మట్టి మనిషిని బతికించుకుందాం..

farmerగింజ గింజ మీద తీనేవారి పేరుంటుందని అంటరు.  ఇది నిజమో కాదు తెల్వదు కాని… ఆ గింజలు పండించి బతుకునిచ్చే…  నలుగుర్ని బతికిచ్చే వారిని ఆదుకునే వారి పేరు మాత్రం ఎక్కడా కానరాదు. సాయం కోసం ఎదురుచూసే కండ్లు..  చెప్పులరిగేలా  తిరిగిన కాళ్లు..  దిక్కు తోచుక  ఉరికి వేలాడుతున్నవి. పరుల కోసం బతికే  వారిని మనం నిజంగ బత్కనిస్తున్నామా..? వాళ్ల బత్కు ఎట్లా ఉందో కనీసం పట్టించుకుంటున్నామా..? ఇగో  యువ రైతు  మోహన చారి…. ఇట్లా మనను అడుగుతున్నడు.

రోజూ జరిగే క్రైమ్ వార్త లెక్కనే రైతుల ఆత్మహత్యలు వార్తలు. దేశంలో రైతు ఉరికి వేలాడని రోజు లేదు. కాదంటే తనను కాల్చుకని తనువు చాలిస్తున్నడు. పది మంది  కోసం బతికే వాడు దేవునితో సమానం. అంత కాక పోయినా అన్నం పెట్టిన వారిని అంతకంటే  ఏమనగలం. కనీసం చేతులెత్తి దండం పెట్టక పోయినా… మట్టిని పిసికి మన్నుల నుండి బువ్వను తీస్తున్న ఆ మట్టి కాళ్ల మనుష్యులపైనే ఎవ్వరం కనికరం చూపిస్తలేం. అందుకు సజీవ సాక్ష్యం మోహన చారి దంపతుల ఆత్మహత్యే.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామ యువ రైతు దంపతులు మోహన చారి, ఆయన భార్య ఇద్దరూ భవిష్యత్తు మీద, బతుకు మీద బరోసాతోటి….  రాళ్ల చెల్కను రత్నాలు భూమిగ మార్సుకున్నరు. మిన్నును నమ్ముకుంటే మోసం చేయదనుకున్నరు. పుట్టిన చోటల్లా అప్పులు తెచ్చుకున్నరు. తాము బత్కడమే బతుకు కాదు.. పది మందికీ బతుకు నియాలనుకున్నరు. అందుకే చెల్కనే ఇల్లు కట్టుకని భూమిని  నమ్ముకుని… ఆ మన్నులనే తమ భవిష్యత్తును వెతుకున్నరు.

farmerతొమ్మిదెకురాల రాళ్ల చెల్కను సదును చేయడానికి, సాగు లోకి తేవడానికి మోహన చారి తన చదువును తెల్విని అంతా వాడినట్లు  తాను రాసిన  కడసారి దస్తూరిలో ఉన్నది. ఇన్నేల్ల సదువు, ఊరిచ్చిన ఊపిరి అంతా  ఆ భూమిల్నే పెట్టిండు.  తన సహచరి ఆయనకు సాయం చేసింది. ఇద్దరూ అక్కడే ఉన్నరు. అదే పొలాన్ని నమ్ముకున్నరు. మనుష్యులు మోసం చేస్తరు… కానీ భూమి మోసం చేస్తదా. ఇదే ఆశ.. అదే అప్యాయత భూమిని నమ్మకునేటట్లు చేసింది.

నిజంగనే  మట్టి ఎప్పటికి మోసం చేయదు. మట్టికి మర్మం తెల్వది. మట్టిది అమ్మ భాష. అందుకే బోర్లు వేసిండు. లక్షల అప్పులు తెచ్చి బర్లు, గొర్లు తెచ్చుకున్నడు.  వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు… పది రకాల పంటలేస్తే… నాలుగు రకాలుగా ప్రయత్నాలు చేస్తే యాన్నో ఓతాన బయట పడకపోతామా అనే ధీమాతో ఉన్నడు. అందుకు  అడుగులు ముందుకు వేసినరు మోహనచారి దంపతులు. బంధువులు,  తెల్సిన వారు అంతా సాయం చేసినరు. చెల్కల ఉండి చెల్కను నమ్మకున్నరు. అంతే కాదు వాళ్లు బతుకుడే గాదు… పది మంది చేతులకు దినాం పని  ఇస్తున్నరు. దీనికన్నా ఆనందం ఏం ఉంటుంది. అందుకే కష్టాలొచ్చినా… కన్నీళ్లొచ్చినా అన్నీ భూమితోనే పంచుకున్నరు. సంతోషాలు…. ఆనంద  గడియలు అన్నీ ఆ మట్టితోనే ముడి పెట్టుకున్నరు.

కాలం కల్సి రాలేదు. మిన్ను కుర్వ లేదు. మన్ను  పండ లేదు. కొత్తగ అప్పు పుట్ట లేదు. బ్యాంకు మనస్సు కరుగ లేదు.  అందుకే ఆశలు చెల్కన్న ఇంటి ఇనుప దులానికి ఉరి పోసుకున్నవి. అవి ఆకేవలం ఆశలే కాదు… ఒక భరోసా బతుకు చాలించింది… పది మందిని ఆదుకునే చేతులు  ఇక ఎప్పటికీ కదలని స్థితికి పోయాయి. పది మంది కోసం తపించే గుండెలు ఆగిపోయాయి. అవి మట్టిని ప్రేమించి… మట్టిని ముద్దాడి…అదే మట్టిలో  ఇక శాశ్వతంగా అందులోనే కల్సిపోయాయి.

మోహనచారి దంపతుల మృతదేహాల చుట్టూ ఏడస్తున్న బంధువులు, స్నేహితులు, జనాలు… అందరూ అన్నీ  అంటున్నారు. అన్నీ వల పోసుకుంటున్నారు. కానీ చెమట నెత్తరు ఎరువుగ చల్లి పండించిన పంట ఈ మరణాలకు సమాధానం ఇవ్వడం లేదు. ఉరిపోసుకున్న యవ్వనపు ఊపిరి ఇంకా నేలను ప్రశ్నిస్తనే ఉన్నది.  తమకు ముందు.. తమ తర్వాత ఇంకెంత మంది ఇట్లా అని. దీనికి సమాధానం ఇప్పటికైనా ఈ సమాజం చెప్పాల్సిందే. వెతలు,  వలపోతలు.. తల పోతలు  అన్నీ  గుర్తుకొస్తవి. రేపో మాపో అప్పుల వాళ్లు భూమి జప్తు చేస్క పోతరు. కానీ… మనకు అన్నం  పెట్టిన మనుష్యులు.. మట్టిని ప్రేమించిన మనుష్యులు.. పది మందికీ బతుకునిస్తున్న మనుష్యులు… ఏ మోసమూ ఎరుగని మట్టి మనుష్యులు మన కండ్ల మందే… నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నరు. కండ్ల ముందే మట్టిల కల్సిపోతున్నరు.

ఇగో ఇప్పటికైనా సరే… గురువు  దైవం అంటాం కదా..  రైతును అంతకు మించి అనంగ వింటాం కదా. వినడమే కాదు…  గుండెలున్నవారు…. రక్త మాంసాలున్న మనుష్యులు తప్పక  స్పందించాలే.. ఇంకిన్ని మట్టి చేతులు.. ఇంకిన్ని ఆశలు.. ఆశయాలు… భరోసాలు.. బలి కాకుండా చూడాలి… తాను సేద తీరే చెట్టే రైతుకు ఉరి తాడుకు ఆసరా కాకుండ చూడాలి.  మనిషికి నీడ ఉన్నట్లు.. మనకు రైతు అట్లా. రైతును ఆదుకునే గుండెను.. దానికింత తడిని పాలకులు, బ్యాంకులు…. వారిపై ఆధారపడి బతుకున్న మనకూ ఆ ప్రకృతి ప్రసాదించాలని కోరుకుందాం…. మట్టి మనిషిని బతికించుకుందాం.

 

                                                                                –  బుచ్చన్న

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy