మహిళల క్రికెట్ మహా సంగ్రామం : ఆల్ ది బెస్ట్ మిథాలీ సేన

22ap-main2aఆల్ రౌండ్ ఫామ్ తో మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతోంది. తొలి కప్పు కోసం తపిస్తోంది. హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీరాజ్‌ నేతృత్వంలోని భారత్‌.. ఆదివారం(జూలై-23 )న ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగే ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. మూడు సార్లు ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో పోరు భారత్‌కు సవాలే. అయితే లీగ్‌ దశలో ఆ జట్టును 35 పరుగుల తేడాతో ఓడించిన అనుభవం మిథాలీ బృందానికి ఉంది. సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాకివ్వడంతో భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది.

టీమ్ ఇండియా ఇప్పటిదాకా ప్రపంచకప్‌ గెలిచింది లేదు. ఇంగ్లాండ్‌ మూడుసార్లు ఛాంపియన్‌ (1973, 1993, 2009) అయింది. ఇంతకుముందు 2005లో ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత్‌.. మళ్లీ ఇప్పుడు తుది పోరుకు అర్హత సాధించింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే భారత్‌కు నాయకత్వం వహిస్తుండటం విశేషం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం భారత జట్టు ఎంతో బలంగా ఉంది. జట్టులో చాలామంది మ్యాచ్‌ విన్నర్లున్నారు. కెప్టెన్‌ మిథాలీ స్ఫూర్తిమంతమైన నాయకత్వం భారత్‌కు అదనపు బలం. ఆమె జట్టును ముందుండి నడిపిస్తోంది. టోర్నీలో ప్రదర్శన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై తిరుగులేని విజయం భారత్‌ విశ్వాసాన్ని పెంచేవే. టోర్నీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండటంతో మిథాలీ సేనకు అభిమానుల మద్దతు కూడా బాగా పెరిగింది. ఫైనల్‌కు భారత అభిమానులు పెద్ద ఎత్తునే హాజరయ్యే అవకాశముంది. ఫైనల్లో గెలిస్తే భారత మహిళల క్రికెట్‌ రూపురేఖలు మారిపోవచ్చు. అందుకే ఈ పోరు భారత అమ్మాయిలకు ఎంతో ప్రతిష్టాత్మకం.

ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు

ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని సభ్యులందరికీ రూ. 50 లక్షల చొప్పున… సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని తెలిపింది.

జట్లు (అంచనా):
భారత్‌: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), పూనమ్‌ రౌత్, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్‌ కౌర్, దీప్తిశర్మ, వేద కృష్ణమూర్తి, సుష్మా వర్మ, శిఖాపాండే, జులన్‌ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్‌/ఏక్తా బిష్త్‌.

ఇంగ్లండ్‌: హీథెర్‌ నైట్‌ (కెప్టెన్‌), బీమోంట్, లారెన్‌ విన్‌ఫీల్డ్, సారా టేలర్, నటాలీ సైవర్, ఫ్రాన్‌ విల్సన్, బ్రంట్, జెన్నీ గన్, లౌరా మార్ష్, ష్రబ్‌సోల్, అలెక్స్‌ హార్ట్‌లీ.

పిచ్, వాతావరణం
పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. చిరుజల్లులు కురిసే అవకాశముంది. కానీ మ్యాచ్‌ను ప్రభావితం చేసేంత వాన ముప్పయితే లేదు. పైగా రిజర్వ్‌ డే (24, సోమవారం) కూడా ఉంది.
మ్యాచ్ : మధ్యాహ్నం   గం. 2.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్షప్రసారం

ఈసారి వదలొద్దు..

నాడు, నేడు మిథాలీనే కెప్టెన్‌. కానీ ఈసారి మాత్రం ‘కప్‌’ను వదలొద్దు. ఆతిథ్య జట్టును హడలెత్తించాలని… కొత్త     చాంపియన్‌గా అవతరించాలని… కప్‌తో స్వదేశం తిరిగి రావాలని… కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష. తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌ అంతిమ సమరంలోనూ అదే జట్టును మళ్లీ మట్టికరిపించాలని ఆశిస్తూ… ఆల్‌ ది బెస్ట్‌… టీమిండియా

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy