మేరా భారత్ మహాన్ : దేశానికే స్ఫూర్తినిస్తున్న మన జమ్మికుంట

National anthem 2తెలంగాణ రాష్ట్రంలోని ఓ చిన్న పట్టణం…ఇప్పుడు దేశం దృష్టిని ఆకరిస్తోంది. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అక్కడి పోలీసులు తీసుకున్న నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. పట్టణంలో వినిపించే జాతీయ గీతానికి… ప్రజలంతా ఎక్కడికక్కడే నిల్చుని గౌరవించడం ఆకట్టుకుంటోంది. ప్రజల్లో దేశభక్తిని రగిలించి, జాతీయ గీతం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో  ఆగస్టు 15 నుంచి పట్టణంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు కరీంనగర్ జమ్మికుంట పోలీసులు. మొత్తం 16 ప్రధాన కూడళ్లలో మైకుసెట్లు ఏర్పాటు చేసి… ప్రతీరోజు పోలీసు స్టేషన్ నుంచి జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తున్నారు.  ప్రతీరోజు సరిగ్గా ఉదయం 8 గంటలకు అంతా కలిసి జాతీయ గీతం ఆలపిస్తున్నారు.

ప్రేయర్ కు ముందు అందరినీ అలర్ట్ చేసేందుకు… అనౌన్స్ మెంట్  ఇస్తున్నారు. జాతీయ గీతం ప్రారంభం అవ్వగానే.. రోడ్లపై  ఉన్నవాళ్లు, వాహనాలు నడుపుతున్నవాళ్లు, చుట్టు పక్కల కాలనీల వాళ్లు, విద్యార్థులు, వ్యాపారులు అంతా లేచి నిలబడి సెల్యూట్ చేసి మైకులో వినిపించే జాతీయ గీతానికి శృతి కలుపుతున్నారు. గత 16 రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది.

ఇప్పటి వరకు కేవలం సినిమా థియేటర్లకే పరిమితమైన…జాతీయ గీతాలాపనను మొదటిసారిగా ఊరంతా పాటిస్తున్నామంటున్నారు జనం. జాతీయ గీతం వినిపించినంత సేపు… ప్రశాంతంగా నిలబడి అన్నీ మార్చిపోతున్నామని చెప్తున్నరు. మనదేశం, జాతీయ జెండా, జాతీయ గీతం మీద గౌరవం పెరిగిందంటున్నారు.  పండు ముసలి వాళ్లు, వికలాంగులు కూడా నిలబడి సెల్యూట్ చేస్తున్నారు. బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలు ఆపి కిందకు దిగి గీతాలాపన చేస్తున్నారు. మైకు వినిపించినంత మేర ఇండ్లలో ఉండే ప్రజలు కూడా అప్రమత్తమై జాతీయ గీతాన్ని గౌరవిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

ప్రతి రోజు ఒక్కో ఏరియాకు వెళ్లి… జాతీయ గీతం గొప్పదనాన్ని తెలియ చేస్తున్నరు ఈ కార్యక్రమ రూపకర్త సీఐ ప్రశాంత్ రెడ్డి. జాతీయ జెండా విశిష్ఠతను ప్రజలకు వివరిస్తూ.. వారిలో దేశభక్తిని పెంపొందిస్తున్నారు. పలు సెంటర్లలో పోలీసులు అంబలి కేంద్రాలను కూడా ఏర్పాటు చేసారు. జాతీయ గీతాలాపన తర్వాత ఉచితంగా అంబలి పంచుతున్నరు. కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, చాలా మంది సర్పంచులు తమ గ్రామాల్లో కూడా సామూహిక జాతీయ గీతాలాపన ప్రారంభించాలని అంటున్నారని  చెప్పారు సీఐ ప్రశాంత్.

జమ్మికుంటలో కొనసాగుతున్న ఈ కార్యక్రమం విజువల్స్ ఇప్పుడు  వాట్సప్, ఫేస్ బుక్ లలో కూడా చక్కర్లు కొడుతున్నాయి.  ఈ వీడియోలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy