భూసేకరణ చట్టంలో సవరణలు:కొత్తగా జీవో 38 జారీ

land poolingభూసేకరణ జీవో 123కి సవరణలు చేసింది ప్రభుత్వం. కొత్తగా జీవో 38ని విడుదల చేసింది. భూసేకరణ జరిపే ప్రాంతాల్లో సొంత భూమి లేని పేదలు, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడిన వారి పునరావాసం కోసం ఈ జీవో ను తీసుకొచ్చింది. రైతు కూలీలు, కౌలు దారులు, భూమిపై ఆధారపడిన చేతి వృత్తుల వారికి,  అటవీ ఉత్పత్తులపై జీవనం సాగించే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను  ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది సర్కార్.

పునరావాసం కింద ఒక్కో కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం 5. 4 లక్షలు, ఒకేసారి చెల్లింపు కింద మరో 5 లక్షలు అందనుంది. ప్రజాప్రయోజనాల కోసం గతంలో జీవో నెంబర్ 123 కింద భూసేకరణ ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఈ జీవో వల్ల భూమి కోల్పోతున్న వారికి సరైన న్యాయం జరగడం లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో భూమి సొంతదారులతో పాటు భూమిలేని వారికి కూడా పునరావాస ప్యాకేజీలు వర్తించేలా జీవో ను తెచ్చింది  ప్రభుత్వం.

లబ్ధిదారులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది సర్కార్. భూసేకరణ ప్రాంతంలో మూడేండ్లుగా నివాసం ఉంటూ .. ఉపాధి కోల్పోయిన రైతుకూలీలు, కౌలుదారులు, వ్యవసాయానికి సంబంధించిన చేతివృత్తుల వారికి  ఈ జీవో ప్రకారం పునరావాస ప్యాకేజీ వర్తిస్తుంది. భూసేకరణ వల్ల అటవీ హక్కులు కోల్పోయిన గిరిజనులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన వేటగాళ్లు, మత్స్యకారులు, పడవలు నడుపుతూ జీవించే వారికి పునరావాసం వర్తించనుంది. ఇందులో భూ నిర్వాసితుల జీవనాధారం, కుటుంబ పరిస్థితులను పరిశీలిస్తారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళను, యువకులను ప్రత్యేక కుటుంబంగా లెక్కిస్తారు.

ప్యాకేజీ కింద ఎంపికైన వారి పేర్లు వెబ్ సైట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ పెడతారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే 15 రోజులలోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తారు. ప్యాకేజీపై అభ్యంతరాలున్న వారు 30 రోజుల్లో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లను 6 వారాల్లో  పరిశీలించి ఫైనల్ చేస్తారు కలెక్టర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy