మానవత్వం మంట కలిసింది : పాడె మోయడానికి రాని ఆ నలుగురు

భువనేశ్వర్‌ : కులాలు, మతాలు, కుతంత్రాలు..మనిషిని కాల్చుకు తింటున్నాయి. వీటిపై ఎంత ప్రచారం జరిగినప్పటికీ ఎక్కడో చోట దారుణ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మనిషి బతికున్నప్పుడు మనశ్శాంతిగా ఉండనివ్వని కులం..కనీసం చనిపోయిన శవంపై కూడా కనికరించ కుండా చేసింది. ఓ మహిళ మృతి చెందితే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్కరు దగ్గరకు రాలేదు. కారణం ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ కావడమే. చివరకు ఆమె కుమారుడు ఒక్కడే సైకిల్‌ పై తన తల్లి శవాన్ని తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని  కర్పాబహాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా(45), తన కుమారుడు సరోజ్‌(17)తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి చనిపోయింది. తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్‌  గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌ పై తీసుకెళ్లి గ్రామానికి 6కిలో మీటర్ల దూరంలో ఉన్న  అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ తెలిపాడు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని కన్నీరుమున్నీరయ్యాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారగా .. సోషల్ మీడియాలో కుల, మతాలపై చర్చ జరుగుతుంది. మనిషి చనిపోతే కనీసం పాడె మోయడానికి ఓ నలుగురైనా రాకపోవడం దారుణం అని కామెంట్స్ చేస్తున్నారు. మానవత్వం మంట కలిసిందంటున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy