మోడీని ఇరకాటంలో పెట్టిన నయీం

Modi-AmitShahప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఇరుక్కున్న సొహ్రబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులోనూ గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కీలక పాత్రధారి. మోడీ ఇంటరాగేషన్ కోసం కూడా నాడు సీబీఐ ప్రయత్నించింది.

రంజాన్ నాడు తమతో గడపాల్సిందిగా నయీం సొహ్రబుద్దీన్ ను ఆహ్వానించాడు. దీంతో ఈద్ వేడకులక కోసం 2005 నవంబర్ 21న సొహ్రబుద్దీన్ షేక్ తన భార్య కోసర్ బీ తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. సొహ్రబ్ అప్పటికే నయీంకు బాగా తెలుసు. లష్కరే తయీబా తో సంబంధాలు, పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐలతో లింకులు ఉన్న సొహ్రబ్ కోసం గుజరాత్ పోలీసులు వేటాడుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఉజ్జయినికి సమీప గ్రామానికి చెందిన సొహ్రబుద్దీన్ గుజరాత్ నుంచి ఎక్కువగా దందాలు, ఆయుధాల అక్రమరవాణా చేసేవాడు. నయీంతో వ్యాపార విషయాలు  మాట్లాడడానికే అతను హైదరాబాద్ వచ్చాడు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నాక 2005 నవంబర్ 23న నేరుగా గుజరాత్ వెళ్ళకుండా మహారాష్ట్ర లోని సాంగ్లికి బయల్దేరాడు సొహ్రబ్. రాత్రి ఒంటి గంటకు ఇమ్లిబన్ దగ్గర ఓ బస్సులో సొహ్రబ్ ను, షేక్ ను ఎక్కించిన నయీం – బస్సు బయల్దేరి వెళ్ళిన వెంటనే ఆ కబుర్ని పోలీసులకు చేరవేశాడు. అప్పటికే గుజరాత్ పోలీసుల అతని కోసం మాటు వేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటగానే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) మధ్యలో బస్సును ఆపి వారిద్దరినీ దింపేసింది. నయీంను తమతో తీసుకెళ్ళింది. మరికొందరు పోలీసులు కోసర్ బీని వేరే చోటికి తీసికెళ్ళారు. తన భర్తతో పాటు తననూ తీసికెళ్ళాలని కోసర్ బీ పట్టబట్టినా ఆమెను అహ్మదాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ కు బలవంతంగా లాక్కుపోయారు. రెండు రోజుల తర్వాత అహ్మదాబాద్ శివార్లలోని విశాల సర్కిల్ దగ్గర సొహ్రబుద్దీన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు. ఆ తరువాత కోసర్ బీని పీక పిసికి చంపేసి ఇలాల్ అనే గ్రామంలో పాతిపెట్టేశారు. ఆ ఊరు డీసీపీ డీజీ వంజారా సొంతగ్రామం.

ఈ చావులు ఏడాది తర్వాత గానీ బయటికి రాలేదు. ప్రశాంత్ దయాళ్ అనే జర్నలిస్ట్ దగ్గర కొందరు పోలీసులు తాగిన మైకంలో నిజాలు చెప్పేశారు. దాంతో ప్రశాంత్ మొత్తం తానే ఇన్వెస్టిగేట్ చేసి 2006 లో దైనిక్ భాస్కర్ అనే పత్రికలో బాంబులాంటి కథనాన్ని ప్రచురించాడు. ఆఖరికి కోసర్ బీని పూడ్చిపెట్టిన ఊరికి వెళ్ళి నిజాల నిగ్గు తేల్చాడు. విషయం నేషనల్ మీడియాలనూ హైలైట్ అయ్యింది. సొహ్రబ్ సోదరుడు రబాబుద్దీన్  సుప్రీంకోర్టు లో కేసు వేశారు. దాంతో మీడియా ఎటెన్షన్ పెరిగింది. కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం కావడంతో నరేంద్ర మోడీని ఇరికించడానికి కేసును సీబీఐ కి అప్పగించారు. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ డొంకను కదల్చగా నిజాలన్నీ ఒకటొకటిగా బయటపడుతూ వచ్చాయి.  చివరకు సొహ్రబుద్దీన్ ది బూటకపు ఎన్ కౌంటర్ అనీ, ఆయన భార్యపైనా అత్యాచారం చేసి చంపేశారని తేల్చారు. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులు – వంజారా, రాజ్ కుమార్ పాండియన్, ఎం ఎన్ దినేష్ లను దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించారు.

Sohrabuddin_cas17817అప్పటి హోంమంత్రి గా ఉన్న అమిత్ షా మెడకు ఈ కేసు చుట్టుకుంది. ఆయనకు తెలిసే, ఆయన కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని సీబీఐ తన ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సుప్రీం పర్యవేక్షణలో జరుగుతున్న విచారణను దెబ్బతీయడాకి అమిత్ షా ప్రయత్నించారని విచారణాధికారి గీతా జోహ్రి తన రెండో రిపోర్ట్ లో ఆరోపించారు. విచారణ వివరాలను, సాక్షుల వివరాలను తనకు రిపోర్ట్ చేయాలని షా ఆదేశించడం, గీతా జోహ్రిని తొలగించడంతో ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెను నియమించడమే కాక షా తీరును తీవ్రంగా విమర్శించింది. తదనంతరం సొహ్రబ్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా ప్రధాన నిందితుడిగా చేర్చారు. కానీ విచారణ జరిపిన స్పెషల్ కోర్టు ఆయన ప్రమేయంపై సరైన సాక్య్షాధారాల్లేవని కొట్టేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఆయన కూడా నిందితుడేనని అప్పటి కాంగ్రెస్ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. మోడీ విచారణకు సీబీఐ ప్రయత్నించిన సుప్రీంకోర్టు నుంచి అనుమతి లభించలేదు.. ఆయన సీఎం కావడంతో కేసు ఆయన గుమ్మం వరకూ వచ్చి ఆగిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తివారీ వ్యాఖ్యానించారు కూడా..!

సొహ్రబ్ కీ, నయీం కీ చాలా పోలికలున్నాయి. ఇద్దరూ పోలీసులకు, రాజకీయ నేతలకూ ఆప్తులైన వారే..లే.. తమకు శత్రువులనుకున్నవారిని అంతమొందించడానికి అటు నేతలు, ఇటు పోలీసులు ఈ ఇద్దరినీ వాడుకునే వారని మీడియా రిసోర్ట్స్ చెబుతున్నాయి. ఒకప్పటి మోడీ సన్నిహితుడైన బీజేపీ నేత హరేన్ పాండ్యా మర్డర్ కేసును మొదట సొహ్రబ్ కే అప్పగించారు గుజరాత్ లోని ఆయన రాజకీయ శత్రువులు. ఆ విషయాన్ని పోలీసులే స్వయంగా తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే సొహ్రబ్ ఈ పని సరిగా చేయలేడని తులసీరామ్ అనే మరో గ్యాంగ్ స్టర్ కు అప్పగించారు. ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్యా పొరపొచ్చాలు తలెత్తాయి. డబ్బుల విషయంలోనూ గొడవ రేగింది. ఇద్దర్నీ ఎన్ కౌంటర్ చేసేశారు. ఇక్కడ నయీం కూడా అంతే.. పోలీసులకూ, నేతలకు కూడా దందాలలో, హత్యల్లో సాయపడ్డట్లు పబ్లిక్ అందరికీ తెలుసు.. పోలీసులకూ తెలుసు.. చివరకు నయీం కూడా ఎన్ కౌంటర్ అయిపోయాడు.

One Response to మోడీని ఇరకాటంలో పెట్టిన నయీం

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy