మిగిలిన ఆ 14 మంది ఎక్కడున్నారు..?

suicide-bomb-terroristsదేశం రక్షణ వ్యవస్థలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఈ విషయాన్ని దేశ రక్షణశాఖ మంత్రే స్వయంగా ప్రకటించారు. దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్ బేస్ అయిన పఠాన్ కోట్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. కాస్త ముందుగా అలర్ట్ కావడంతో పెనుముప్పు తప్పింది. లేకుంటే భారీ విధ్వంసం జరిగేది. దేశాన్ని ధైర్యంగా ఉంచుతున్న వైమానిక సంపద బూడిదైపోయేది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది, వారి కుటుంబాలు, ట్రైనింగ్ కోసం వచ్చిన విదేశీ సైనికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

 

అడుగడుగునా నిర్లక్ష్యం

manohar_parrikar-22ఉగ్రవాదులు సరిహద్దు దాటడం దగ్గర నుంచి  ఎయిర్ బేస్ లోకి ప్రవేశించే వరకు ప్రతీ చోట భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భారత్ – పాక్ సరిహద్దులో ప్రతీక్షణం పటిష్టనిఘా ఉంటుంది. చిమ్మ చీకట్లోనైనా సరే చిన్న వస్తువు కదలినా గుర్తించే థర్మో ఇమేజింగ్ కెమెరాలు ఉంటాయి. అయినా… ఇవేవీ వారి కదలికలను రికార్డ్ చేయలేదు. అక్కడి నుంచి దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించి పఠాన్ కోట్ చేరుకున్నారు టెర్రరిస్టులు. ఈ మార్గంలో కూడా వీరికి ఎక్కడా అడ్డంకులు ఎదురుకాలేదు.

ఇక్కడి వరకు వీరి ప్రయాణం ఓకే.. కానీ.. ఎయిర్ బేస్ లోకి ఎలా ప్రవేశించారనేదే ఇప్పుడు సమాధానంలేని ప్రశ్న. పఠాన్ కోట్ఎయిర్ బేస్ చుట్టూ పది అడుగుల ఎత్తు గోడ ఉంటుంది. దానిపై సోలార్ ఫెన్సింగ్. గోడదూకి వెళ్లే అవకాశమే లేదు. అయినా.. టెర్రరిస్టులు లోనికి ఎలా చొరబడ్డారు..? వీరికి ఎవరైనా సహకరించారా..? స్లీపర్ సెల్స్ వీరికి ఆయుధాలు సిద్ధం చేశారా..? అనేవి ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు.

ఏకంగా తుపాకులతో వచ్చేశారు

ఉగ్రవాదులు ఉత్త చేతులతో ఇంత దూరం ప్రయాణించారంటే ఓకే అనుకోవచ్చు. కానీ వారు ఖాళీ చేతులతో రాలేదు. ఏకే 47 తుపాకులు, 50 కిలోల బుల్లెట్లు, డజన్ల కొద్దీ మేగజీన్లు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, కమాండో కత్తులు, కిలోల కొద్దీ ఆర్డీఎక్స్ తో ఎయిర్ బేస్ పై తెగబడ్డారు. దేశ వైమానిక సంపదను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ముందుకుకదిలారు.

ఉగ్రవాదుల కదలికను మొదటినుంచి పరిశీలిస్తే.. ప్రతీ చోట అనుమానమే. బార్డర్ దాటడం నుంచి.. ఎయిర్ బేస్ లోకి చొరబడే వరకు వందల ప్రశ్నలు. ఉగ్రవాదులు ఇంత భారీ మొత్తంలో ఆయుధాలతో సరిహద్దు దాటారా..? లేక దేశంలో ఉన్నవారు ఎవరైనా వీరికి సహకరించారా..? లేకుంటే ఒక్కొక్కరు 30 కిలోలకు పైగా బరువు మోస్తూ.. ఎవరికంటా పడకుండా 25 కిలోమీటర్లు ఎలా ప్రయాణించారు..? గురుదాస్ పూర్ ఎస్పీ చెబుతున్న దాని ప్రకారం.. వాళ్లు కిడ్నాప్ అయినప్పుడు టెర్రరిస్టుల దగ్గర ఏకే 47 తుపాకులు మాత్రమే ఉన్నాయి. కానీ… ఆపరేషన్ పూర్తయ్యాక అధికారులు గుర్తించింది మాత్రం కిలోల కొద్ది తూటాలు, ఆటోమేటెడ్ వెపన్స్. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి…?

ఆ 14 మంది ఎక్కడ..?

దేశంలోకి 20 మంది జైషే మహ్మద్ తీవ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పటాన్ కోట్ ఆపరేషన్ లో ఆరుగురు చనిపోయారు. మరి మిగిలిన 14 మంది ఎక్కడ..? ఏ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఆరుగురి దగ్గరే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు దొరికాయంటే… మిగిలిన టెర్రరిస్టుల దగ్గర ఇంకెన్ని వెపన్స్  ఉన్నాయి..? ఇలా చెప్పుకుంటూ పోతే పఠాన్ కోట్ దాడి ఘటనలో ప్రతీదీ ఓ క్వశ్చన్ మార్కే. వీటన్నింటికి రక్షణశాఖ దగ్గర కూడా సమాధానం లేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు రక్షణశాఖమంత్రి మనోహర్ పారికర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy