మన హైదరాబాద్ లో కోటీశ్వరుడి అజ్ఞాతవాసం

hitharth-dholakiaమహాభారత కాలం నాటి అజ్ఞాతవాసం. పాండవులు.. తమ అసలు రూపాలను వదిలి.. సాధారణ వ్యక్తుల్లా విరాట్ రాజు కొలువులో ఉద్యోగులుగా పని చేస్తారు. ఏడాదిపాటు అలాగే ఉంటారు.  అచ్చంగా అలాగే తన గుర్తింపును వదిలి.. ఓ సాధారణ పౌరుడిలా.. కొద్దిరోజుల క్రితం కేరళలో ఓ మిలియనీర్ కొడుకు అజ్ఞాతవాసం చేశాడు. సామాన్యుడిలా బతికి ఆ కుర్రాడు పేద, మధ్యతరగతి వ్యక్తుల కష్టాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు అలాంటి కథే.. మన హైదరాబాద్ లో జరిగింది. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి కొడుకు హితార్థ్‌ ధోలాకియా ఇలాగే సామాన్యుడిలా బతికి… అందరినీ ఆశ్చర్యపరిచాడు.  అమెరికాలో చదువుకున్న హితార్థ్ ను.. తానెవరో ఎవరికీ చెప్పకుండా నెలరోజుల పాటు అతి సాధారణ జీవితం గడపాలని, సొంతగా సంపాదించి చూపాలని ఆదేశించాడు ఆ కోటీశ్వరుడు. గుర్తింపు కార్డులు, మొబైల్‌ఫోన్‌ లేకుండా కేవలం 500 రూపాయలతో హితార్థ్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

నగరానికి అయితే వచ్చాడు కానీ.. పనులు మాత్రం అంత ఈజీగా దొరకలేదు. హితార్థ్ కు తొలి వారం ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్టు సాగిపోయింది. అడుగుపెట్టిన ప్రతీచోటా తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు అడిగారు. చివరకు తన వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్‌ ఫుడ్‌కోర్ట్, ఆడిదాస్‌ షోరూం, చిల్లీస్‌ రెస్టారెంట్‌ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్‌ షాపుల్లో దినసరి కార్మికునిగా నెలరోజుల పాటు బతుకుపోరాటం చేసి సంపాదించాడు. ఆ వచ్చిన దాంతోనే సరిపెట్టుకున్నాడు. బరువులు మోశాడు. ఇరుకు గదుల్లో పడుకున్నాడు. నెల రోజులపాటు తనెవరు అన్న విషయాన్ని మరిచి అందరితోపాటు తాను అన్నట్టుగా బతికాడు. శుక్రవారం  తాజ్‌ డెక్కన్‌ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హితార్థ్‌ ఈ విషయం చెప్పే వరకు ఎవరికీ తెలియదు. దీంతో ఒక్కసారిగా ఫోకస్ అయ్యాడు హితార్థ్.

హైదరాబాద్‌ అంటే ఎంతో మురిసిపోతున్నాడు హితార్థ్.  తనను ఎంతో ఆదరించించింది అంటున్నాడు. ఇక్కడ అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండడం ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. కొద్దిగా కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే హాయిగా బతకవచ్చేయొచ్చని తెలిపాడు. తనకు పని ఇచ్చిన యజమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు తనకు ఈ అనుభవం గొప్పగా ఉపయోగపడుతుందంటున్నాడు. తమ కంపెనీలో పనిచేసే కార్మికుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది అంటున్నాడు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి… హితార్థ్  రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి కుటుంబ స్నేహితుడు అవుతాడు.  ఆయన సాయం కూడా అస్సలు తీసుకోలేదు. అసలు హితార్థ్ ఇక్కడికి వచ్చిన విషయమే తెలియదు.

గతేడాది దీపావళి కానుకగా 1200 కార్లు, ఖరీదైన ఫ్లాట్లు తర కార్మికులకు బహుమతులుగా ఇచ్చిన వజ్రాల వ్యాపారి ఘనశ్యామ్ గుర్తున్నాడా.. ఆయన మరెవరో కాదు హితార్థ్ తండ్రే. ‘హరి కృష్ణా ఎక్స్‌పోర్ట్స్‌’అధినేత ఘన్‌శ్యామ్‌ ధోలాకియా. తండ్రిలా కార్మికుల కష్టసుఖాలు తెలుసుకోవడంలో ఇప్పుడు హితార్థ్ కూడా అనుభవజ్ఞుడు అయ్యాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy