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy