మళ్లీ దొరికాడు : అమ్మాయి కోసం మొదలెట్టాడు.. ఇప్పుడు 150 చోరీలు

Muhammad-Saleemఅసలు పేరు మహ్మద్ సలీమ్. ముద్దుగా పెట్టుకున్నది సునీల్ శెట్టి. బాలీవుడ్ హీరో అంటే వీరాభిమాని.. అతని పేరునే తన పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం 45 ఏళ్ల వయస్సు. 16వ సంవత్సరంలో మొదటి దొంగతనం చేశాడు. ఆ తర్వాత అదే అలవాటు అయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 150 దొంగతనాలు చేశాడు. 21 సార్లు జైలుకి వెళ్లాడు. అరెస్ట్ అయిన ప్రతిసారీ శిక్ష అనుభవిస్తాడు. బెయిల్ కూడా వేయడు. బయటకు కూడా రాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నావ్ అంటే.. మొదటిసారి తనకు పరిచయం అయిన అమ్మాయితో షికారు చేయటానికి కావాల్సిన డబ్బుల కోసం దొంగతనం చేశాను. అది కూడా తన తండ్రి దుకాణం నుంచే.. అప్పటి నుంచి మొదలైంది నా దొంగతనం అంటున్నాడు సలీం అలియాస్ సునీల్ శెట్టి.

హైదరాబాద్ ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన వ్యక్తి సలీం. ఇళ్లలో దొంగతనాలు చేయటంలో సిద్ధహస్తుడు. కటింగ్ ప్లేయర్, టార్చ్ లైట్ మాత్రమే ఉపయోగిస్తాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలోనే దోపిడీలు చేస్తాడు. అది కూడా సిటీలోని చంద్రాయణగుట్ట, ఫలక్ నుమ, కాలాపత్తర్, కామాటిపుర, హుస్సేనిఆలం, కంచన్ బాగ్, సంతోష్ నగర్, బాలాపూర్, పహాడీషరీఫ్, మైలార్ దేవ్ పల్లి ఏరియాల్లోనే దొంగతనం చేస్తాడు. బంగారు ఆభరణాలు, డబ్బు మాత్రమే తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంటిని శుభ్రంగా సర్ధి మరీ వెళతాడు. వస్తువులను చెల్లాచెదురు చేయడు.

దొంగతనం చేసిన సొమ్ముతో చేసే జల్సాలు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. చక్కగా ముంబై వెళతాడు. షికార్లు చేస్తాడు. హెలికాఫ్టర్ లో సరదా రైడింగ్ కు వెళతాడు. ఇప్పటికే 20 సార్లు ముంబై వెళ్లాడు. వెళ్లిన ప్రతిసారీ తన అభిమాన హీరో సునీల్ శెట్టి ఇంటి దగ్గరకు వెళతాడు. ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తాడు. ఇప్పటి వరకు కలవలేదు. ముంబైలో పరిచయం అయిన ఓ అమ్మాయి.. సలీం దగ్గర రూ.12 లక్షలు కొట్టేసింది. ఇప్పటికే 150 దొంగతనాలు చేసిన సలీంపై పీడీ యాక్ట్ పెట్టటానికి కూడా అవకాశం లేదంటున్నారు పోలీసులు. జైలుకి వెళ్లిన ప్రతిసారీ పూర్తికాలం శిక్ష అనుభవిస్తుండమే దీనికి కారణం. ఇటీవల కాలంలో ఆయా ప్రాంతాల్లో వరసగా జరుగుతున్న దొంగతనాలపై నిఘా పెట్టిన పోలీసులు.. సలీంను అరెస్ట్ చేశారు. రూ.20 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి మాత్రం కఠిన శిక్ష పడుతుందని చెబుతున్నారు పోలీసులు..

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy