మన వానలను మింగేస్తున్న చైనా టైఫూన్‌ : వాతావరణ శాఖ

rainsవర్షాలు జోరుగా కురుస్తాయని వాతావరణశాఖ చెప్పడమే కానీ వర్షాలు కురుస్తున్నది లేదు. అయితే ఈ విషయాలపై వాతావరణ శాఖ నిపుణులు ఇప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. మన దేశంలో పడాల్సిన వర్షాలు  చైనా వైపు వెళ్లిపోతున్నాయా? ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఔననే అంటున్నారు వాతావరణ నిపుణులు. చైనా సముద్రంలో కొద్దిరోజుల కిందట టైఫూన్‌ (దాని పేరు నెసెట్‌) ఏర్పడింది. అది ఆదివారం(జూలై-30) తైవాన్‌ సమీపంలో తీరం దాటింది. నెసెట్‌ టైఫూన్‌ చైనాలో పెను ప్రభావం చూపి భారీ వర్షాలు కురిపించింది. ప్రస్తుతం రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు పయనిస్తోంది. దీంతో కొన్నాళ్ల నుంచి తెలుగురాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. టైఫూన్‌ శక్తివంతంగా ఉండడంతో ఈ రుతుపవనాలు చైనావైపు మళ్లుతున్నాయి.

ఫలితంగా ఈ సీజనులో బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ, వాయుగుండాలు గానీ ఏర్పడటంలేదు. జూలై ఆఖరు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనీసం రెండు వాయుగుండాలు ఏర్పడి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవాలి. జూలై 18న వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినప్పటికీ అది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లపై తప్ప మన తెలుగురాష్ట్రాలపై ఏమంత ప్రభావం చూపలేదు. అప్పట్నుంచి బంగాళాఖాతంలో ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న మారుత, మే 28న మోరా  అనే తుపాన్లు ఏర్పడ్డాయి. ఫలితంగా అప్పట్లో ఆశించిన వర్షాలు కురిశాయి. జూన్‌ 12న వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినా అది మన తెలుగురాష్ట్రాలపై ప్రభావం చూపలేదు. జూలై 18 తర్వాత వాయుగుండాల జాడ లేకే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy