భరతసీమ నిర్మాణంలో మొదటి మేస్త్రీ !

nehru6దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సీను చాలా వింతగా ఉండేది. ప్రభుత్వాన్ని ఎలా నడపాలన్నది ఒక ప్రశ్న. దేశాన్ని ఒకటిగా ఎలా ఉంచాలన్నది ఒక ప్రశ్న. ఇలా ఎన్నో ప్రశ్నలు. ఒక్క మాటలో చెప్పాలంటే….కొత్తగా ఇల్లు కడుతున్నట్టు. అయినా సరే, అనుభవమున్న మేస్త్రీలా ఆ ఇంటిని ఎంతో బలంగా కట్టించగలిగాడు  మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.

ఇండియా భవిష్యత్ కు బంగారు బాటలు వేసిన మార్గదర్శిగా చెప్పుకోవాలా?నవ భారత నిర్మాణ రూపశిల్పి అనాలా? ఆలీనోద్యమ సారథిగా చూడాలా?….ఇవన్నీ కలగలిపితేనే నెహ్రూ అసలు రూపం తెలుస్తుంది. ముందుచూపుతో  ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇవ్వాళ ఇండియా సాధిస్తున్న విజయాలకు కారణం. విజన్ అనే పదానికి నిదర్శనంగా నిలబడే నెహ్రూ 125 వ పుట్టిన రోజుది. దేశానికి మొదటి ప్రధానిగా పాలనలో తనదైన ప్రత్యేకతను  చాటారు నెహ్రూ. పెట్టుబడిదారి విధానం, సోషలిస్టు విధానాన్ని  మిక్స్ చేసి,  మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లోనూ తన ముద్ర ఉండేట్టు చూసుకున్నారు నెహ్రూ.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను సమానంగా ప్రోత్సహిస్తూ పారిశ్రామిక విధానానికి కొత్త బాటలు వేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధికోసం  సాగునీటి ప్రాజెక్టులు కట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పంచశీల పాలసీతో ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలోనూ కొత్త అధ్యయాన్ని సృష్ఠించారు.

పండిట్ జీ గా పేరుపొందిన జవహర్ లాల్ నెహ్రూ1889 నవంబర్ 14న  ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో పుట్టారు. నెహ్రూది కాశ్మీరీల కుటుంబం. ఈ కుటుంబం ఉద్యోగం కోసం అలహాబాద్ కు వలస వెళ్లింది. తండ్రి మోతీలాల్ లాయర్. 15 ఏళ్ల వయస్సులో పెద్ద చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు.  1916 ఫిబ్రవరి 8న ఢిల్లీలో కమలతో  పెళ్ళయ్యింది. అనిబిసెంట్ ప్రభావంతో స్వతంత్రపోరాటంలో పాల్గొన్నారు నెహ్రూ.  జలియన్ వాలా బాగ్ ఘటన నెహ్రూను గాంధీకి దగ్గర చేసింది. 1934 లో కాంగ్రెస్ కు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ సోషలిష్ట్ పార్టీ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. 1936 లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.  అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ అంతర్జాతీయ రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. గాంధీ సలహాలతో ప్రజాకర్షక నేతగా ఎదిగిన నెహ్రూలో  సోషలిస్ట్ రష్యా ప్రభావం ఎక్కువగా ఉండేది. 1964 మే 27 వరకు 17 ఏళ్లు ప్రధానిగా పనిచేశారు నెహ్రూ.

దేశంలో పౌర సేవలతో జలవిద్యుత్ ఉత్పత్తి ,  అణుశక్తి కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు నెహ్రూ.  IIT వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే  చైనాతో, భారత యుద్ధంపై నెహ్రూ సర్కార్ విమర్శలు ఎదుర్కొంది. అనారోగ్యంతో  కొన్నిరోజులు కాశ్మీర్ లో గడిపిన  నెహ్రూ … ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయారు. నెహ్రూ వాడే డ్రెస్స్ లు అప్పట్లో  బాగా ఫేమస్ .

‘ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్’, ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’, ‘గ్లింప్సెస్ ఆఫ్ వాల్డ్ హిస్టరీ’ లాంటి పుస్తకాలు రాశారు   నెహ్రూ.  కూతురు ఇందిరా ప్రియదర్శిని అంటే ఆయనకు చాలా అభిమానం. అలాగే, పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే తన కోటుమీద ఎప్పుడూ గులాబీ పువ్వు పెట్టుకునేవారు. పిల్లలపై నెహ్రూ అభిమానానికి గుర్తుగా  ఏటా నవంబర్ 14 న ఆయన  పుట్టిన రోజును చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటున్నారు. అభివృద్దితో పాటు టెక్నాలజీ రంగంలో కూడా ఇండియా ను టాప్ ప్లేస్ కు చేర్చాలని పరితపించేవారు నెహ్రూ. ఆయన బాటలోనే కూతురు ఇందిరా గాంధీ, మనవడు రాజీవ్ గాంధీ దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy