ముస్తాబైన భాగ్యనగరం : తెలుగు పండుగకు ముమ్మరమైన ఏర్పాట్లు

aaసంస్కృతికి పట్టుగొమ్మగా.. సంప్రదాయాలకు ప్రతిబింబంగా ప్రపంచ తెలుగు మహాసభలను వైభవోపేతంగా నిర్వహించడానికి ముమ్మరమైన ఏర్పాట్లు చేశారు. భాషావికాసం, సాహితీ సౌరభం కలగలిసి ఐదురోజులపాటు మాతృభాషాభిమానుల మదిని ఓలలాడించడానికి భాగ్యనగరం ముస్తాబయింది. ఎనిమిది వేల మంది కవులు, రచయితలు, చరిత్రకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులతో ఇంకొన్ని గంటల్లో… అతిపెద్ద తెలుగు భాషా సంరంభానికి తెరలేవనుంది. ఆరంభ వేడుకలు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ క్రీడా మైదానంలో ఇవాళ సాయంత్రం కనులపండువగా జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా  జరుగుతున్న ఈ మహాసభలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. వేదికల అలంకరణ ఏర్పాట్లు నిన్న రాత్రి పూర్తయ్యాయి.

70 లక్షలతో ఎల్బీ క్రీడామైదానం అలంకరణ

ప్రారంభ వేడుకలను భారీఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఎల్బీ క్రీడామైదానాన్ని రూ.70 లక్షలతో అలంకరించారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా వేదికను సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వేడుకలు ప్రారంభవుతాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథి కాగా మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు కానున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు  పాల్గొంటారు. కవులు, రచయితలు, దేశ, విదేశీ అతిథుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో రాష్ట్రంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. అనంతరం ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తారు. ప్రసంగాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు

మహాసభలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలంకరణలు చేపట్టారు. విద్యుద్దీపాల అలంకరణలతో పాటు 100 మంది తెలంగాణ సాహితీమూర్తుల స్వాగతద్వారాలు, తోరణాలను ఏర్పాటు చేశారు. కటౌట్లు, హోర్డింగ్‌లు అమర్చారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారు. కవులు, కళాకారులు, భాషావేత్తలు, కమిటీలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. మహాసభలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు విడుదల చేశారు. దీంతోపాటు ఇంటర్మీడియట్‌ వరకు తెలుగును తప్పనిసరి   చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy