మోడీ ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్ అయిపోయింది: మమత

కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ‘యునైటెడ్ ఇండియా’ పేరుతో దేశంలోని 20కి పైగా పార్టీల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. కోల్ కత్తాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలో ప్రతిపక్షాల బలాన్ని చాటారు. సభకు హాజరైన ముఖ్య నేతలంతా మోడీ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తామంతా ఏకతాటి మీదికి వచ్చామని చెప్పారు.

ఎవరెవరు ఏమన్నారో చూద్దాం…

బీజేపీకి ఓ పద్ధతంటూ లేదు: మమత

మోడీ ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. త్వరలో దేశం కొత్త వెలుగును చూడబోతోందని ఆమె అన్నారు. ఇందుకోసం తామంతా (ప్రతిపక్షాలంతా) కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. కొత్త ప్రధాని ఎవరవుతారనేది లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక నిర్ణయిస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఓ పద్ధతి అంటూ లేదని, ఆ పార్టీతో కలవని వారందరినీ దొంగలని ఆరోపించడం వారికి అలవాటని మమత ఆరోపించారు. అక్కడంతా ఆ ఇద్దరు వ్యక్తులదే రాజ్యమని, మోడీ ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. తమ కూటమిలో అంతా ప్రతి ఒక్కరూ కార్యకర్తే, ప్రతి ఒక్కరూ నాయకులే అని చెప్పారు.

కార్పొరేట్ల దోస్త.. బీజేపీ : ఖర్గే

రాజ్యంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాలంతా ఒక్కటిగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం వారి కార్పొరేట్ దోస్తుల కోసమే పని చేస్తోందని ఆయన ఆరోపించారు. యువతకు ఏలా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు మాటిచ్చారని, ఆ ఉద్యోగాలు ఎవరికిచ్చారో చెప్పాలని ఖర్గే ప్రశ్నించారు.

బీజేపీ చేసింది శూన్యం: బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

‘మీరు బీజేపీలోనే ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు’ అని ప్రజలు తనను అడుగుతున్నారని  బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా అన్నారు. అయితే తాను నిజం మాట్లాడితే రెబల్ అని అంటారని, అయినా సరే నిజం మాట్లాడడంతో పాటు తన ప్రిన్సిపుల్స్ విషయంలోనూ సర్దుకుపోలేనని ఆయన చెప్పారు. బీజేపీ బోలెడు హామీలు ఇచ్చిందని, కానీ పని చేసింది శూన్యమని ఆయన అన్నారు. దేశం ప్రస్తుతం మార్పు వైపు చూస్తోందని, ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పడు ఎన్నికలు వస్తుండడంతో దేశ ప్రజల దృష్టిని ఆయోధ్య అంశం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.

మోడీ ప్రజల్ని విభజించాలని పాలిస్తున్నారు: సింఘ్వీ

22 పార్టీల రెయిన్ బో ఈ సభ, మోడీ ప్రభుత్వాన్ని దించేయడానికి ఇది సాయపడుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారని, ఆయన తీరుకు ఈ సభ ఒక చారిత్రక సమాధానం లాంటిదన్నారు. బెంగాల్ లో బీజేపీ రథయాత్రను సుప్రీం కోర్టు అడ్డుకోవడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మమత కృషి చేస్తున్నారన్నారు.

మోడీ మళ్లీ గెలిస్తే దేశం ముక్కలే: కేజ్రీవాల్

ప్రధాని మోడీ, అమిత్ షా దేశాన్ని ధ్వంసం చేశారని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. మహిళలను అవమానిస్తున్న వ్యక్తులను మోడీ ట్విట్టర్లో ఫాలో అవుతున్నారన్నారు. రైతులకు కనీసం పంట బీమా కూడా ఇవ్వడం లేదని కేజ్రీ ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో మోడీ-షా కలిసి దేశాన్ని మతం పేరుతో విడగొట్టారన్నారు. వాళ్లు మళ్లీ గెలిస్తే దేశం ముక్కలవడం ఖాయం అని చెప్పారు. ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేస్తారని, అది జరగకుండా ఉండాలంటే వారిని ఓడించాలని కేజ్రీ పిలుపునిచ్చారు.

వాళ్లు మోసగిస్తారు.. జాగ్రత్త:అఖిలేశ్

ప్రజల్ని మోసగించడం కోసం వాళ్లు (బీజేపీ నేతలు)… మహాకూటమిలో చాలా మంది ప్రధానులు ఉన్నారని చెబుతారని, ప్రధాని ఎవరు అవుతారో ప్రజలే నిర్ణయిస్తారని ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ వాళ్లు ఈడీ, సీబీఐతో పొత్తు పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. తాము ప్రజలతో పొత్తు పెట్టుకుంటున్నామని అన్నారు.

 ఈవీఎం.. పెద్ద చోర్: ఫరూక్ అబ్దుల్లా

మతం పేరుతో ప్రజల్ని విడగొట్టారని బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఈశాన్య భారతంలో ప్రజలు భయంతో బతుకుతున్నారన్నారు. భారత్ ను కాపాడడం కోసం మనమంతా త్యాగాలకు సిద్ధపడాలన్నారు. ఈవీఎం పెద్ద చోర్ (దొంగ) మెషీన్ అని, దీనిపై ఈసీకి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

సభకు హాజరైన నాయకులు..

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, మాజీ బీజేపీ లీడర్లు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్,  ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్, జేఎంఎం నేత హేమంత్ సోరేన్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తరఫున ఆ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, అభిషేక్ సింఘ్వీ, జేడీఎస్ చీఫ్, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఆయన తండ్రి దేవెగౌడ, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, నేషనల్ కాన్ఫరెన్స లీడర్ ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా మరికొన్ని రాష్ట్రాల నాయకులు కూడా ఈ సభకు హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభకు బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా హాజరయ్యారు. లక్షలాదిగా ప్రజలు ఈ సభకు తరలి వచ్చారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy