మరో భయం : భూమిపైకి మరో స్కైలాబ్ ?

sky-labరోదసిలోకి వెళ్ళిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్ -1హెచ్‌ 40 రోజుల్లో భూమిపై పేలుతుందా..!

.. పేలితే శకలాలతో తీవ్ర నష్టమంటున్న శాస్త్రజ్ఞులు

40 ఏళ్ల క్రితం.. అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్‌’ రోదసి నుంచి కూలి పోయింది. అది భూమిపై పడితే సర్వ నాశనం అవుతుందని, సమస్త ప్రాణకోటి మాడిమసైపోతుందని ప్రచారంతో ప్రపంచంలోని మానవాళి ఆనాడు భయంతో వణికిపోయింది. ఆ స్కైలాబ్ ఆస్ట్రేలియా సమీపంలోని సముద్రంలో పడడంతో ప్రమాదం తప్పింది.

అయితే గత నెల ఆగస్ట్ 31న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహం పరిస్థితి అదేనా? టన్నున్నర బరువుండే ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్‌ కాబోతోందా? ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో రోదసిలో కొట్టుమిట్టాడుతున్న ఆ ఉపగ్రహం 40 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని.. ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్రనష్టాన్ని కలగజేసే అవకాశముందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇస్రో మాత్రం అలాంటి ప్రమాదమేదీ లేదని కొట్టిపారేస్తోంది.

దేశీయ నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకునే క్రమంలో భాగంగా.. ఆగస్టు 31న ఇస్రో IRNSS-1H ఉపగ్రహాన్ని ప్రయోగించింది. రాకెట్‌ హీట్‌షీల్డ్‌ లోపం ఉండటంతో అది తెరుచుకోలేదు. ప్రయోగం విఫలమయింది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేదు. రాకెట్‌ హీట్‌షీల్డ్‌లో ఉండిపోయింది. ఈ హీట్‌షీల్డ్‌తో కలిపి ఈ ఉపగ్రహం భూవాతావరణం వైపు వేగంగా తిరిగి వస్తోంది. ఇది 40, 50 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఆ ఉపగ్రహం పేలిపోతే- ఆ గ్రహశకలాలు ఎక్కడ పడతాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ఉపగ్రహాలు మనకు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని పెరిజి (భూమికి సమీపంలో ఉన్నప్పుడు).. అపోజి (భూమికి దూరంగా ఉన్నప్పడు)లలో కొలుస్తారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం పెరిజి 164 కిలోమీటర్లు ఉంటే.. అపోజి 6,500 కిలోమీటర్లు ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

‘‘రాకెట్‌ నాలుగో దశ భాగం.. ఉపగ్రహం హీట్‌షీల్డ్‌- ఈ మూడింటి బరువు 2.4 టన్నులు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం నుంచి మా ట్రాకింగ్‌ స్టేషన్లకు సంకేతాలు అందుతున్నాయి. ఉపగ్రహంలో 750 కేజీల ఇంధనం ఉంది. దానికి సంకేతాలు పంపి మండించటానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఎప్పుడు భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం..’’ అని ఇస్రో  డైరక్టర్‌ కె.శివన్‌ పేర్కొన్నారు. భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఉపగ్రహం ట్రాకింగ్‌ స్టేషన్ల ఆధీనంలో ఉండదని స్పష్టం చేస్తున్నారు ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్‌ పి.పూర్ణచంద్రరావు. రాకెట్‌ను సెకనుకు కిలోమీటరు వేగంతో పైకి పంపుతారు. రోదసి నుంచి భూవాతావరణంలోకి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. భూవాతావరణం సమీపంలోకి వచ్చేటప్పటికి భూమ్యాకర్షణ శక్తి దానిపై పనిచేసి.. తనవైపు లాక్కుంటుంది. ఆ శకలాలు ఎక్కడపతాయనేదే పెద్ద ప్రశ్న’’ అంటున్నారు ఆయన.

36 గంటల ముందే సమాచారం

అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే శకలాల వేగాన్ని కనిపెట్టడానికి నాసా దగ్గర టూ ఎలిమెంట్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ, ఇస్రో దగ్గర మల్టీ అబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలు ఉన్నాయి. టూ ఎలిమెంట్‌ సిస్టమ్‌ అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలపైన, శకలాలపైన ఒక కన్నేసి ఉంచుతుంది. వీటి ద్వారా శకలాలు భూవాతావరణానికి సమీపంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ శకలాలు ఎక్కడ పడతాయనే విషయం 36 గంటల ముందు మాత్రమే గుర్తిస్తారు. ప్రస్తుత సమాచారం ఆధారంగా శకలాలు సముద్రంలో పడతాయని భావిస్తున్నాం. కచ్చితమైన సమాచారం మాత్రం 36 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్‌ అయ్యే అవకాశం లేదు అంటున్నారు డైరెక్టర్ కె.శివన్‌.

1979లో జనాన్ని వణికించిన ‘స్కైలాబ్‌’

స్కైలాబ్‌.. ఇప్పటి తరం వారికి ఆ పేరు గురించి తెలీదుగానీ, 40-50 ఏళ్లు దాటిన వారికి ఆ సంచలనం. అమెరికా ప్రయోగించిన ఆ తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 1979 జూలై 11న కూలిపోయింది. అది కూలడానికి కొద్దిరోజుల ముందు ‘స్కైలాబ్‌ మీద పడుతుందట.. మనుషులంతా చచ్చిపోతారట’’ అనే వదంతులు జోరుగా షికారు చేయడంతో అరాచకం ప్రబలింది. ఉన్న కొన్ని రోజులూ ఎంజాయ్‌ చేసిచచ్చిపోదామనుకున్నవారు కొందరు.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా లాభపడినవారు మరికొందరు.. చేతిలో ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చుచేసినవారు ఇంకొందరు.. అమెరికాలో చాలా మంది ‘స్కైలాబ్‌’ పేరుతో వస్తువులు అమ్మి వ్యాపారం చేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్‌ అనే కంపెనీ.. తొలి స్కైలాబ్‌ శకలాన్ని తెచ్చిచ్చినవాళ్లకి 10వేల డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. క్రానికల్‌ సంస్థ.. స్కైలాబ్‌ వల్ల నష్టపోయినవారికి 2 లక్షల డాలర్లు ఇస్తామంది. కానీ, వాస్తవంలో స్కైలాబ్‌ వల్ల పెనుప్రమాదమేదీ సంభవించలేదు. అది ఆస్ట్రేలియాకు సమీపంలో సముద్రంలో కూలిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎస్పరెన్స్‌లో ఓ వ్యక్తి ఇంట్లో 24 శకలాలు పడ్డాయి. ఫిలడెల్ఫియా వ్యాపారవేత్త ఒకరు ఆ ఆస్ట్రేలియన్‌ను, అతడి కుటుంబాన్ని అమెరికాకు తీసుకెళ్లి 10 వేల డాలర్ల నగదు బహుమతి ఇప్పించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy