ముంబైలో 33 కి.మీ. భూగర్భ మెట్రో

  • బిల్డింగులు, ప్రార్థన మందిరాలు, చెరువుల కింది నుంచి నిర్మాణం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై.. జనాలతో కిక్కిరిసిపోయిన ఓ ప్రాంతం.. ఎవరి పనిలో వారున్నారు.. అక్కడ భూమి కింద కూడా పని జరుగుతోంది.. మెట్రో-3 లైన్‌ నిర్మాణం కోసం టన్నెళ్లను తవ్వుతున్నారు.. అరె పైన జనాలున్నారు.. కింద సొరంగాలు ఎలా తవ్వుతారు అని డౌటా.. అదే మెట్రో – 3 ప్రత్యేకత.. పైనున్న నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగకుండా కింద టన్నెళ్లు నిర్మిస్తున్నారు. సుమారు 2 కోట్ల జనాభా ఉన్న ముంబైలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరుండి మరీ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తోంది. మొత్తం 11 మెట్రో మార్గాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి లైన్‌ సేవలు మొదలయ్యాయి. రెండో లైన్‌ పనులు దగ్గరపడ్డాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది మూడో లైన్‌ గురించి.

ధారావి నుంచి దక్షిణ ముంబై వరకు

26 అండర్‌‌‌‌ గ్రౌండ్ స్టేషన్లున్న మెట్రో 3 ఇప్పటివరకు ముంబైలో చేపట్టిన అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టు. అంచనా వ్యయం రూ.23,136 కోట్లు. 33.5 కిలోమీటర్ల ఈ మెట్రో కొలాబా, బాంద్రా, ఎస్‌ఈఈపీజెడ్‌ (ఇండస్ట్రియల్‌ జోన్‌ )లను కలుపుతూ పోతోంది. అండర్‌‌‌‌ గ్రౌండ్‌ టన్నెళ్లు ముంబైలో రద్దీ ప్రాంతాలైన వెస్టర్న్‌‌‌‌ సబర్బన్‌, ముంబై విమానాశ్రయం, దక్షిణ ముంబైని కలుపుతాయి. అలాగే మురికివాడలైన ధారావి, బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌, ప్రభాదేవి ఆలయం, ఇతర ప్రముఖ ప్రదేశాల నుంచి వెళ్తున్నాయి. దక్షిణ ముంబైలోని చివరి స్టేషన్‌ అప్‌ మార్కెట్ కఫే పరేడ్‌. ఒక్కసారి ప్రాజెక్టు పూర్తయితే ధారావిలో గాని, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గాని ప్రయాణికులు రైలెక్కితే ఎలాంటి ట్రాఫిక్‌ లేకుండా ఏసీ వాతావరణంలో దక్షిణ ముంబైలోని కఫే పరేడ్‌కు వెళ్లొచ్చు.

17 పెద్ద డ్రిల్లింగ్‌ మెషీన్లతో పని

ప్రాజెక్టులో భాగంగా ప్రార్థన మందిరాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, నీటి వనరుల కింద నుంచి టన్నెళ్లు తవ్వుతున్నారు. 17 పెద్ద డ్రిల్లింగ్‌ మెషీన్లతో భూమికి 22 మీటర్ల అడుగున రోజూ తవ్వకాలు జరుగుతున్నాయి. రాక్‌ కట్టింగ్‌ మెషీన్లు బసాల్ట్‌ రాళ్లను తొలిచేందుకు కష్టపడుతున్నాయి. నగరంలో 52 కిలోమీటర్ల మేర టన్నెలింగ్‌ నిర్మాణమంటే ఆశ్చర్యమే. అదీగాక అత్యంత రద్దీ ప్రాంతాల కింద 26 అండర్‌‌‌‌ గ్రౌండ్ స్టేషన్లు నిర్మించాలి. పైనున్న ట్రాఫిక్‌ను, పక్కనున్న బిల్డింగులు, ఇతర నిర్మాణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ ప్రాజెక్టు పనిని ఇప్పటికే అనేక పనులు అత్యంత సమర్థంగా నిర్వహించిన ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌‌‌ అశ్విని బిడేకు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే 17 కిలోమీటర్ల మేర టన్నెళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా మెషీన్లతో ప్రతిరోజు 700 మీటర్ల మేర సొరంగాన్ని తవ్వుతున్నారు.

అడ్డంకులూ తక్కువేం కాదు

అనుకున్నంత ఈజీగా మాత్రం మెట్రో 3 పని జరగడం లేదు. మెట్రో కోసం చెట్లు తొలగిస్తున్నారని, టన్నెళ్ల నిర్మాణంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని, మతపర ప్రార్థన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారని కొన్ని సిటిజన్‌ గ్రూపులు కోర్టుకెక్కాయి. పర్యావరణవేత్తలైతే మెట్రో కోసం చెట్లను అక్రమంగా తొలగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముంబై పార్సీలు అగ్ని దేవాలయం, పవిత్ర బావుల కింద తవ్వకం జరపొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అశ్విని బిడే మాత్రం అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేస్తున్నారు. తొలగిస్తున్న చెట్లను మళ్లీ మరో ప్రాంతంలో నాటుతున్నామని, ప్రాజెక్టు పూర్తయ్యాక భారీ స్థాయిలో చెట్లు పెంచుతామని చెబుతున్నారు. అగ్ని దేవాలయం, ఇతర ప్రార్థన ప్రదేశాల కింద తవ్వకంపై స్పందిస్తూ.. అనేక ప్రార్థన ప్రదేశాల కింద తవ్వకాలు జరుగుతున్నాయని, అయితే ఎక్కడా కూడా గర్భగుడి కింద తవ్వకాలు జరపడం లేదని వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy