రష్యాతో ముప్పుంది.. నేను ఒప్పుకుంటా

Trump-478రష్యా నుంచి అమెరికాకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉన్న మాట నిజమేనని.. ఆ దేశ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నెల 20న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకరించనున్న ఆయన.. విలేకరులతో తొలిసారి ఇష్టాగోష్ఠి జరిపారు. మరోవైపు తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం రష్యా దగ్గర ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నట్లు ఆరోపించారు.

అమెరికాపై రష్యా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని తొలిసారిగా ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. చైనా వంటి ఇతర దేశాలూ తమపై హ్యాకింగ్‌కు తెగబడుతున్నాయని ఆరోపించారు. అయితే, హ్యాకింగ్‌ నిరోధానికి పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటుచేసుకోకపోవడం అమెరికా తప్పేనన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 90 రోజుల్లో హ్యాకింగ్‌ రక్షణ వ్యవస్థపై సరికొత్త నివేదికను అందజేస్తానన్నారు. తన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలకు అమెరికా నిఘాసంస్థలు విడుదల చేసిన నివేదికలే కారణం కావొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అదే వాస్తవమైతే నిఘాసంస్థలకు పెద్ద కళంకంగా మిగిలిపోతుందన్నారు.

తనకు రష్యాలో ఎలాంటి వ్యాపారాలు, రుణాలు, అపరిష్కృత ఒప్పందాలు లేవన్నారు. ఒకవేళ పుతిన్‌ తనను ఇష్టపడుతుంటే దాన్ని ఆస్తిగా భావిస్తాను కానీ రుణంగా కాదని వ్యాఖ్యానించారు. అలాగే తన వ్యాపారాలను మొత్తం ఇద్దరు కుమారులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌లకు పూర్తిగా అప్పగిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసినట్టు చెప్పారు.

వ్యాపార నిర్వహణ గురించి వారు ఇకపై తనతో చర్చించబోరని కూడా స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆస్తులను ట్రస్టు పేరిట బదిలీ చేస్తారని ఈ సందర్భంగా ఆయన న్యాయవాది షేరీ డిల్లాన్‌ తెలిపారు. ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలేవీ విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవని కూడా ఆమె చెప్పారు.

ఇవీ ట్రంప్ విధానాలు..

అక్రమ వలసలను అరికట్టటానికి మెక్సికో సరిహద్దు వెంట త్వరలోనే గోడ కడతామని ట్రంప్‌ తెలిపారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చును మెక్సికో నుంచి రాబడతామన్నారు. అమెరికా కార్మికులను తొలగించి, ఇతర దేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్న కంపెనీలపై భారీ సరిహద్దు పన్నును విధిస్తామని స్పష్టం చేశారు. ఒబామా కేర్‌ పథకాన్ని తొలగించి మరింత సమర్థవంత, చవకైన ఆరోగ్య పథకం ప్రణాళికను విడుదల చేస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు సృష్టించడంలో ప్రపంచంలో తనను మించేవారు ఎవరూ ఉండరని ట్రంప్‌వ్యాఖ్యానించారు. అమెరికన్లకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పానని.. దానికోసం శ్రమిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.