మేడారం ఒక్కటే కాదు.. అడవి అంతా జాతరలే

medaram-jatara-2ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరలలో మేడారం ఒకటి. ఈ జాతరకు ముందు, తర్వాత కూడా మరికొన్ని అనుబంధ జాతరలు జరుగుతాయి. ఇవన్నీ సమ్మక్క బంధువులను దేవతలుగా కొలిచే జాతరలు. మేడారం జాతర రెండేళ్లకోసారి జరిగితే అనుబంధ జాతరలు వెనువెంటనే జరుగుతాయి. ఇలా ఏటా ఎక్కడో ఒకచోట ఆదివాసీ దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు పూజలు జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి మధ్య మేడారం జాతరకు కాస్త అటూ ఇటుగా వీళ్లందరికీ విడివిడిగా జాతరలు ఉంటాయి. వీరితో పాటు మరికొందరు దేవతల జాతరలు ఉన్నాయి. కొన్ని మేడారం జాతరతో పాటు జరుగుతాయి. ఇవన్నీ మేడారానికి చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంటాయి.

పెద్ద దేవత జాతరకు అనుబంధంగా, సమాంతరంగా ఎక్కువ సంఖ్యలో జాతరలు జరగడం అరుదే. మేడారం జాతర సమయంలో దగ్గరలోని అయిలాపూర్ లో సమ్మక్క జాతర జరుగుతుంది. ఇదే సందర్భంలో కన్నెపల్లి, భూపతిపురం మరికొన్నిచోట్ల సారలమ్మ జాతరలు ఉంటాయి. సమ్మక్క జాతర ముగిసిన వారం తర్వాత బయ్యక్కపేటలో చందా వంశం ఆధ్వర్యంలో సమ్మక్క జాతర జరుగుతుంది. మేడారం జాతర ముగిసిన మూడు రోజులకు పూనుగొండ్లలో పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తారు. పాత వరంగల్ జిల్లా, దానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఆదివాసీ దేవతల జాతరలు జరుగుతాయి. వాటిలో ముసలయ్య జాతర, గుంజేడు ముసలమ్మ జాతర, కాసాల నాయుడు జాతర, సూరగొండయ్య జాతర, లక్ష్మీదేవర జాతర, వేల్పులమ్మ జాతర, నాగులమ్మ జాతర, గోవిందరాజుల జాతరలు లాంటివి ఉన్నాయి. ఈ వేడుకలను కోయలు చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కుటుంబం మొత్తం స్నానాలు చేసి అడవికి వెళ్లి వనం తెస్తారు. పుట్ట మన్ను తెచ్చి దేవుని గుడిని అలికి అలంకరిస్తారు. ఆ తర్వాతే దేవుళ్లకు మొక్కి జాతర మొదలుపెడతారు.

అనుబంధ జాతరలలో బాలకుమారస్వామి జాతర ఒకటి. తాడ్వాయి మండలం గట్టుపై గండ్రగొడ్డలి రూపంలో బాలకుమారస్వామి వెలిశాడని ఆదివాసీల విశ్వాసం. ఆయన కూడా కాకతీయులతో యుద్ధంలో సమ్మక్క పక్షాన పోరాడినట్లు చెబుతారు. బాలకుమారస్వామి సమ్మక్క చినతండ్రి కొడుకుగా వరుసకు తమ్ముడు అవుతాడని చెప్తారు. మేడారం జాతర ముగిసిన మూడు రోజులకు ఈ జాతర జరుగుతుంది. ముందుగా ఊరిలో ఊరేగింపు చేస్తారు. తర్వాత లక్నవరం చెరువు గట్టు మీద ఏడు చెలిమలు తవ్వి వాటిలోని నీటితో స్వామికి అభిషేకం చేస్తారు. ఈ జాతరకు వచ్చి దేవుణ్ని కొలిస్తే పిల్లలు కలుగుతారని ఇక్కడివారి నమ్మకం. మేడారం దగ్గర రాయిని గూడెంలో ముసలయ్య జాతర జరుగుతుంది. ముసలయ్య కూడా కాకతీయులతో యుద్ధంలో సమ్మక్క తరపున పోరాడాడు. యుద్ధం తర్వాత లక్నవరం చెరువు గుట్టల్లో సొరంగంలోకి వెళ్లాడని ఆదివాసీలు నమ్ముతారు. ఈయన నాగలికర్రు రూపంలో వెలిశాడని చెప్పుకుంటారు. మేడారం జాతర ముగిసిన నెల తర్వాత ముసలయ్య జాతర జరుగుతుంది. ఇక్కడ జంతు బలులు ఇచ్చి దేవుణ్ని కొలుస్తారు.

మేడారం జాతర ముగిసిన మూడో రోజున ఈ జాతర జరుగుతుంది. సముద్రుడు, శశిమందాకినికి సూర్యుడి వరం వల్ల పగిడిద్దరాజు పుట్టాడని ఆదివాసీల నమ్మకం. ములుగుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగాపురంలో సూరగొండయ్య జాతర జరుగుతుంది. సూరగొండయ్య కూడా సమ్మక్క బంధువని చెబుతారు. మేడారం జాతర ముగిసిన రెండు నెలల తర్వాత ఈ జాతర జరుగుతుంది. దేవునికి కోళ్లు, మేకలను బలి ఇస్తారు. ఇక్కడ సూరగొండయ్య దేవుడు పూనిన మహిళలతో కొరడా దెబ్బతింటే పిల్లలు పుడతారని ఆదివాసీల నమ్మకం. మరో అనుబంధ జాతర నాగులమ్మ జాతర కొండాయి గ్రామంలో జరుగుతుంది. ఈమె కూడా సమ్మక్క బంధువు. మేడారం  జాతర ముగిసిన నెల తర్వాత ఈ జాతర జరుగుతుంది. అందె అనే ఇంటిపేరు ఉన్న కోయలు నాగులమ్మకు ప్రధాన పూజారులు.ములుగు దగ్గర కార్నేపల్లి గ్రామంలో కార్నేపల్లి జాతర జరుగుతుంది. ఈ గ్రామంలో కలిసి ఉండే సండ్రగూడెంలో సారలమ్మ పులి రూపంలో ఉంటుంది. ఇక్కడే కార్నేపల్లి జాతర జరుగుతుంది. ఇంకో జాతర అన్నారం దగ్గర సమ్మక్క పేరుతో నిర్వహిస్తున్నారు. ఇంకా మేడారానికి దగ్గరలోని గ్రామాల్లో భూపతిపురం జాతర, కేసముద్రం మండలం ముచ్చెర్ల గ్రామంలో వేల్పులమ్మ జాతర, కాసాలనాయుడు జాతర, గుంజేడు ముసలమ్మ జాతర జరుగుతాయి. గుంజేడు ముసలమ్మ, సమ్మక్క అక్కాచెల్లెళ్లు అని ఆదివాసీలు చెబుతారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy