మోడీ ఐదో అడుగు : NDA ప్రభుత్వానికి నాలుగేళ్లు

MODI 4మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి (శనివారం మే-26) నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. (26-మే-2014) లో మోడీ ప్రధానిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగేళ్లలో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రధానిగా మోడీది ప్రత్యేక పరిపాలన. ఇందిర తర్వాత దేశంలో అంతటి జనాదరణ కలిగిన నేతగా చరిత్ర సృష్టించగలిగారు. రైట్ వింగ్ పాలిటిక్స్ కు ఒక కొత్త రూట్ నిర్దేశించారు. హిందూయిజం అంటే అంటరానితనం కనబరిచే పార్టీలను బెంబేలెత్తించారు.

ముస్లిం, మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి పోటీలుపడే రాజకీయపక్షాలకు చుక్కలు చూపించారు. గుళ్లు, గోపురాలు తిరుగుతూ తమను తాము ప్రదర్శించుకోక తప్పని అనివార్యతను కల్పించారు. రాజకీయ సిద్ధాంతం మొదలు ఆర్థిక వ్యవస్థ వరకూ మోడీయిజం టు మోడీ నామిక్స్ అన్నట్లుగా రూపాంతరం చెందిన ప్రత్యేక పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. నాలుగేళ్ల పాలనలో నగు బాట్లకు తోడు నవనిర్మాణ సంకల్పమూ కనిపిస్తుంది. దృఢమైన నాయకత్వ పటిమ దేశంలో ఏర్పడిందని దేశవిదేశాలకు చాటిచెప్పడంలో సక్సెస్ అయ్యారు మోడీ.

నోట్ల మార్పిడి
నల్లధనం పట్టుకోవాలి. అవినీతిని అరికట్టాలనే విషయంలో మోడీ చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరు. నోట్ల రద్దు వంటి విషయాల్లో తొందరపాటు తనాన్ని ప్రదర్శించినా దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని ప్రజల్లో మెజార్టీ అర్థం చేసుకొన్నారు. ఈ కారణంగానే దేశంలో నిరసనలు పెద్దగా వెల్లడి కాలేదు. రైతు రుణమాఫీ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా డిమాండ్లు తలెత్తుతున్నప్పటికీ మోడీ సంయమనం పాటించారు. దీనికి తల ఊపితే ఆర్థిక వ్యవస్థకు తప్పుడు సంకేతాలు వెళతాయనే భావించారు. ఈ డిమాండును బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఆయా రాష్ట్ర శాఖలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. ప్రజాకర్షక విధానాల్లో సైతం కొత్త ఒరవడినే ప్రవేశపెట్టారు. సబ్సిడీలకు కోత పెట్టేశారు. గ్యాస్ రాయితీలను క్రమేపీ ఎత్తివేస్తూ ఇంతవరకూ గ్యాస్ వినియోగానికి నోచుకోనివారికి ఉచితంగా సిలిండర్లు అందచేశారు. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ పథకమే. డీజిల్ రేట్లను మార్కెట్ తో అనుసంధానం చేసేసి ఖజానాను నింపుకునే తెలివైన ఎత్తుగడతో ఆర్థికపరిపుష్టిని సమకూర్చుకోగలిగారు. అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు తగ్గినా అది తెలియకుండా ప్రత్యేక సెస్పులతో చాలాతెలివిగా కోశాగారాన్ని నింపేసుకున్నారు. ఈవిషయంలో విమర్శలు ఎంతగా తలెత్తినా ప్రజలు, ప్రతిపక్షాలు పోరాటం చేయలేని ఒక నిర్వీర్యమైన స్థితిని వారికి కల్పించగలిగారు. రోజువారీ మార్పులతో పెంపుదలను గుర్తించలేని ఒక ఉదాసీన స్థితికి ప్రతిపక్షాలను నెట్టేశారు. GST అమలు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఆర్థిక విషయాల్లో దీర్ఘకాల దృష్టి మోడీ పాలనలో కీలక పరిణామం.
రాజకీయంగా..
మోడీ హయాంలో దేశంలో రాజకీయ రాచరికం నెలకొంది. స్వపక్షంలో ఎదురులేని రాజకీయాధిక్యాన్ని సాధించగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే అధ్యక్ష తరహా పాలన కొనసాగుతోందనే చెప్పాలి. ఇంత స్వల్ప వ్యవధిలో ఏ ప్రధాని చేయనన్ని విదేశీపర్యటనలు చేశారు. దేశంలో రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో విదేశాలకు సానుకూల సంకేతం పంపినట్లయింది. భారత్ తో స్నేహసంబంధాలు, పెట్టుబడులకు విదేశాలు పోటీపడే స్థితి ఏర్పడింది. ఇది మోడీ సాధించిన విజయమే. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగింది. బలమైన నాయకత్వం కారణంగా చైనా వంటి దేశాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అంతర్గతంగా శాంతిసుస్థిరత నెలకొన్నప్పుడు విదేశాలు చొరబాట్లకు తెగించాలంటే జంకుతాయి. ఒకవేళ దుస్సాహం చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటాయి. ఈవిషయాన్ని మోడీ నాయకత్వంలోని నాలుగేళ్లపాలన స్పష్టంగా చాటి చెప్పగలిగింది. దాదాపు ముప్పై సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో దేశం అంతర్గతంగా చాలా చితికిపోయింది. విదేశాల్లోనూ లోకువైపోయింది. ఆ స్థితిలో కలగూరగంప ముద్ర నుంచి భారత్ ను బయటపడేసిన వ్యక్తిగా మోడీని చెప్పుకోవాలి. ఇతర పార్టీలతోనూ, సొంత మిత్రపక్షాలతోనూ వ్యవహరించే శైలి చక్రవర్తి సామంతుల తరహాను తలపింపచేస్తుందనేది మోడీపై ఉన్న ప్రధాన విమర్శ. అదే అతని బలమూ, బలహీనత కూడా.

ప్రశంసలు.. విమర్శలు

కుల,కుటుంబ పాలన, ప్రాంతీయ విద్వేషాలతో జాతి సమగ్రతను పణంగా పెడుతున్న పార్టీలకు మోడీ పాలన ఒక హెచ్చరికగానే చెప్పుకోవాలి. తన కరిష్మా, లార్జెర్ దేన్ లైఫ్ ఇమేజ్ తో ప్రాంతీయపార్టీలకు వణుకు పుట్టించగలిగారు. తమ అస్తిత్వం అడుగంటిపోతుంది. చిల్లర డిమాండ్లతో జాతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వాములవుతున్న పార్టీలకు చెక్ పెట్టగలిగారు. అవినీతి మురికిలో కూరుకుపోయిన చిన్నాచితక పార్టీలు చెప్పినట్లు ఆడాల్సిన దుస్థితి నుంచి కేంద్రాన్ని బయటపడేశారు. ఈరోజున ప్రాంతీయ పార్టీల చేతులలో జాతి పగ్గాలు లేవు. నియంతృత్వ పోకడలు, కుటుంబ, కుల పాలనతో ప్రజాస్వామ్యాన్ని కొన్ని పార్టీలు చెరపట్టిన మాట వాస్తవం. తాము చెప్పిందే వేదం. చేసిందే శాసనం అన్నట్లుగా మారింది ఆయా పార్టీల అధినేతల వైఖరి. జాతీయంగా దూసుకొచ్చిన మోడీ వేవ్ వల్ల అటువంటి పార్టీల అరాచకత్వానికి అడ్డుకట్ట పడింది. మోడీ శైలి జాతీయ నియంతృత్వం అనే విమర్శలున్నాయి. దానిని అదుపులో ఉంచుకోగలిగితే బీజేపీకి, మోడీకి పొలిటికల్ హిస్టరీలో లాంగ్ ఇన్నింగ్సుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నాలుగు సంవత్సరాలలో మోడీపై ప్రశంసలతో పాటు..విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ సవాల్ గా ఇక ఎన్నికల ముందు ఎలాంటి హ్యాహాలతో ముందుకెళ్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీకే పట్టం కడతారా లేదా అనేది సస్పెన్స్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy