మన్నై కలిసిపోయినా.. మొక్కై ఎదుగుతాడు

ganesh01ఎకో గణేశా… ఎకో గణేశా.. అని ఎంత మొత్తుకున్నా ఎవడూ వినడం లేదు. ఎంత చెప్పినా… ఆ ప్యారీస్ ఆఫ్ ప్లాస్టర్ వెంటే పడుతున్నారు జనం. అలాంటి వారిలో మార్పు తీసుకురావడానికే అన్నట్టు తన బుల్లి బుర్రలోని ఆలోచనలకు పదునుపెట్టి ఓ కొత్త వినాయకుడికి రూపమిచ్చాడు ఆ 29 ఏళ్ల ముంబై కుర్రాడు. పేరు దత్తాత్రి కొత్తూర్. పచ్చని చెట్లను కొట్టి.. అభివృద్ధి.. ఆర్భాటాలు అంటూ పరిగెడుతున్న సమాజానికి ఓ కొత్త మెసేజ్ పాస్ చేశాడు. గణేశ్ సంబురాలు ఘనంగా చేసి ఆ దేవగణాధిపతిని… ఏ వాగులోనో, వంకలోనో అవేమీ లేకపోతే ఏ మురికికాలవలోనో పడేసే జనానికి ఇదిగో ఇదీ గణేశ్ సంబరమంటే అని చేసి చూపించాడు.

ganesh-speak

పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ట్రీ గణేశ్ ని పూజించమంటున్నాడు దత్తాత్రి. ఆ ఏముంది ఏ చెట్టునో గణపతిగా భావించి పూజించమని చెప్పుంటాడులే అనుకుంటున్నారా..? అదేం కాదు. అందరిలాగే తనూ గణపతిని పెట్టాడు. పూజలు చేశాడు. కానీ నిమజ్జనమే వెరైటీగా చేశాడు. బొజ్జగణపయ్యను తనే స్వయంగా ఎర్రమట్టితో తయారు చేసుకున్నాడు దత్తాత్రి. అయితే ఆ తయారీలోనే తన బుర్రను ఉపయోగించాడు. మట్టితోపాటు ఎరువు కలిపి.. వినాయకుడిని తయారు చేశాడు. తయారీ తర్వాత విగ్రహం లోపల విత్తనాలు వేశాడు. ఆ విగ్రహాన్ని ఓ తొట్టెలో ప్రతిష్ఠించి… పూజలు చేశాడు. పూజలు అయిన తర్వాత నిమజ్జనం రోజు ఆ తొట్టెను తీసుకువెళ్లి ఇంటి ఆవరణలో పెట్టేశాడు. రోజూ నీళ్లూ పోస్తూ… ఐదురోజుల్లో గణపతి పూర్తిగా కరిగిపోయి.. మట్టిలో కలిసిపోయేటట్టు చేశాడు. ఇదే… మూడు వారాల తర్వాత మొలకెత్తి.. మొక్కరూపంలో దర్శనమిచ్చాడు గణపతి.  ట్రీ గణేశ్ అంటే ఇదే అంటున్నాడు దత్తాత్రి. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రూపొందించాడు.

ఆ వీడియో మీరు చూడండి.

377001-02

ఇలా ఆరేళ్లుగా చేస్తున్నాడట దత్తాత్రి. దీనిపై ఆయన ఏమంటున్నాడంటే… “నేనొక్కడినే ట్రీ గణేశుడిని పూజిస్తున్నాను… వచ్చే ఏడాది నన్ను చూసి మరికొందరు ట్రీ గణేశుడిని తయారుచేసుకొనే అవకాశముంది. దీన్ని కమర్షియల్ చేయడం నాకు ఇష్టం లేదు. తయారు చేసి అమ్మేకన్నా.. దానికి బదులుగా ఎవరికి వారు తయారు చేసుకుంటేనే బాగుంటుంది. అవరోధాలను తొలగించి.. విజయాలను అందించే వినాయకుడు.. నేను ప్రారంభించిన ఈ పనిని సక్సెస్ చేస్తాడని నాకు నమ్మకముంది” అని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ పర్యావరణ గణపతి తను నిమజ్జనమైనా… ఈ ప్రకృతిని కాపాడటానికి తిరిగి ఉద్భవిస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నాడు దత్తాత్రి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy