మీ డిపాజిట్ భద్రమేనా ?: బ్యాంకు దివాలా తీస్తే డబ్బు గోవిందా

bank-depositsడిపాజిటర్ల కొంప ముంచేందుకే FRDI బిల్లు

పిల్లల చదువు కోసం…పెళ్లి కోసం… రిటైరయ్యాక శేష జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడపడం కోసం… రోగాలు వచ్చిన తట్టుకోవడం కోసం…అందుబాటులో ఉంటుంది కదా…అని మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. వడ్డీ ఆవగింజంతైనప్పటికీ, భద్రత దృష్ట్యా ఫిక్సుడ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటాం. కానీ బ్యాంకులు నష్టాల బారిన పడి బోర్డు తిప్పేస్తే ఏంటి పరిస్థితి? మన డబ్బు భద్రమేనా? ఇన్నాళ్లూ అయితే సేఫ్‌గానే ఉండేది. ఇక మీదట అలా కుదరదంటుంది మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రూపొందించిన ఓ బిల్లు చట్టరూపం దాలిస్తే మన కొంప కొల్లేరే. అదే.. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు. ప్రస్తుతం ఇది పార్లమెంటు సెలక్ట్‌ కమిటీ పరిశీలనలో ఉంది. అది ఆమోదిస్తే వెంటనే కేబినెట్‌ క్లియర్‌ చేయాలి.. ఆ తరువాత వచ్చే సమావేశాల్లోనే చట్టరూపం దాలుస్తుంది.

కొత్త చట్టం బ్యాంకులకు వరం

గతంలో ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ప్రభుత్వం కొంత పెట్టుబడిని సాయంగా అందించి ఆ బ్యాంకు తన రుణ సమస్యల నుంచి విముక్తి అవడానికి ఉపయోగపడేది. దీన్ని ‘‘బెయిల్‌-అవుట్‌’’ ప్యాకేజీ అనేవారు. దీని ద్వారా డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉండేది. కానీ కొత్త బిల్లులో కేంద్రం ‘‘బెయిల్‌-ఇన్‌’’ అనే క్లాజు చేర్చింది. బెయిల్‌ అవుట్‌ క్లాజ్‌కు ఈ బెయిల్‌-ఇన్‌ అనేది పూర్తిగా విరుద్ధమైనది. రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ అనే వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లులో వీలు కల్పించారు. బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడితే వెంటనే ఈ కార్పొరేషన్‌ రంగంలోకి దిగి దాన్ని టేకోవర్‌ చేస్తుంది. ఏడాది కాలంలోగా సమస్యను పరిష్కరించడానికి ఓ రోడ్‌ మ్యాప్‌ను తయారు చేస్తుంది. అయితే అంతిమంగా ఆ సంస్థ సాయం చేసేది డిపాజిటర్లకు మాత్రం కాదు… బ్యాంకులకే.

*దివాలా తీసే బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిటర్ల డబ్బునే పెట్టుబడిగా పెట్టి అప్పులను తీర్చుకోవచ్చు.

* రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ అనుమతి ద్వారా మన డబ్బును సదరు బ్యాంకువారు వాడుకోవచ్చు.

* బిల్లులో ఈ కార్పొరేషన్‌కు ఎంతగా తిరుగులేని అధికారాలు కట్టబెట్టారంటే.. దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్‌ రద్దు చేసేయవచ్చు. దీని అర్థం.. మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదు.

* మనం పిల్ల పెళ్లికో లేక చదువుకో ఓ పది లక్షల రూపాయలను ఐదేళ్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామనుకుందాం. బ్యాంకువారు దాని లాక్‌-ఇన్‌ పీరియడ్‌ను 20 ఏళ్లకు మార్చేయవచ్చు. అంటే ఏ అవసరం కోసం మీరు దాన్ని దాచుకున్నారో అవసరాన్ని తీర్చుకోవడానికి ఆ డబ్బు లభించదన్నమాట. ఈ నిర్ణయాన్ని కూడా బ్యాంకు సొంతంగా తీసేసుకుంటుంది. దీనికి మీ అనుమతి అక్కర్లేదన్నది బిల్లు సారాంశం.

*విధిలేని పరిస్థితుల్లో బ్యాంకు తన డిపాజిటర్లకిచ్చిన హామీలను నెరవేర్చనక్కరలేదన్నది మరో నిబంధన. దీని అర్థం.. మీరు దాచుకున్న డబ్బు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉన్నట్టే.

* మనం 15 లక్షలు సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌లో దాచుకుంటే దానిని లక్ష రూపాయలకు మార్చేయవచ్చు. లేదా ఆ 15 లక్షల మొత్తాన్ని తమకు నచ్చినట్లు ఐదేళ్లకో లేక పదేళ్లకో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చేయవచ్చు. దేనికీ మీ అనుమతి తీసుకోరు.

ఏంటీ బెయిల్‌-ఇన్‌ ?

దివాళా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్‌ 52(1) కింద ఈ నిబంధనను చేర్చారు. దీని ప్రకారం- నష్టాలు కొంతవరకూ పూడ్చుకొని ఓ నిర్దిష్ట కాలావధి వరకూ లావాదేవీలు కొనసాగించడానికి, మార్కెట్‌లో విశ్వాసం తిరిగి సాధించడానికి కొంత పెట్టుబడిని సమకూరుస్తారు. అది కూడా ఓ స్కీం ద్వారా. ఈ స్కీంలో కూడా కొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయి. వీటి ప్రకారం: ఆ బ్యాంకుకున్న అన్ని రుణాలూ రద్దు చేసేయవచ్చు… లేక రుణాల కేటగిరీలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ఖాతాదారుల సొమ్మును ఎలాగైనా మార్పు చేయవచ్చు..డిపాజిట్ల కాలావధి మార్చేయొచ్చు.

బిల్లు ద్వారా ఏం చేస్తారు?

రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు బిల్లులో ప్రధాన అంశం. దివాళా తీసే బ్యాంకు అప్పులు, ఆస్తులు అన్నింటినీ ఓ పటిష్టమైన ఆర్థికసంస్థ లేదా బ్యాంకుకు బదలాయిస్తారు..బ్యాంకును అందులో విలీనం చేసేస్తారు. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ద్వారా లిక్విడేషన్‌ జరుపుతారు

డిపాజిటర్ల డబ్బుకు మాదీ పూచీ: జైట్లీ

డిపాజిటర్లు దాచుకున్న సొమ్ము ఎక్కడికీ పోదని, వారి హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ. బిల్లు స్టాండింగ్‌ కమిటీ పరిశీలనలో ఉందని, అటు బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థల ప్రయోజనాలనూ, ఇటు ఖాతాదారుల ప్రయోజనాలను కూడా కాపాడతామని ఆయన బుధవారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో దడ పుట్టించేలా ఉన్న ఈ ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు సారాంశం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ కావడంతో ఆయన ఈ వివరణ ఇవ్వకతప్పలేదు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ సి గార్గ్‌ కూడా ఓ వివరణ ఇచ్చారు. ఖాతాదారుల సొమ్ము పూర్తిగా భద్రమని, నిజానికి ఇపుడున్న రక్షణ చర్యలకంటే మరింత కట్టుదిట్టమైనవి చేరుస్తున్నామని, అటు పబ్లిక్‌ రంగ బ్యాంకులకు కూడా కొంత ఊరటనిచ్చే చర్యలున్నాయని వివరించారు ఆయన.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy