మళ్లీ చెట్టెక్కిన బేతాళుడు

advani తెలంగాణ బిల్లుకు మద్దతుపై బీజేపీ మళ్లీ అడ్డం తిరిగింది. మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సవరణలు చేస్తేనే బిల్లుకు మద్దతిస్తామని రోజుకో మాట మాట్లాడారు బీజేపీ అగ్రనేతలు. దీనిపై తెలంగాణ నేతల్లో అసంతృప్తి కూడా మొదలైంది. చివరికి తెలంగాణలో డామేజ్ అవుతోందని కమలనాథులకు అర్థమైంది. బుధవారం ప్రధానితో విందు భేటీలో కొన్ని సవరణలతో బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో అన్ని అడ్డంకులూ పోయినట్టేనని అంతా భావించారు. ఇక గురువారం సభలో గందరగోళం తర్వాత మళ్లీ బీజేపీ అగ్రనేతలు మొదటికొచ్చారు. గతంలో ఏం చెప్పిందే మళ్లీ చెప్పారు. మొదటి వాయిస్ అగ్రనేత అద్వానీదే. తెలంగాణ బిల్లు పెట్టండంటూనే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా అని సందేహాలు బయటపెట్టారు లాల్ కృష్ణ. ఓటాన్ అకౌంట్ తప్ప ఇంకేం పెట్టే అవకాశం లేదంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో సుష్మా స్వరాజ్ కామెంట్లు అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. సభలో హోంమంత్రి షిండే బిల్లు పెట్టినట్టు కనిపిస్తున్నా, బిల్లు ఇంకా సభలో పెట్టినట్టు భావించడం లేదని సుష్మ బయట చెప్పారు. సభలో సంఘటనలకు కాంగ్రెస్ దే బాధ్యతన్నారు ఆమె. అసలు బిల్లు పెట్టే విధానమే ఇది కాదని కామెంట్ చేశారు. ఇక బీజేపీ నుంచి మూడో వాయిస్ గా పార్టీ ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ కూడా మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టాలంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ పాతపాట పాడారు.

బీజేపీ నేతల తీరు చూసి కేంద్ర మంత్రి కమల్ నాథ్ మండిపడ్డారు. సభలో తెలంగాణ బిల్లు పెట్టామనీ, కావాలంటే రికార్డులు చూసుకోండని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ బిల్లును నెగ్గించి  తీరతామంటూ, ఈ విషయంలో బీజేపీ ముసుగు తీసేసిందని నిప్పులు చెరిగారు. తెలంగాణకు వ్యతిరేకంగానే బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy