రాజమౌళీకి థాంక్స్ చెప్పడానికి 9 ఏళ్లుగా ఎదురు చూశా: చెర్రీ

srivalliమగధీర రూపంలో కెరీర్‌లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని అందించిన రాజమౌళి, విజయేంద్రప్రసాద్ లకు.. హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, తొమ్మిదేళ్లుగా ఎదురు చూస్తున్నా అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దానికి శ్రీవల్లి సినిమా వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌చరణ్ ప్రీ రిలీజ్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మగధీర తర్వాత నేను, విజయేంద్రప్రసాద్ ఇదే వేదికపై మళ్లీ కులుసుకున్నాం.  ఈ తండ్రీతనయులు ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ హీరోకు బ్లాక్‌బాస్టర్ హిట్‌లనిచ్చారు. బాలీవుడ్‌లో బజరంగీ భాయిజాన్ తర్వాత ప్రస్తుతం మణికర్ణిక చిత్రానికి కథను అందిస్తున్నారు విజయేంద్రప్రసాద్. ఆ సినిమా మరో బాహుబలి, మగధీర కావాలని కోరుకుంటున్నాను. శ్రీవల్లి విషయానికి వస్తే సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాలను హాలీవుడ్‌లోనే చూశాను. తెలుగులో ఇలాంటి కథాంశంతో  సినిమా రావడం ఇదే తొలిసారి.  గొప్ప రచయిత కథను రాసి తానే దర్శకత్వం వహిస్తే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.  సినిమా కోసం అందరిలాగే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

“రామ్‌చరణ్‌తో మా ప్రయాణం మగధీరతో ప్రారంభమైంది. చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. పరుచూరి బ్రదర్స్ కలం బలం తోడైతే చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో మగధీర – 2 చేస్తాను.  వినూత్నమైన కథాంశంతో శ్రీవల్లి చేశాను. ఇప్పటివరకూ తెరపై ఇలాంటి కథ రాలేదు. విషాదం నుంచి ఈ కథ పుట్టింది. మనిషికి, మనిషికి మధ్య ఉండే భావతరంగాల మధ్య ఏదో సంబంధం ఉంటుందనే ఆ సంఘటన నుంచి ఈ కథ పుట్టింది. మనసుతో నక్షత్రాల్ని చంద్రుడిని, ఎలక్ట్రాన్స్, ప్రోట్రాన్స్ ఎలా ఎన్నో చూస్తున్నాం. అలాంటి మనసును చూడగలిగితే, కొలవగలిగితే  ఏం జరుగుతుందన్నదే  ఈ చిత్ర ఇతివృత్తం. ప్రయోగాత్మక కథాంశంతో ఈ సినిమా చేశాం” అన్నారు విజయేంద్ర ప్రసాద్. తాము నిర్మిస్తున్న మొదటి సినిమా వేడుకకు రామ్‌చరణ్ అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నామని, వైవిధ్యమైన ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ పేర్కొన్నారు. చరణ్ చదివిన పాఠశాలలోనే తాను చదువుకున్నానని, కష్టపడి నిర్మాతలు ఈ సినిమా చేశారని రజత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలేఖ, పరుచూరి గోపాలకృష్ణ, థామస్‌రెడ్డి ఆదూరి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy