రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Rakhiభారతీయ సంస్కృతిలో బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ జీవనంలో తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అత్త, మామ, పెదనాన్న, పెద్దమ్మ, తాత, నానమ్మ.. ఇలా ప్రతి బంధం పెనవేసుకుపోయి ఉంటుంది. ఆ బంధాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ అనుబంధానికి ప్రతీకగా నిలిచేదే రాఖీ పౌర్ణమి.. రక్షాబంధన్.

అమ్మ సగం.. నాన్న సగం కలిస్తే నిండైన అన్న. అమ్మలోని అప్యాయత.. నాన్నలోని బాధ్యత కలగలిసిన అనురాగానికి నిలువెత్తు ప్రతిరూపం అన్న. అంతులేని ప్రేమకు చిరునామా అన్న. అక్కా తమ్ముడు, అన్నా చెల్లెలు అనుబంధానికి అందమైన నిర్వచనమే రక్షాబంధన్. అన్ని వేళలా, అన్నివిధాల తనకు రక్షగా ఉండేందుకు అన్నకు చెల్లి ఇచ్చే కానుక రక్షాబంధన్.

చెల్లెళ్ల అనురాగం… అన్నయ్యల ఆత్మీయత.. అమ్మా నాన్నలో సగమై చెల్లెమ్మకు తోడు నీడై.. కలకాలం ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరుడికి కట్టే బంధనం జన్మజన్మలకు ఇలాగే ఉండాలని  దేవుడిని వేడుకుంటారు. అదే రాఖీ బంధం. రక్షాబంధనం… అంటే అన్న తనకు అన్నివేళాలా రక్షణగా ఉండాలని.. తన ఆశిస్సులు నిత్యం ఉండాలని చెల్లి అన్నకు కట్టే అందమైన బంధం. చెల్లె రాఖీ కడితే.. అన్నకు విజయం వస్తుందన్న నమ్మకం.

అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ములు అంటే ఒకరి సుఖాన్ని, ఉజ్వల భవితవ్యాన్ని మరొకరు కాంక్షించే అందమైన బంధం. అందుకే తమ తోబుట్టువులైన అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారి క్షేమం కోసం భగవంతుని ప్రార్థిస్తారు. ఈ బంధాన్ని మన సినిమాలు కూడా అందంగా చిత్రీకరించాయి.

ప్రతి గడపలో ఎదురు చూపు.. ప్రతి మనసులో మైమరుపు. చెల్లి వస్తుందన్న ఆనందంతో అన్న మనసు పులకరిస్తుంది. తమ్ముడిని చూస్తానన్న సంతోషంతో అక్క మనసు పరవశిస్తుంది. తియ్యని పిండివంటలు అన్నకు, తమ్ముడికి పెట్టి అక్కా చెళ్లెల్లు తమ ఆత్మీయతను అందిస్తే.. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్నలు ఆశీర్వాదిస్తారు. అన్నా.. అన్న పిలుపులో ఎంత ఆనందముంటుందో.. అక్కా అన్న పలకరింపులో అంతటి అనురాగం ప్రతిధ్వనిస్తుంది. అనుభవించే కొద్ది అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఈ బంధాలు ఎన్నడూ తరగనివి. ఎప్పటికీ మరువనివి. ఈ అనుబంధాలు ఎప్పుడూ ఉండేవే అయినా.. ప్రతిసారి కొత్తగానే ఉంటాయి. అలాంటి అక్క, తమ్ముడికి, అన్న చెల్లెల్లకు మరొక సారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy