మా నాన్నే ‘గౌతమిపుత్ర’ అవకాశమిచ్చారు..

balakrishna-ntrపౌరాణికం, చారిత్రకం, జానపదం, సోషియో ఫాంటసీ, సాంఘికం… ఇలా అన్ని రకాల కథల్లోనూ ఒదిగిపోయిన అరుదైన నటుడు… నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. మరోసారి ఆయన చారిత్రక కథని ఎంచుకొని, తెలుగు జాతి పరాక్రమాన్ని చాటిచెప్పిన శకపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రని పోషించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రేపు  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు నందమూరి బాలకృష్ణ.

వందో చిత్రంగా ఈ కథ కుదరడం నా పూర్వ జన్మ సుకృతంగా భావించానన్నారు బాలకృష్ణ. ఎందుకంటే ఇప్పటిదాకా తెరపై ఆవిష్కరించని పాత్ర ఇది. శాతవాహనుల గురించి మనకు కొద్దిగానే తెలుసు. అశోకుడు, శ్రీకృష్ణ దేవరాయలు, గణపతి దేవుడు, రుద్రమదేవిల గురించి మనం చదువుకొన్నంతగా శాతవాహనుల గురించి తెలియదు. మనకంటూ ఒక సంస్కృతిని, వారసత్వాన్ని, ప్రపంచపటంలో మన దేశానికి ఒక గుర్తింపునిచ్చిన కానరాని ఓ భాస్కరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండా మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, ఆయన బిడ్డగా ఈ సినిమా చేయడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు ఆయన. నాన్నగారు చేయాలనుకొన్న పాత్ర ఇది. అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల చేయలేకపోయారు. ఓ అదృశ్య శక్తిలా మారి ఈ అవకాశం ఆయనే కల్పించారేమోనని అనుకొంటున్నానన్నారు బాలకృష్ణ.

మన చరిత్ర, వారసత్వం చాలా గొప్పవి. వాటిని గుర్తు చేసుకోవడానికి, కాపాడుకోవడానికి, భావితరాలకి అందించడానికి ఇటువంటి సినిమాలు చాలా అవసరం. కరీంనగర్‌ జిల్లా కోటి లింగాల నుంచి, ఉజ్జయిని వరకు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన తెలుగు వీరుడు శాతకర్ణి. ఇలాంటి శకపురుషుల గురించి మనం తెలుసుకోవల్సిన అవసరం చాలా ఉందని భావించే ఈ చిత్రానికి ఒప్పుకన్నానన్నారు బాలకృష్ణ.

నా సినిమాలే నాకు పోటీ
నా సినిమాలే నాకు పోటీ. నా రికార్డులే నాకు లక్ష్యం. నేను ఇదివరకు చేసిన ‘లెజెండ్‌’ ఎన్నో రికార్డులు సాధించింది. అలా నా రికార్డులన్నింటినీ ఈ చిత్రం అధిగమిస్తుందని నమ్ముతున్నానన్నారు బాలకృష్ణ. పోటీలేనిదే మనలో ప్రతిభ బయటికి రాదు. ఈ పండక్కి మంచి సినిమాలొస్తున్నాయి. చిరంజీవిగారి సినిమా, నా సినిమా అన్నీ బాగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే పరిశ్రమకి మేలు జరుగుతుంది. వాళ్లకి కూడా నా శుభాకాంక్షలు అన్నారు ఆయన.

నాకు అభిమానులే బలం

నాకు అభిమానులే బలమన్నారు బాలకృష్ణ. నన్ను ప్రతివాళ్లూ తమ సొంత మనిషిగా, పక్కింటి వ్యక్తిగా భావిస్తారు. అందుకే కొత్త ప్రయత్నాలు చేయడానికి నేనెప్పుడూ భయపడనన్నారాయన. ఇప్పుడు తరం మారుతోంది. ఇప్పటి నుంచి నేనెలాంటి సినిమాలు చేస్తానన్నది చాలా కీలకం. నటుడిగా బాలకృష్ణ శకం మొదలవుతుందని కచ్చితంగా చెబుతా. పాత్రలు, కథల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు నందమూరి అందగాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy