మెడికల్ టూరిజంగా… భాగ్యనగరం

Medical-tourisamవ్యాధిని తగ్గించే వైద్యం ఎక్కడ అందుబాటులో ఉంటే …అక్కడి వెళ్లడం సహజం. పల్లె ప్రజలు మంచి ట్రీట్ మెంట్ కోసం పట్నం వస్తే… డబ్బున్న వాళ్లు…. వ్యాధిని నయం చేయించుకునేందుకు ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే అక్కడ చూడదగ్గ ప్రదేశాలుంటే అవి కూడా చూస్తే ఆ సరదా కూడా తీరిపోతుంది. ఇదే  ఇప్పటి ట్రెండ్. అదే మెడికల్ టూరిజం. చాలాదేశాల్లో అందుబాటులో లేని వైద్యాన్ని ఇవ్వడంతో పాటు టూరిజాన్ని కూడా పెంచుతున్న కొత్త గ్లోబల్ బిజినెస్ ఇది. దీనికి మనదేశం కేంద్రంగా మారుతుంటే దేశంలోనే హాట్ స్పాట్  అయ్యింది మన హైదరాబాద్.

మెడికల్ టూరిజం అంటే ఇతర దేశాలవాళ్లు మన దగ్గరకు వచ్చి తక్కువ ఖర్చుతోని వైద్యం చేయించుకోవడం. కోలుకున్న తర్వాత… చూడదగ్గ ప్రదేశాలు చూసి తిరిగిపోవడం. వాళ్ల దేశాల్లో ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చు కంటే మన దగ్గర చాలా తక్కువ ఖర్చుతో మంచి వైద్యం ఇవ్వడం మెడికల్ టూరిజంలో ప్రధానం. దీంతో పాటు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు, దగ్గరుండి తీసుకునే జాగ్రత్తలు, అన్నీ చూపించి పంపించడం లాంటివి ఒకే ప్యాకేజీ కింద ఇస్తున్నారు కార్పొరేట్ హాస్పిటళ్ల వాళ్లు. అందుకే ఈ మధ్య కాలంల  లక్షల సంఖ్యలో మెడికల్ టూరిస్టులు ఇతర దేశాల నుండి మన హైదరాబాద్ కు వస్తున్నారు.

మెడికల్ టూరిజం మన దగ్గర కొత్తదేం కాదు. నిజాంలకు ముందు నుంచే మన దేశానికి ఇతర దేశాల నుండి వైద్యం కోసం వచ్చేవాళ్లు. హైదరబాద్ లోని యునానీ, ఆయుర్వేదం కోసం అప్పట్లో ఇతర దేశాల రోగులు వచ్చేవాళ్లు. నిజాంలకు ముందున్న కుతుబ్ షాహీలు కూడా దీన్ని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయాణ సాధనాలు, వసతుల కారణంగా విదేశాలనుంచి వచ్చేవాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది.

1980 తర్వాత హైదరాబాద్ లో మెడికల్ టూరిజం కొత్తగా పెరగడం మొదలైంది. ఈసారి కార్పొరేట్ హాస్పిటళ్లు ఇస్తున్న సదుపాయాలతో ఇతర దేశాల నుండి పేషెంట్లు వచ్చేవాళ్లు. మొదట్లో ఎక్కువగా కాస్మోటిక్ సర్జరీల కోసం ఇతర దేశాల నుండి వచ్చేవాళ్లు. ఇందులో ప్రధానంగా ముక్కు, బ్రెస్ట్, దంత వైద్యం లాంటివి ఉన్నాయి. సర్జరీలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలు చూసి తిరిగి వారి దేశానికి వెళ్లేవాళ్లు. 2010 తర్వాత మన దగ్గర మెడికల్ టూరిజం మరింత ఊపందుకుంది. ఇలా వచ్చేవాళ్ల సంఖ్య వేల నుండి లక్షలకు చేరుకుంది.

మన దేశంలో మెడికల్ టూరిజం బాగా ఉన్న నగరాల్లో ఢిల్లీ, చెన్నై ముందున్నవి. వాటిని అధిగమించి ప్రస్తుతం ఇప్పుడు  హైదరాబాద్ ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కువగ ఆఫ్రికన్ దేశాలు, మధ్య ఆసియా దేశాలవాళ్లు వస్తున్నారు.

రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడానికి రవాణా సదుపాయాలు ప్రధాన కారణం. హైదరాబాద్ నుండి   విమాన సౌకర్యాలు పెరిగిన తర్వాత  రోగులు ఇతర దేశాల నుండి రావడం బాగా పెరిగింది. ఐరోపా దేశాలకు మినహా చాలా వరకు ఆఫ్రికన్ దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు హైదరాబాద్ నంచి విమాన సౌకర్యం ఉంది. వాతావరణం, భిన్నమైన సంస్కృతి కూడా రోగులు ఇక్కడికి రావడానికి కారణం అంటున్నారు డాక్టర్లు.

ఎక్కవగా పేద దేశాల నుండే మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ల దేశాల్లో వైద్యం ఖర్చును భరించలేనంత ఎక్కువగా ఉండడంతో  హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ల దగ్గర తక్కువగా ఉన్న సౌకర్యాలతో చికిత్స కోసం చానా రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. మన దగ్గర ప్రత్యేక సదుపాయాల కారణంగా వెంటనే చికిత్స మొదలుపెట్టే వీలుంది. అందుకే ఇతర దేశాల పేషెంట్లు మన దగ్గరకు ఎక్కువగా వస్తున్నారు.

చికిత్స అయిపోయిన తర్వాత చూడదగ్గ ప్రదేశాలకు పోవాలనుకే వారికి రవాణా సదుపాయాలు కూడా మనకు బాగా ఉన్నాయి. చికిత్స, వసతులు, రవాణా, టూరిజం అన్నింటికీ కలిపి ఖర్చులతో ఒకే ప్యాకేజీ కింద మాట్లాడుకుని వస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలను హైదరాబాద్ లో డజను వరకు కార్పొరేట్ హాస్పిటళ్లు ఇస్తున్నాయి. అనుకూలమైన వాతావరణం, ఆహారం, వసతులు, భద్రత ఇవన్నీ బాగా ఉంటున్నాయి కాబట్టి మెడికల్ టూరిజం కింద ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy