భారత్, చైనా అంగీకారం : డోక్లాం నుంచి బలగాల ఉపసంహరణ

india-chinaఎట్టకేలకు భారత్, చైనాల మధ్య డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైంది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించడంతో పలు దేశాలు హర్షం ప్రకటించాయి.

మరో వారంలో చైనాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.  ‘డోక్లాం సంఘటనపై భారత్, చైనాలు ఇటీవల ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలు తమ అభిప్రాయాల్ని వెల్లడించడంతో పాటు పరస్పరం ఆందోళనలు, ఆసక్తుల్ని పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద డోక్లాం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించాయి’ అని విదేశాంగ శాఖ తెలిపింది.

డోక్లాంలో భారత్, చైనాల బలగాల ఉపసంహరణ దాదాపుగా పూర్తయిందన్నారు విదేశాంగ ప్రతినిధి రవీష్‌ కుమార్‌. గత నెల్లో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరి మధ్య ఫోన్‌లో చర్చలు కొనసాగాయని, ఈ నేపథ్యంలోనే సమస్య కొలిక్కివచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. విదేశాంగ కార్యదర్శి జై శంకర్, చైనాలో భారత రాయబారి విజయ్‌ గోఖలేలు కూడా డోక్లాం వివాద పరిష్కారానికి కృషిచేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  డోక్లాం నుంచి బుల్‌డోజర్లతో సహా చైనా బలగాలు వెనక్కి మళ్లాయని, టెంట్లు, జెండాను కూడా తొలగించాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   మరోవైపు తమ బలగాల్ని వెనక్కి తీసుకోలేదని చైనా చెప్పడంతో భారత ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది. బలగాల ఉపసంహరణపై అస్పష్ట సమాధానమిస్తూ… తాజా పరిస్థితుల్ని అంచనావేసి వివాదాస్పద ప్రాంతంలో కొన్ని మార్పులు చేస్తామని చైనా పేర్కొంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy