రసాయనం వద్దు..సేంద్రియం ముద్దు

festవ్యవసాయ పరంగా ముందున్న కరీంనగర్ జిల్లాలో పంటల సాగుకు రైతులు రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడుతున్నారు. దీంతో సారవంతమైన భూమి…నిస్సారంగా మారుతోంది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పురుగుమందుల అవశేషాలు… పంట ఉత్పత్తిలో కలిసి జనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే హెచ్చరిస్తున్నారు నిపుణులు.

జిల్లాలో వరి, మొక్కజొన్న, కందులు, పెసర, మినుములు, బొబ్బెర లాంటి పంటలతో పాటు… పెద్ద మొత్తంలో కూరగాయల సాగు జరుగుతోంది. అయితే… చాలా కాలంగా సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన రైతులు.. ఎప్పుడూ ఒకే రకమైన రసాయన ఎరువులు వాడటం అలవాటు చేసుకున్నారు. దీంతో దుష్పలితాలు వస్తాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. గత ఖరీఫ్ లో ఒక్క వరి పంటపై మోతాదుకు మించి విష గుళికలను వాడినట్లు అధికారులు తేల్చారు.

పురుగు మందుల వాడకాన్ని  తగ్గించేందుకు భూసార పరీక్షలు కీలకం. అందుకే.. మండల వ్యవసాయ అధికారులకు మినీ భూసార పరీక్షల కిట్లను అందిస్తోంది సర్కారు. ఇందులో భాగంగా… ఇప్పటికే జిల్లాకు 10 మినీ కిట్లను ఇచ్చారు. భూసార పరీక్షల కేంద్రాలు తక్కువగా ఉండడంతో ఫలితాలు వెల్లడించడం కష్టంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ మినీ కిట్ల సాయంతో..  మట్టి నమూనాలు సేకరించి… నెల రోజుల్లోనే రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 20 వరకు పరీక్షలు పూర్తి చేసి 30 వ తేదీ నాటికి రైతులకు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా సేంద్రీయ ఎరువులు ఏ మోతాదులో వాడాలో వివరించనున్నారు. రైతులకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే సిబ్బంది, అధికారులు లేక ఇంతకాలం రైతులు తమకు తోచిన మందులనే వాడారు. రైతులే స్వయంగా డీలర్ల దగ్గరికి వెళ్లి పంట పరిస్థితిని వివరిస్తే వారిచ్చిన మందులనే వాడేవారు. అయితే వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తోంది వ్యవసాయశాఖ. రైతులను రసాయన ఎరువుల వాడకం నుంచి దూరం చేసి… సేంద్రీయ ఎరువుల వైపు ప్రోత్సహించేలా చేస్తోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన 2 వేల హెక్టార్లలో పంటలు సాగు చేసే రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు చేయాలి. పంటలకు సోకింది రోగమా, తెగులా నిర్దారించిన తర్వాత నివారణకు ఎలాంటి మందులు వాడాలో చెప్తారు. రసాయన ఎరువులు తప్పనిసరైతేనే వాడాలని సూచిస్తారు. లేదంటే సేంద్రీయ ఎరువులు వాడాలని ప్రోత్సహిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఏఈవోలు స్వయంగా మందులు రాయవచ్చని, డిప్లొమా చేసిన ఏఈఓలు మండల వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలనీ చెప్తోంది వ్యవసాయశాఖ. డిప్లొమా చేసి అనుభవం ఉన్న ఏఈవోలు కూడా మందులు సిఫారసు చేసే అవకాశం కల్పిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల సిఫారసు లేనిదే మందులు అమ్మరాదని దుకాణాల డీలర్లకు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు.

అవసరమైతే తప్ప రసాయన ఎరువుల జోలికి పోవద్దని సూచిస్తున్నారు అధికారులు. వ్యవసాయం చేసే ప్రతి రైతు… పశువులను కూడా పెంచాలంటున్నారు. వాటి నుంచి వచ్చే పేడ, ఇతర వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా పంటలకు వాడుకోవాలని చెబుతున్నారు. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు పెంచడంతో ప్రతి రైతు తన భూమికి కావాల్సిన సేంద్రీయ ఎరువును తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ప్రస్తుతానికి రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్న ఆలోచన ప్రణాళిక దశలోనే ఉన్నా… క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఏఈవోల శిక్షణ పూర్తైన తర్వాత… మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు, వ్యవసాయ సంచాలకులంతా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy