మరణం నా చివరి చరణం కాదు: అలిశెట్టి

alishettiమరణం నా చివరి చరణం కాదని సగర్వంగా ప్రకటించిన కవి అలిశెట్టి ప్రభాకర్. తాను శవమై…మరోకరి వశమై…తనువు పుండై…మరొకరికి పండై అంటూ నాలుగు వ్యాఖ్యాల్లో వేశ్యాల జీవితాలను చిత్రీకరించి…తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశారాయన. కవిగా, పాత్రికేయుడిగా, చిత్రకారుడిగా కొత్త ఒరవడిని సృష్టించిన అలిశెట్టి… జయంతి ఇవాళ.

అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి చిన్నతనంలో చనిపోయారు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన ‘భాగ్యం’ ను పెళ్ళి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఓ ప్రముఖ దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా “సిటీ లైఫ్” పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు.

చిన్న పదాల్లో జీవిత సారాన్ని పలికించిన కవి అలిశెట్టి ప్రభాకర్. పదాలతోనే నిప్పులు కురిపించాడు. సామాజిక సమస్యలను చీల్చి చెండాడాడు. తెలుగు సాహిత్యంలోనే కాలం చెల్లని కవిత్వంగా నిలిచాయి అలిశెట్టి పదాలు. రాజకీయం, నిరుద్యోగం, అవినీతి, మహిళలు, రాజ్యాలు, సామ్రాజ్యవాదాలు ఏవీ వదల్లేదు అలిశెట్టి. ఆయన జయంతి, వర్ధంతి కూడా ఈరోజే.

తెలుగు సాహిత్యాన్ని విప్లవపథం వైపు నడిపించిన వారిలో ఒకరు. సామన్యుడి వేదనను… తన రచనల్లో అణువణువు చూపిన ఆ మహారచయిత జయంతి, వర్ధంతిని ఆయన అభిమానులు.. సాహిత్య ప్రేమికులు ఘనంగా నిర్వహించారు. సాహిత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫితో… తనదైన వాణి వినిపించిన అలిశెట్టి సేవలను స్మరించుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy