మార్చి 11న కొత్త పట్టా పాస్ పుస్తకాలు: కేసీఆర్

CMKCRమార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టా పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. కొత్త పట్టా పాస్‌పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ల విధానంలో సంస్కరణలపై సమీక్ష జరిపిన ఆయన.. పట్టాపాస్ పుస్తకాల పంపిణీకి రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే భూ రికార్డుల ప్రక్షాలన చేపట్టామని… భూమి వివరాలు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయన్నారు.
భూ వివరాలతో కూడిన పట్టా పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నామని.. భూమికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడ్తామన్నారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి పేరుతో ల్యాండ్ వెబ్‌సైట్ నిర్వహిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానం కూడా మార్చి 11 నుంచి అమలు చేస్తామన్నారు.  మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.

ఆయన ఇంకేమన్నారంటే…

మార్చి 11 నుంచే ఎమ్మార్వో ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని.. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రెండు శాఖల మధ్య సమన్వయం సాధించడానికి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు.

ఏ భూమికి ఎవరు యజమానో తేలింది. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాలను జారీ, పంట పెట్టుబడి పథకం, మద్దతు ధర పథకం అమలు చేస్తామన్నారు. కోర్టు కేసులు ఇతర అభ్యంతరాలు కలిగిన భూములను పార్ట్ బీలో పరిష్కరిస్తామన్నారు. పార్ట్ బీ చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని.. త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అనంతరం పార్ట్ బి ప్రక్షాళన కూడా నిర్వహిస్తామన్నారు. పార్ట్ ఏ ద్వారా లెక్క తేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలున్నాయి. వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy