భారీ వరదతో ప్రాజెక్టులకు జలకళ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కుమ్రం భీం జిల్లాలోని కుంటాల, పొచ్చర్ల జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఎవ్వరినీ జలపాతం దగ్గరికి వెళ్లనివ్వడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దైంది. వాగులు వంకలు పొంగిపోర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అటు ఉమ్మడి జిల్లాలో వర్షాల పై వరంగల్ రూరల్, భూపాలపల్లి జిల్లా కలెక్టరట్ లలో కలెక్టర్లు, అధికారులతో భేటీ అయ్యారు ప్రత్యేక అధికారీ రాహుల్ బొజ్జా. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి నీరు వస్తోందని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితిపై కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. జలపాతాల దగ్గర భద్రతపై ఎంక్వైరీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో చాలా చోట్ల 10 సెంటి మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. అటు వర్షాలతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. నెల రోజులుగా జిల్లాలో చినుకుజాడ లేకపోవడంతో.. వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఉంది. అయితే రెండు రోజులుగా పడుతున్నా వానలతో మొలకలకు ప్రాణం వచ్చినట్టైంది.

భారీ వర్షాలకు జిల్లాలోని బాల్కొండ బద్దెవ్వ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో చేపల వేటలో పోటీలు పడ్డారు యువకులు. ఒర్రెవైపు నుంచి చెరువులోకి వస్తున్న నీటిలో చేపలు పడుతూ సరదాగా గడిపారు. వెంటతెచ్చుకున్న కవర్లు, సంచుల్లో చేపలను పట్టుకెళ్లారు. దావత్ కు మస్తుగా చేపలు దొరికాయంటూ సంబురపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు, వైరా రిజర్వాయర్ లలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. లంకసాగర్ ప్రాజెక్టులో నీరు 13 అడుగులకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం 33 అడుగులకు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే ప్రమాద హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy