
ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు కార్యక్రమాల్లో సంస్కృతీ సంప్రదాయాలు, సాహిత్యంపై చర్చ జరిగింది. తెలంగాణ సాహిత్యంపై లోతైన పరిశోధన అవసరమన్నారు స్పీకర్ మధుసూదనాచారి. తెలంగాణ విమర్శ-పరిశోధనపై తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రధాన్యత ఇస్తున్నామన్నారు.
ప్రపంచ మహాసభలు చరిత్రలో లిఖించదగినవన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలుగు వర్సిటీ వేదికగా సెకండ్ సెషన్ లో శతక, సంకీర్తన, గేయ సాహిత్యంపై చర్చకు హాజరైన మంత్రి… కవులు, కళాకారులను సన్మానించటం ఆనందంగా ఉందన్నారు. తెలుగువర్సిటీలో సాయంత్రం జరిగిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ కవులు హాజరై కవితా పఠనం చేశారు.
ప్రపంచ మహాసభలు ఉగాది పండుగలా జరుపుకొంటున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. కళాకారులకు ఉద్యోగ అవకాశం ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందన్నారు.
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా ఉదయం నుంచి రాత్రి వరకు… 9 విడతలుగా బృహత్ కవి సమ్మేళనాలు జరిగాయి. రవీంద్రభారతిలో కవయిత్రుల సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. పలువురు రచయిత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అంతకుముందు తెలంగాణ మహిళా సాహిత్యంపై సదస్సు జరిగింది.
పత్రికలు, ప్రసార మాద్యమాల్లో తెలుగు అంశంపై ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన చర్చ జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కే.కేశవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీడియాలో వివిధ స్థాయిల్లో పనిచేసిన ప్రముఖులు హాజరై మాట్లాడారు. మధ్యాహ్నం న్యాయ, పరిపాలనా రంగాల్లో తెలుగు అంశంపై చర్చ జరిగింది. మాడభూషి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.