మట్టి ఇచ్చారు.. నీళ్లుపోశారు

22brk-159పార్లమెంట్ సాక్షిగా మట్టి ఇచ్చారు.. యుమున నది నీటిని చల్లారు.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి ఇచ్చిన హామీ ఇదీ. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని.. గిల్లికజ్జాలు వద్దని హితవు పలికారు. విభజన జరిగిన తీరును గుర్తుపెట్టుకున్న ఆయన.. విభజన తర్వాత ఇచ్చిన హామీలను మాత్రం మర్చిపోయారు. అట్టహాసంగా.. ఆర్భాటంగా చేపట్టిన అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రధాని.. ఇచ్చే సందేశంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు ఏపీ జనం. హోదా కష్టమంటూ కొన్నాళ్లుగా సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కనీసం ప్యాకేజీలు అయినా ప్రకటిస్తారని ఆశించారు. ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్రానికి ప్రకటించిన లక్ష కోట్ల ప్యాకేజీలో కనీసం నాలుగో వంతు అయినా సభా వేదికగా ప్రకటిస్తారని అంచనాలు వేసుకున్నారు జనం, రాజకీయ విశ్లేషకులు. అయితే మోడీ ఎక్కడా హోదా, ప్యాకేజీలపై కనీసం స్పందించకపోవటంతో.. తీవ్ర నిరాశకు గురయ్యారు జనం.

Kcr Babu1కేంద్రం – రాష్ట్రం భుజం భుజం కలిపి సాగుతుంది అన్నారేగానీ.. ఎలా అని మాత్రం చెప్పలేదు. సహాయ సహకారాలు ఇస్తామన్నారు.. ఎలాంటివి అనేది స్పష్టం చేయలేదు. ఇక జపాన్, సింగపూర్ నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రధాని సమక్షంలో ఒప్పందం చేసుకుని.. పత్రాలు మార్చుకుంటారా అని కోటాను కళ్లు ఆశగా ఎదురుచూశాయి.. అదీ జరగలేదు. లక్షల కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న ఏపీ కొత్త రాజధానికి నిధులు ఎలా.. ఇన్ని కోట్లు ఎవరు కుమ్మరిస్తారు.. ఎలా వస్తాయి.. వస్తే దానికి విధివిధానాలు ఏంటీ.. ఎవరెవరు పెట్టుబడి పెడుతున్నారు.. ఎలా కడతారు.. అనేవి అటు విదేశీ సంస్థల నుంచిగానీ.. ఇటు కేంద్రం పెద్దన్న ప్రధాని మోడీ నుంచిగానీ కనీసం మాటమాత్రంగా అయినా రాలేదు. ఇంత పెద్ద కార్యాక్రమం సరే.. భరోసా, ధీమా లేకపోవటంతో సభకు వచ్చిన జనం ఇలాంటి సందేహాలు వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని గౌరవించి.. అమలు చేసిన తీరతాం అని ఘనంగా చెప్పిన మోడీ మాటల్లో కొత్తదనం అయితే వీసమెత్తుకూడా లేదు. అధికారంలోకి వచ్చిన.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ చెబుతున్న మాట ఇదే. మొదటిసారి చంద్రబాబు ఫ్యామిలీ చేతుల మీదుగా సాగిన శంకుస్థాపనకు.. ఇప్పుడు ప్రధాని చేతులమీదుగా సాగిన అట్టహాసానికీ తేడా ఏంటీ అనేది బిగ్ క్వశ్చన్. అప్పుడు సశేషంగా మిగిలిన ఎన్నో ప్రశ్నలకు ప్రధాని అయినా సమాధానం చెబుతారా అంటే అదీ లేదు. ఇక ప్రతిపక్ష నేత జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా వేదిక నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. రాజధాని అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ.. ఎల్లప్పుడూ ఉంటాయని ఎంతో ధీమాగా భరోసా ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆరే ఎంతో నయం అని సభకు వచ్చిన ఏపీ జనం మాట మాట్లాడుకోవటం కొసమెరుపు.. ఆల్ ద బెస్ట్ ఏపీ..

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy