యువ సైంటిస్టులు: కొత్త ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న కరీంనగర్ విద్యార్ధులు

knr
సరికొత్త యంత్రాలు తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు. రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు.. ఫీల్డ్ లో తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి ఓ పరిష్కారం చూపాలనుకుని తయారు చేసిన ఓ యంత్రం ఇప్పుడూ అందరినీ ఆకట్టుకుంటోంది. మెకానికల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో ఒకేసారి నాలుగు పైపులను కటింగ్ చేసే మిషన్ ను తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు.
వీళ్లంతా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చేస్తున్న విద్యార్థులు.. ఫైనల్ ప్రాజెక్టు వర్క్ లో భాగంగా… సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోశారు. రైతు కుటుంబాలకు చెందిన వి.సాయి కృష్ణ, సాయి నాథ్ రెడ్డి, కె.సాయి కృష్ణ అనే ముగ్గురు విద్యార్థులు అన్నదాతల అవసరాలు తీర్చేవిధంగా ఆల్ అగ్రీ మిషన్ తయారు చేశారు.
సాధారణంగా రైతులు పత్తి, ఇతర పంటల్లో పురుగుల మందులు పిచికారికి ఇబ్బందులు పడుతుంటారు. అందుకోసం 200 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ ను అమర్చి.. సోలార్ ప్యానెల్ సిస్టమ్ తో పురుగులు మందు స్ప్రే చేసే విధంగా ఆల్ అగ్రీ మిషన్ రూపొందించారు. ఒక్క పురుగుల మందు పిచికారీ మాత్రమే కాదు.. దీనికి కింద దున్నడానికి వీలుగా మినీ నాగళ్లు, ఇతర పరికరాలు కూడా అమర్చారు. దున్నేటప్పుడు మిషన్ పనిచేయడానికి వీలుగా టూ స్ట్రోక్ బైక్ ఇంజిన్ అమర్చారు. చక్రాల కోసం చెత్త సేకరించే రిక్షాకు వాడే పాత రిమ్ములను తీసుకుని వీల్స్ లాగా తయారు చేశారు. కేవలం 2 లీటర్ల పెట్రోలుతో ఎకరం చేనును దున్నేయవచ్చంటున్నారు విద్యార్థులు
నాగలి స్థానంలో చదును చేసే బ్లేడు, నాటే యంత్రం కూడా అమర్చుకోవచ్చు. వీటితో పురుగు మందులు కొట్టడంతో పాటు, లెవలింగ్, కలుపు తీయడం, దున్నడం, బోదెలు చేయడం లాంటి బహుళ ప్రయోజనాలతో పనిచేసే ఆల్ అగ్రీ మిషన్ ను కేవలం 20 వేల వ్యయంతో తయారు చేశారు. రైతుకు నేస్తంగా ఈ పరికరం ఉపయోగపడుతుందని దీన్ని మరింత అభివృద్ధి చేసి… కేవలం 30 వేలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్లు విద్యార్థులు, అధ్యాపకులు చెబుతున్నారు.
ఇదే కాలేజీకి చెందిన మరో మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాచ్ లోని ఉదయ్ భాను, నవీన్, మహిపాల్, మధులు కలిసి “ఫోర్ వే హాక్సా” అనే యంత్రం తయారు చేశారు. దీనితో నాలుగు వైపులా నాలుగు పైపులను లేదా కర్రలను ఏక కాలంలో కట్ చేసే అవకాశం ఉంది. వర్క్ షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో ఇలాంటి పరికరం ఉంటుంది. కానీ.. వాటితో ఒక పైపును మాత్రమే కట్ చేయవచ్చు. కానీ.. విద్యార్థులు తయారు చేసిన ఫోర్ వే హాక్సా పరికరంతో నాలుగు వైపులా నాలుగు వస్తువులను కట్ చేసే వీలుంటుంది. దీన్ని కూడా చాలా తక్కువ ఖర్చుతో రూపొందించారు. ఫోర్ వే హాక్సా యంత్రంతో మ్యాన్ పవర్ తగ్గించి, పనిని వేగంగా చేయడం సాధ్యమవుతుందంటున్నారు విద్యార్థులు.
ఈ రెండు పరికరాలే కాదు.. మిథనాల్, ఇథనాల్.. పెట్రోల్ లో కలపడంతోపాటు వాహనాల కాలుష్యాన్ని తగ్గించవచ్చన్న మరో ప్రయోగాన్ని విద్యార్థులు చేశారు. సామాజిక అవసరాలనే తమ ప్రాజెక్టు అంశాలుగా ఎంచుకుని.. వాటిని రైతులకు, సామాన్యులకు ఉపయోగపడేలా ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
విద్యార్థులు తయారు చేసిన ఈ పరికారాలను మరింత అభివృద్ధి చేసి.. వీటికి పేటెంట్ కోసం కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపల్, మేనేజ్ మెంట్ చెబుతోంది. రైతులకు సేవచేసే పరికరాలను రూపొందించిన విద్యార్థుల ప్రయోగానికి అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy